డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ ర్యాలీలకు పోలీసు ఆంక్షలు

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమైన వైయ‌స్ఆర్‌సీపీ.. పలుచోట్ల నేతలకు నోటీసులు

ర్యాలీకి వస్తే కేసులు, వాహనాలు సీజ్‌ చేస్తామంటూ హెచ్చరికలు

తాడిపత్రి నుంచి కుప్పం వరకు పలు నియోజకవర్గాల్లో పోలీసుల మోహరింపు

తాడేపల్లి: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలకు పలు ప్రాంతాల్లో పోలీసు ఆంక్షలు ఎదురయ్యాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలకు వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునివ్వగా, పలుచోట్ల ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. ర్యాలీలకు వస్తే కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు.

విశాఖలో ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు పార్టీ నాయకులకు ఫోన్ చేసి ర్యాలీకి అనుమతి లేదని చెప్పినట్లు సమాచారం. ర్యాలీలకు రావద్దంటూ పార్టీ శ్రేణులను హెచ్చరించడంతో పాటు నిరసన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గాజువాకలో ర్యాలీకి బయలుదేరిన నియోజకవర్గ సమన్వయకర్త దేవన్‌రెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీలకు వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధమవగా, అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. కాకినాడ జిల్లా తునిలోనూ ర్యాలీకి అనుమతి లేదంటూ పార్టీ ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేసి, సెక్షన్‌ 30 అమల్లో ఉందని పోలీసులు పేర్కొన్నారు.

విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చిన పోలీసులు, ర్యాలీ నిర్వహిస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులోనూ ర్యాలీకి అనుమతి లేదంటూ జెడ్పీటీసీ వై. రామచంద్రారెడ్డి, లీగల్‌ సెల్‌ నాయకుడు శిరసాని ప్రకాష్‌ సహా పలువురు నేతలకు నోటీసులు ఇచ్చారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీకి ఏర్పాట్లు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి స్వగృహం నుంచి బయటకు వస్తుండగా పోలీసులు నిలువరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తాడిపత్రికి వస్తున్న పార్టీ శ్రేణుల వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ ర్యాలీకి అనుమతి లేదంటూ డీఎస్పీ పార్థసారథి నోటీసులు జారీ చేశారు. టీడీపీ విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించడం ఏకపక్ష వైఖరికి నిదర్శనమని పార్టీ నేతలు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కర్నూలులోనూ డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అర్థరాత్రి పార్టీ నేతలకు నోటీసులు అందజేసి, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి కూడా అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి నేతల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేయడం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కలెక్టర్లకు వినతిపత్రాలు, టౌన్‌హాల్‌ సమావేశాలు, రిలే నిరాహార దీక్షల రూపంలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు చేపట్టింది. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ర్యాలీలకు పిలుపునిచ్చింది. డీఎస్సీ–2025 వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ స్పష్టం చేసింది.

Back to Top