ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూడటం దారుణం

పోలీసులతో వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళనలను అడ్డుకోలేరు

కూటమి ప్రభుత్వంపై మార్గాని భరత్ రామ్ ఫైర్

అక్రమంగా హౌస్ అరెస్ట్ చేశారంటూ ఆందోళన

భారీగా తరలివచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

లోకేష్ రాజీనామా చేసేవరకు వెనక్కి తగ్గేది లేదు

మెడికో ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాల్సిందే

విద్యాసంస్థల బంద్‌ను అడ్డుకోవడానికి కుట్రలు

రాజమహేంద్రవరం: ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్గాని భరత్ రామ్ మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టే శాంతియుత ఆందోళనలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి అమలు చేయాలనే డిమాండ్లతో సోమవారం రాజమహేంద్రవరంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గోకవరం బస్టాండ్ ఆనం కళా కేంద్రం నుంచి పేపర్ మిల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ నేపథ్యంలో మార్గాని భరత్ రామ్ నివాసం వద్ద సోమవారం ఉదయం నుంచే పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. ర్యాలీకి వెళ్లకుండా ఆయనను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఆయన నివాసానికి చేరుకుని ఆందోళనకు దిగారు. వందలాది మంది పోలీసులు మోహరించి భరత్‌ను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసుల తీరును నిరసిస్తూ మార్గాని భరత్ రామ్ ఇంటి వద్దే ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైతే హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, ఇటువంటి విధానాలు ఎల్లకాలం కొనసాగవని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమని భరత్ రామ్ పేర్కొన్నారు.

డీఎస్సీ వ్యవహారంపై వైయ‌స్ఆర్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని భరత్ రామ్ స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గు తేల్చే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మెడికో ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాల్సిందే

మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ స్పందించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిన తరువాతే పోలీసులు విచారణ ప్రారంభించారని పేర్కొన్నారు. నిందితులకు అండగా నిలిచిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రియాంక కుటుంబానికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఉన్నప్పటికీ ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయలేకపోవడం దారుణమన్నారు. మెడికో ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విద్యాసంస్థల బంద్‌ను అడ్డుకునేందుకు కుట్రలు

మెడికో ప్రియాంక మృతికి సంతాపంగా, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం విద్యాసంస్థల బంద్‌కు వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునిచ్చిందని భరత్ రామ్ తెలిపారు. ఈ బంద్‌ను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డిందని ఆరోపించారు.

ప్రజా సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని అడ్డుకునేందుకు ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని మార్గాని భరత్ రామ్ స్పష్టం చేశారు. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిరంతర పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top