తాడేపల్లి: డీఎస్సీ–2025లో బయట పడుతున్న అంతులేని అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ, మెరిట్ జాబితాల మార్పులు, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంధిస్తున్న నిర్దిష్టమైన ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం చెప్పలేని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అసలు ఏమీ జరగలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని ప్రజలను నమ్మించే విఫల ప్రయత్నం చేస్తోందని వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. డీఎస్సీ–2025 అక్రమాలపై తమ పార్టీ ప్రశ్నించడానికి ముందే, బాధిత అభ్యర్థులే ముందుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై కోర్టులను ఆశ్రయించారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత జగన్‌గారు ప్రతి ఒక్క విషయాన్ని పక్కా ఆధారాలతో ప్రశ్నించిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో గత రెండున్నర నెలలుగా వైయస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే డీఎస్సీలో అక్రమాలకు నిదర్శనమని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: అక్రమాలన్నీ బద్ధలు కొడతాం. ఆందోళన సాగిస్తాం: డీఎస్సీ–2025 అక్రమాలను కప్పి పుచ్చడం సాధ్యం కాదు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. డీఎస్సీ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి. నిరుద్యోగ భృతి కచ్చితంగా అమలు చేయాలి. అప్పటి వరకు మా పార్టీ ఆందోళన కార్యక్రమం ఆగబోదు. తప్పు జరగలేదనే ధైర్యం ఉంటే మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకుని స్వతంత్ర దర్యాప్తును ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలి. బుకాయింపులు, ఎదురుదాడులు, ఫేక్ ప్రచారం, స్టేజ్ మేనేజ్ షోలు, పోలీసు కేసులు, అరెస్టులతో నిజాన్ని శాశ్వతంగా దాచలేరు. డీఎస్సీ అక్రమాల మూలాలను బయటకు తీసే వరకు, బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఆగదు. ప్రభుత్వం ఎంత నిర్బంధానికి దిగితే అంత తీవ్రంగా ప్రజల్లోకి వెళ్తాం. పార్టీ కార్యక్రమాలపై నిర్భంధం: డీఎస్సీ–2025లో అక్రమాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై వైయస్సార్‌సీపీ చేపడుతున్న ఆందోళలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. డీఎస్సీ–2025 నిర్వహణలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన దారుణ అక్రమాలను నమ్మారు కాబట్టే, అంతా కదిలి వస్తున్నారు. దీంతో మా పార్టీ కార్యక్రమాలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే సెక్షన్–30, సెక్షన్–144 పేరుతో నోటీసులు ఇస్తోంది. ఇష్టానుసారం పార్టీ నాయకుల గృహ నిర్భంధాలు చేశారు. ముఖ్య నాయకులను దౌర్జన్యంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కిరాయి సైన్యంలా పోలీసుల వినియోగం: పోలీసులను కిరాయి సైన్యంలా ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వినియోగిస్తోంది. కుప్పంలో మా పార్టీ ఎమ్మెల్సీ భరత్‌ను దౌర్జన్యంగా గృహ నిర్భంధం చేసిన పోలీసులు, సెక్షన్–30 అమలులో ఉందంటూ వాదించారు. అదే సమయంలో వెన్నుపోటు పార్టీ కూటమి కార్యకర్తలకు పార్టీ జెండాలతో రోడ్లపై స్వైర విహారం చేస్తూ వస్తుంటే, వారికి ఎస్కార్ట్‌గా నిల్చారు. వారు ఎమ్మెల్సీ భరత్ ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు చోద్యం చేస్తూ కూర్చున్నారు. పులివెందులలో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చేందుకు పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లగా, లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేశారు. అసలు అక్కడ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన తప్పేమిటి? ఆర్డీఓకు వినతిపత్రం ఇవ్వాలనుకోవడం కూడా నేరమా? ఇంకా తాడిపత్రితో సహా పలు చోట్ల ముఖ్యనాయకులపై దౌర్జన్యంగా వ్యవహరించారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణను కూడా దారుణంగా అడ్డుకున్నారు. (అంటూ ప్రెస్‌మీట్‌లో ఆ వీడియోలు, ఫోటోలు ప్రదర్శించి చూపారు) అసలు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు?: డీఎస్సీ–2025 పేపర్‌లీక్ అయిన మాట వాస్తవం. కాదంటారా? అసలు ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత ఒకరికే (ఎస్‌సీఈఆర్‌టీ) ఎలా కట్టబెడతారు? అత్యంత గోప్యమైన డిజిటల్ వ్యవహారాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎందుకు ఉంచారు? అదే ఎస్‌సీఈఆర్‌టీలో పని చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక పోస్టులో మొదటి ర్యాంకు, మరో పోస్టులో ఆరో ర్యాంకు సాధించిన తర్వాత అతని పేరు మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? మొదటి మెరిట్ లిస్ట్‌ను మార్చి రెండో జాబితా ఎందుకు విడుదల చేశారు? అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో పిలిచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా కొందరికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు. పరీక్ష నిర్వహణకు ముందు గతంలో ఉన్న నిబంధనలు కాదని, కొత్త నియమావళితో ప్రత్యేకంగా ఎందుకు జీఓలు జారీ చేశారు. ఒకవేళ మీరు ఎంచుకున్న కొత్త నిబంధనలు సక్రమమే అయితే, వాటిని ఇంకా కొనసాగించకుండా, నియామకాలు పూర్తి కాగానే, ఆ జీఓలు ఎందుకు రద్దు చేశారు? డిగ్రీ లేకుండానే, టెట్ అర్హత లేకుండానే, కేవలం శాప్ ఇచ్చిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? ఇలా ఎక్కడైనా జరుగుతుందా?. నిజంగా ఆ మినహాయింపు సమర్థనీయం అయితే నియామకాలు ముగిసిన వెంటనే దాన్ని ఎందుకు రద్దు చేశారు? స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో ఒక అభ్యర్థికి సంబంధించిన ప్రధాన సర్టిఫికెట్‌కు మరొకరి బ్యాకప్ సర్టిఫికెట్ జత చేయడం, వేర్వేరు క్రీడలకు చెందిన సర్టిఫికెట్లను కలపడం, ట్యాంపరింగ్ చేయడం.. ఈ అక్రమాలన్నీ బయట పడిన తర్వాత వెబ్‌సైట్‌లో వాటిని మార్చే ప్రయత్నం చేశారు. కాదంటారా? ఇంకా ఉద్యోగాల కోసం డబ్బుల లావాదేవీలకు సంబంధించిన వీడియో, ఫోన్ నంబర్ బయటపడినా వ్యక్తిని గుర్తించి పూర్తి నెట్‌వర్క్‌ను వెలికి తీయకుండా, కేసును నీరు గార్చడం వెనుక ఎవరున్నారో కూడా తేలాల్సిందే. ఏ తప్పూ చేయకపోతే ఎందుకంత భయం? ఎందుకీ డ్రామాలు. స్టేజ్ మేనేజ్ షోలు?: ఈ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా ఉద్యోగాలు వచ్చిన కొందరిని ముందుకు తెచ్చి ‘అంతా బాగుంది’. ‘ఎక్కడా ఏం జరగలేదని’ చెప్పించడం సమస్యకు సమాధానం కాదు. ఉద్యోగం వచ్చిన వారు సంతోషంగా ఉండటం సహజమేనని, కానీ ఉద్యోగం రాని అర్హులైన అభ్యర్థులు చూపిస్తున్న ఆధారాలు, మెరిట్ లిస్ట్‌ల మార్పులు, జీవోల మార్పులు, లీకేజీకి సంబంధించిన డిజిటల్ లింకులు, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లలో బయటపడిన తేడాల గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదు?. నిజంగా డీఎస్సీలో అక్రమాలు జరిగి ఉండకపోతే మీకు ఎందుకంత భయం? ధైర్యంగా సీబీఐ దర్యాప్తునకు ఒప్పుకోవచ్చు కదా? అంతకు ముందే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయొచ్చు కదా? ఆ తర్వాత విచారణలో దోషిత్వం తేలకపోతే పునీతులై రావొచ్చు కదా? అవేవీ చేయకుండా ఎందుకీ ఎదురుదాడి? నాటకాలు? డీఎస్సీకి ఎంపికైన వారితో స్టేజ్ మేనేజ్ షోలు?. వెనక్కి తగ్గేది లేదు. అప్పటి వరకు ఆపేది లేదు: శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకునేందుకు వేల మంది పోలీసులను మోహరిస్తున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణను పూర్తిగా గాలికొదిలేసింది. అయితే ఎంత అణచివేస్తే అంతగా ఉద్యమం బలపడుతుంది. గోడకు కొట్టిన బంతిలా ప్రజా ఆగ్రహం మరింత బలంగా తిరిగి వస్తుంది. డీఎస్సీ–2025లో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా, మొత్తం ఆ పరీక్షపై సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలతో సహా, పూర్తి చెల్లింపులు జరిగే వరకు వైయస్సార్‌సీపీ పోరాటం ఆపబోదని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.