బొండా ఉమా  తీరు మార్చుకోకుంటే ప్రజా ఉద్యమం తప్పదు

ఆయన వ్యవహార శైలిపై చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలి

 మాజీ డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి డిమాండ్

తిరుపతిలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి హాజరై మీడియా సమావేశంలో మాట్లాడిన  మాజీ డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు  

అహంకారంతో బెదిరింపులకు దిగితే సహంచబోం

బెదింపు ధోరణిని అధిష్టానం ప్రొత్సహిస్తే అప్రతిష్ట తప్పదు

కొన రఘుపతి హెచ్చరిక

బ్రాహ్మణ సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అటుకెక్కించింది

వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోలో బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టీకరణ

తిరుపతి:  ప్రజల నుంచి గౌరవం పొందేలా కాకుండా అహంకారంతో బెదిరింపులతో ఎమ్మెల్యే బొండా ఉమా దూషణలకు దిగితే సహించబోమని, తీరు మార్చుకోకుండా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తప్పదని మాజీ డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి హెచ్చరించారు. ఒక ప్రజాప్రతినిధిగా హూందాగా వ్యవహరించాల్సింది పోయి, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలను కించపరచడమే కాకుండా తొడలు కొట్టడం, మీసాలు మెలేసి వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో ఆమోద యోగ్యం కాదని ఆయన హితవు పలికారు. తిరుపతిలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సుమారు 47 వేల ఓట్లు కావాలి కానీ, అదే సామాజిక వర్గానికి గౌరవం ఇవ్వాలన్న సంస్కారం ఎమ్మెల్యే  బొండా ఉమాకు లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులు, వైశ్యులు సహా ఏ సామాజిక వర్గాన్నీ లెక్కచేయనట్టుగా బొండా ఉమా  వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  బొండా ఉమా వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం ప్రోత్సహిస్తే, ఆ పార్టీకి మరింత అప్రతిష్ఠ తప్పదని హెచ్చరించారు.   పదవులు రావాలన్న ఆశతో నాయకులను మెప్పించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రజల పట్ల గౌరవంతో వ్యవహరించినప్పుడే నిజమైన గౌరవం లభిస్తుందని సూచించారు.  మాజీ ఎమ్మెల్యే,  బ్రాహ్మణ సామాజిక వర్గ నేత మల్లాది  విష్ణుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఆయనపై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులను సహించేది లేదని స్పష్టం చేశారు.

బ్రాహ్మణ సంక్షేమాన్ని అటుకెక్కించిన కూటమి ప్రభుత్వం - మల్లాది విష్ణు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అమలు చేసిన ‘గరుడ’ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం గత రెండేళ్లుగా పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేసారు.   మరణించిన  వారి కుటుంబాలకు అంత్యక్రియల కోసం అందించే రూ.10 వేల సాయం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వంశపారంపర్య అర్చకత్వం, తక్కువ ఆదాయం కలిగిన దేవాలయాలను అర్చకులకు అప్పగించడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని  మల్లాది డిమాండ్ చేసారు.  
తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పారాయణ పోస్టులు, పారితోషికాలు, సంభావనలను పెంచడంతో పాటు సుమారు 700 కొత్త పోస్టులను భర్తీ చేయాలని గతంలో నిర్ణయించినప్పటికీ, వాటి నియామక ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి చేయలేదని విమర్శించారు. వేద పండితులు, వేద పురుషులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, టీటీడీకి ఉందని గుర్తు చేసారు. వేద విజ్ఞాన పరిషత్‌కు సంబంధించిన సదాశివమూర్తి వంటి వేద పండితుల విషయంలో ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని,  వేదాలను అధ్యయనం చేసిన బ్రాహ్మణ పండితులను గౌరవించాల్సింది పోయి అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోలో బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట

 రాబోయే వైఎస్సార్‌సీపీ  మ్యానిఫెస్టో లో  బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా  పొందుపరుస్తామని మల్లాది విష్ణు వెల్లడించారు.   వివాహాలు, ఉపనయనాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాలకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేలా స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తామని స్పష్టం చేసారు.   బ్రాహ్మణుల సంక్షేమం కోసం గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తు చేస్తూ, వాటిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించకపోవడం దురదృష్టకరమన్నారు.  హిందూ ధర్మం, దేవాలయాలు, పవిత్ర క్షేత్రాలను కాపాడతామని చెప్పే ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.   ప్రజల సమస్యలపై శాంతియుతంగా పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులతో అణచివేత చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, విజయవాడలో నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజల సమస్యలపై శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో టెంట్‌ను తొలగించడం, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం నిరంకుశత్వాన్ని తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు.    ప్రభుత్వం తన వైఖరిని పునరాలోచించుకోవాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా సానుకూలంగా వ్యవహరించాలని  సూచించారు. ప్రజల గొంతుకగా వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

Back to Top