తాడేపల్లి: బొలేరో వ్యాన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక పేద మత్స్యకార కుటుంబానికి చెందిన తిరుమలశెట్టి కనకరాజును పోలీసులు వేధింపులకు గురిచేసి, చిత్రహింసలు పెట్టి, జీవనాధారమైన వ్యాన్‌ను సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించి, చివరకు పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే పరిస్థితికి నెట్టారని కృతివెన్ను జెడ్పీటీసీ, కనకరాజు భార్య మైలా రత్నకుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కనకరాజు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం బాధితుడి భార్య లక్ష్మీ దుర్గా భవానితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన ఘటన కాదు. ఒక పేద కుటుంబం మీద అధికార వ్యవస్థ ఎలా దాష్టీకం చేస్తుందో చెప్పడానికి కనకరాజు ఘటన ఒక నిదర్శనం. పోలీసులు రక్షించాల్సిన ప్రజలను భయపెట్టి, కొట్టి, అవమానించి, చివరకు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి తీసుకెళ్లడం అత్యంత దారుణం” అని అన్నారు. కనకరాజుపై దాష్టీకానికి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేనిపక్షంలోవైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు, ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలబడి ఎంతటి పోరాటానికైనా పార్టీ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొడిగట్టిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో.. 'రెడ్ బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోంది. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే, ప్రాణాలు తీసే భక్షకులుగా మారుతున్న దారుణ పరిస్థితులకు బంటుమిల్లిలో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. రెక్కాడితే గానీ డొక్కాడని ఒక నిరుపేద మత్స్యకార (అగ్నికుల క్షత్రియ) బిడ్డపై ఖాకీలు చూపించిన పైశాచికత్వం.. ఈరోజు ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పోలీసుల రాక్షసానందానికి, వేధింపులకు బలైన ఆ వ్యక్తి ఈరోజు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వీడియో తీసినందుకు ప్రాణం తీసేంత శిక్షా? బంటుమిల్లికి చెందిన తిరుమలశెట్టి కనకరాజు ఒక బొలెరో వ్యాన్ నడుపుకొంటూ భార్యాపిల్లలను పోషించుకుంటున్నాడు. విజయవాడ నుంచి వస్తున్న క్రమంలో దారిలో హారన్ వేశాడన్న ఒకే ఒక్క కారణంతో బంటుమిల్లి ఎస్ఐ నాగరాజు అహం దెబ్బతింది. "నా ముందే హారన్ కొడతావా?" అంటూ హోంగార్డ్, కానిస్టేబుళ్లతో కలిసి కనకరాజును నడిరోడ్డుపై నానా దుర్భాషలాడారు. చేతులు జోడించి "క్షమించండి సార్, నా తప్పు ఉంటే ఫైన్ వేయండి" అని బతిమాలుకున్నా వినకుండా, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బంటుమిల్లి పోలీస్ స్టేషన్ ఒక చిత్రహింసల శిబిరంగా మారింది. గదిలో బంధించి, ఆ నిరుపేద డ్రైవర్ బట్టలు విప్పేసి, వివస్త్రుడిని చేసి.. బూటు కాళ్లతో తొక్కుతూ లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. తప్పు చేయకపోయినా.. కనీసం రోడ్డు మీద చేయాల్సిన తనిఖీలను పక్కనపెట్టి, స్టేషన్ లోపల అక్రమంగా 'డ్రంక్ అండ్ డ్రైవ్' కేసు నమోదు చేశారు. అతని సెల్ ఫోన్, బతుకుదెరువైన వాహనాన్ని లాక్కుని రాత్రికి ఇంటికి గెంటేశారు. మరుసటి రోజు ఉదయం కనకరాజు స్టేషన్‌కు వెళ్లి.. "సార్, ఫైన్ ఎంతైనా కడతాను, ఆ వ్యాన్ లేకపోతే నా భార్యాబిడ్డలు పస్తులుండాలి, నా బండి నాకు ఇచ్చేయండి" అని ఎస్ఐ కాళ్ల మీద పడి కన్నీరుమున్నీరుగా ప్రాధేయపడ్డాడు. కానీ ఆ ఖాకీ గుండె కరగలేదు. "నీ వ్యాన్ ఇచ్చే ప్రసక్తే లేదు, నీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయిస్తా, పాత కేసులన్నీ నీ మీద బనాయిస్తా.. ఇక మీదట నీది కుక్క బతుకే" అంటూ అత్యంత నీచమైన భాషలో ఎస్ఐ దూషించాడు. అవమానం భరించలేక.. ఆత్మహత్యాయత్నం శారీరక హింసకు తోడు, మానసికంగా ఎస్ఐ చేసిన బెదిరింపులకు కనకరాజు కుంగిపోయాడు. తన బతుకుదెరువు పోయిందని, ఇకపై తన భార్యాపిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. న్యాయం జరగదన్న నిర్వేదంతో, అదే పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించాడు. వ్యవస్థల మీద సామాన్యుడికి నమ్మకం సన్నగిల్లి అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆ ఇల్లాలి కన్నీరు తుడిచేదెవరు? ఆ పిల్లలకు దిక్కెవరు? ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కనకరాజు భార్య లక్ష్మీ దుర్గా భవాని కన్నీరు చూస్తే ఏ గుండె అయినా కరిగిపోతుంది. ఆయనే మమ్మల్ని పోషించేది. ఎంతో కష్టపడి ఆ బండి తెచ్చుకున్నారు. పోలీసులు ఆయన్ని ఒక మనిషిలా కూడా చూడలేదు, బూటు కాళ్లతో తొక్కారు. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆయనకు ఏమైనా జరిగితే మా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటి? మాకు దిక్కెవరు? అని ఆమె రోదిస్తున్న తీరు చూస్తుంటే.. రాష్ట్రంలో పేదలకు బతికే హక్కు లేదా అనిపిస్తోంది. ఖాకీల క్రౌర్యాన్ని కప్పిపుచ్చుతున్న ఎల్లో మీడియా ఒక అగ్నికుల క్షత్రియ బిడ్డపై ఇంతటి పైశాచికత్వం జరిగినా ఇప్పటివరకు ఎస్ఐ పై గానీ, హోంగార్డ్ పై గానీ ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. పైగా ఈ ఘటనను తప్పుదోవ పట్టించి, సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్ర జరుగుతోంది. కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాసే 'ఎల్లో మీడియా' మానవత్వం మరచి, పోలీసుల అక్రమాలను కప్పిపుచ్చుతూ వార్తలు వక్రీకరిస్తోంది. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. కనకరాజు లాంటి సామాన్యులపై దాష్టీకానికి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. లేనిపక్షంలో వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు, ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలబడి ఎంతటి పోరాటానికైనా పార్టీ సిద్ధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. నీ బతుకు కుక్కు బతుకు చేస్తామని బెదిరించారు - కనకరాజు భార్య లక్ష్మీ దుర్గా భవాని నీ బతుకు కుక్క బతుకే చేస్తాను.. నీ వ్యాన్ రాదు.. నీ లైసెన్స్ రద్దు చేస్తాను.. ఆర్టీవోతో మాట్లాడి నీ మీద కేసులు పెడతాను.. నిన్ను జీవితంలో డ్రైవింగ్ చేయకుండా చేస్తాను అంటూ బెదిరించారు. వీడియో తీసినందుకే పోలీసులు కక్ష పెట్టుకున్నారని కనకరాజు భయపడ్డారు. ‘వీడియో తీసిన తప్పు నాదే.. నన్ను క్షమించండి.. నా ఫోన్ ఇవ్వండి.. నా వ్యాన్ ఇవ్వండి.. నా కుటుంబాన్ని పోషించుకోనివ్వండి’ అంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరం చూపలేదు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన మామూలు మనిషిగా లేరు. మానసికంగా పూర్తిగా కుంగిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. తినలేకపోయారు. నిద్రపోలేకపోయారు. తన వ్యాన్, మొబైల్ ఇచ్చేయాలని, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. అయినా కనికరం చూపలేదు. నా భార్య, పిల్లలను పోషించుకోలేని ఈ బతుకు ఎందుకు అని ఆయన కుంగిపోయారు. నా వ్యాన్ ఇవ్వాలి.. లేదంటే ఇక్కడే బూడిద అయిపోతాను అనే పరిస్థితికి తీసుకొచ్చారు. చివరకు పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇప్పుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నారు. (కన్నీటి పర్యంతమయ్యారు.)