డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ ర్యాలీలకు పోటెత్తిన జనం

పోలీసు ఆంక్షలు, నోటీసులు, అరెస్టులు, హౌస్‌ అరెస్టుల మధ్య రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన నిరసనలు

సీబీఐ విచారణ జరపాల్సిందే.. లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందే

డీఎస్సీ బాధితులు, నిరుద్యోగ యువతకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమం

తాడేపల్లి: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టిన ఈ ఆందోళనలకు డీఎస్సీ బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు, జెన్‌జీ యువత, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులను రంగంలోకి దించిందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. పలుచోట్ల అర్ధరాత్రి నుంచే నాయకుల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇవ్వడం, ర్యాలీలకు అనుమతి లేదని హెచ్చరించడం, ర్యాలీకి వస్తే కేసులు పెడతామని, బైకులు, కార్లు సీజ్‌ చేస్తామని బెదిరించడం, హౌస్‌ అరెస్టులు చేయడం, భారీగా పోలీసులను మోహరించడం వంటి చర్యలు చేపట్టినా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు.

- రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిమాండ్

డీఎస్సీ–2025 నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలి. బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలి. ఈ వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలి.

కలెక్టర్లకు వినతిపత్రాలు, టౌన్‌హాల్‌ సమావేశాలు, రిలే నిరాహార దీక్షల అనంతరం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలతో వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది.

పోలీసుల ఆంక్షలు, నోటీసులు, అరెస్టులు, హౌస్‌ అరెస్టులు, బారికేడ్లు, వాహనాల తనిఖీలు, ర్యాలీలకు అనుమతి నిరాకరణ వంటి చర్యల మధ్య కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి రావడం డీఎస్సీ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని పార్టీ నేతలు పేర్కొన్నారు.

డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పే వరకు, సీబీఐ విచారణకు సిద్ధమయ్యే వరకు, బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగదని పార్టీ స్పష్టం చేసింది.

నిర‌స‌న కార్య‌క్ర‌మాలు ఎలా జ‌రిగాయంటే..జిల్లాల వారీగా..:

- శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ–2025 అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని పార్టీ శ్రేణులు నినదించాయి.

- విజయనగరం జిల్లా

చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, సీబీఐ విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

- విశాఖపట్నం జిల్లా

విశాఖలో వైయ‌స్ఆర్‌సీపీ నిరసన ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలకు రావద్దంటూ పార్టీ శ్రేణులకు ఫోన్లు చేసి హెచ్చరించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని, బైకులు, కార్లు సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిరసన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

విశాఖ తూర్పులో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేకే రాజును అరెస్టు చేయడంతో పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని జగదాంబ జంక్షన్‌లో ర్యాలీని అడ్డుకున్నారు.

విశాఖ నార్త్‌లో ర్యాలీకి వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల బైక్‌ తాళాలను పోలీసులు తీసుకున్నారు. గాజువాకలో ర్యాలీకి బయలుదేరిన నియోజకవర్గ సమన్వయకర్త దేవన్‌రెడ్డిని ఇంటి వద్దే అడ్డుకుని ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు.

- పార్వతీపురం మన్యం జిల్లా

చినమేరంగిలో మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యువజన, విద్యార్థి విభాగాల నాయకులను ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

- అనకాపల్లి జిల్లా

నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆయన ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ డీఎస్సీ అక్రమాలపై నిరసన కొనసాగిస్తామని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.

- తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లాలో మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ పలువురు నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మాజీ ఎంపీ మార్గాని భరత్‌, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. మార్గాని భరత్‌ ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. కార్యకర్తలను లోపలికి రానివ్వకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. పిఠాపురంలో వంగా గీత ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. తూరంగిలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలోని బొమ్మూరులో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

- విజ‌య‌వాడ‌

విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ర్యాలీకి సిద్ధమయ్యాయి.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో, దేవినేని అవినాష్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. పోలీసుల అడ్డంకులను అధిగమించి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ముందుకు సాగాయి.

పామర్రులో కైలే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గన్నవరంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించినప్పటికీ వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది.

- ఎన్టీఆర్‌ జిల్లా

తిరువూరు నియోజకవర్గంలో ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. జెడ్పీటీసీ వై. రామచంద్రారెడ్డి, విస్సన్నపేట లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి శిరసాని ప్రకాష్‌ సహా పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ జరగనున్న ఫ్యాక్టరీ సెంటర్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

- కృష్ణా జిల్లా

పెనమలూరు నియోజకవర్గంలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని నాయకులు కోరారు.

గన్నవరంలో పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పార్టీ శ్రేణులు రోడ్డుపై ధర్నాకు దిగాయి.

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అర్ధరాత్రి వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేశారు. ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ మంత్రి కొడాలి నానిని హౌస్‌ అరెస్టు చేశారు.

- గుంటూరు జిల్లా

గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. స్పోర్ట్స్‌ కోటా పేరుతో తీసుకొచ్చిన జీవోలు, జీవో నంబర్లు 4, 47 ద్వారా జరిగిన మార్పులపై పార్టీ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.

పొన్నూరులో పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ ఏర్పాటు చేసిన టెంట్‌ను తొలగించడంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శంకర్‌విలాస్‌ నుంచి లాడ్జి సెంటర్‌ వరకు భారీ నిరసన ర్యాలీ జరిగింది.

- ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ–2025 అక్రమాలపై నిరసన ర్యాలీలు చేపట్టారు. ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున‌, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని నాయకులు, కార్యకర్తలు నినదించారు.

- నెల్లూరు జిల్లా

నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతతో భారీ నిరసన ర్యాలీ జరిగింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. పోలీసులు భారీగా మోహరించి ర్యాలీకి అనుమతి లేదని చెప్పినా అంబేద్కర్‌ సర్కిల్‌ వద్దకు విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

మనుబోలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కాకాణి పూజిత ఆధ్వర్యంలో వీరభద్ర దేవస్థానం నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.

ఇందుకూరుపేటలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

- బాపట్ల జిల్లా

బాపట్లలో డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా పేరుతో జరిగిన వ్యవహారంపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. క్యారం బోర్డు ఆడుతూ “మాకు కూడా డీఎస్సీ ఉద్యోగాలు ఇవ్వండి” అంటూ నిరసన తెలిపారు.

చీరాల నియోజకవర్గంలో కరణం వెంకటేష్‌బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

వేమూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

- అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్‌, ఉషాశ్రీ చరణ్‌, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ నిరసన ర్యాలీకి సిద్ధమయ్యారు. స్వగృహం నుంచి బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తాడిపత్రికి వస్తున్న పార్టీ శ్రేణుల వాహనాలను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

హిందూపురం నియోజకవర్గంలో ఇన్‌చార్జ్‌ దీపిక వేణురెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతపురంలో డీఎస్సీ అభ్యర్థుల నుంచి వచ్చిన 35 వేల ఫిర్యాదులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. డీఎస్సీ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

- కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ అవకతవకలపై నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాలీకి అనుమతి లేదంటూ కర్నూలు టూ టౌన్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ నేతలకు అర్ధరాత్రి నోటీసులు అందించారు.

కర్నూలులో బుట్టా రేణుక, ఎస్వీ విజయమనోహరిని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగింది.

- నంద్యాల జిల్లా

నంద్యాల జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్‌బాషా, కల్పలతారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

- వైయ‌స్‌ఆర్‌ జిల్లా

కడపలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి డీఎస్సీ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ పార్టీ శ్రేణులు ముందుకు సాగాయి.

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధమైన నాయకులు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు.

బద్వేలులో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్సీ గోవింద్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఆదిత్యరెడ్డి పాల్గొన్నారు.

పులివెందులలో ఆర్డీఓ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారని, లాఠీఛార్జ్‌ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

- చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లాలో డీఎస్సీ–2025 అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతంగా కొనసాగాయి.

పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది.

చిత్తూరు నగరంలో గంగినేని చెరువు నుంచి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పోలీసుల అడ్డంకులను అధిగమించి నిరసన కొనసాగించారు.

కుప్పంలో ఎమ్మెల్సీ భరత్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్దే కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. కుప్పానికి వచ్చే ప్రధాన రహదారుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

టీడీపీ విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇచ్చి, వైయ‌స్ఆర్‌సీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

- తిరుపతి జిల్లా

తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి నాయకత్వంలో, భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గతంలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి మద్దతు తెలిపారు.

శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ డీఎస్సీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని ర్యాలీలో నినాదాలు చేశారు. 

Back to Top