న్యూజెర్సీ : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో వైయస్‌ఆర్‌సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. మహానేత వైయస్‌ఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని మేక శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా.. 150 మందికి పైగా హాజరై మహానేత వైయస్‌ఆర్‌ను స్మరించుకున్నారు. ముఖ్య అతిథిగా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ చలమలశెట్టి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలమలశెట్టి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వైయస్‌ఆర్ అమలు చేశారని వివరించారు. మహానేత వైయస్‌ఆర్ ఆశయాలను, ప్రజా సంక్షేమ వారసత్వాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగించారని పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, కేడర్ బలోపేతం కోసం జరుగుతున్న ప్రక్రియను కూడా మధుసూదన్‌రెడ్డి సమావేశంలో వివరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రవాస వైయస్‌ఆర్‌సీపీ ప్రతినిధులకు వివరించారు. 2029లో వైయస్ జగన్ నాయకత్వంలో వైయస్‌ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని వైయస్‌ఆర్‌సీపీ బృందాలు పార్టీ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని మధుసూదన్‌రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ గ్లోబల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఆలూరు సాంబశివారెడ్డితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ అధినేతతో పాటు అన్ని స్థాయిల నాయకులతో సమన్వయం చేసుకునే అవకాశం ఉన్నందున గ్లోబల్ కో-ఆర్డినేటర్‌తో కలిసి పనిచేయడం ద్వారా పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ అమెరికా విభాగం నాయకులు డాక్టర్ రాఘవరెడ్డి, అల్లా రామిరెడ్డి, రత్నాకర్ తదితరులు ప్రసంగించారు. డాక్టర్ వైయస్‌ఆర్ ప్రజా సేవ, సంక్షేమ కార్యక్రమాలు, వైయస్‌ఆర్‌సీపీ ప్రస్థానం గురించి వారు వివరించారు. మహానేత వైయస్‌ఆర్ భౌతికంగా దూరమై 17 ఏళ్లు గడిచినా ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ వైయస్‌ఆర్‌సీపీ అమెరికా బృందం కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన పెప్పర్స్ రెస్టారెంట్ యాజమాన్యానికి, మంచి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.