బీసీ నేతలపై కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు,

వేధింపులు ఆపకపోతే తిరుగుబాటు తప్పదు:

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైయస్సార్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్.

రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రైవేట్ సైన్యంలా పోలీసు వ్యవస్థ

బీసీ నేతలపై ఆగని కక్ష సాధింపు చర్యలు 

చింతాడ రవికుమార్, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నాయుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

అక్రమ అరెస్టులు చేసిన కూటమి ప్రభుత్వం

చంద్రబాబు వెన్నుపోటు వైఖరిని బీసీ సమాజం గమనించాలి:

పిలుపునిచ్చిన వైయస్సార్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్.

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, వారి నాయకత్వాన్ని రాజకీయంగా అణచివేసేందుకు పక్కా ప్రణాళికతో కుట్రలు పన్నుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిండ్ రమేష్ గౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ గౌడ్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు 'రెడ్ బుక్' రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, కొంతమంది పోలీస్ అధికారులను ప్రైవేట్ సైన్యంలా మార్చుకొని వైయస్సార్సీపీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైయస్.జగన్ ప్రభుత్వం బీసీలకు విద్య, వైద్యం, సంక్షేమంలో అగ్రతాంబూలం అందించి రాజకీయంగా నిలబెడితే, ఓర్వలేక ప్రస్తుత ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న వెన్నుపోటు రాజకీయాలను రాష్ట్రంలోని యావత్ బీసీ సమాజం గమనించాలని కోరుతూ, ఇదే తీరు కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటు తప్పదని ఆయన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..

బీసీ నాయకత్వాన్ని అణచివేతకు  కూటమి కుట్ర..

రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలో బీసీలను రాజకీయాలకు దూరం చేయాలని కుట్రపూరిత వాతావరణం సృష్టించారు. కేసుల పేరుతోనో, అరెస్టుల పేరుతోనో, దాడుల పేరుతోనో భయపెడుతూ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. కొంతమంది పోలీస్ అధికారులను ప్రైవేట్ సైన్యంలా మార్చుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వైరవిహారం చేయిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు కొండంత అండగా ఉన్నారనే అక్కసుతోనే ఈ దాడులకు తెగబడుతున్నారు.

చింతాడ రవికుమార్‌పై అక్రమ కేసులు – ప్రజాప్రతినిధులపై అవమానాలు..

తోపులాటలో అనారోగ్యంతో ఉన్న ఒక మహిళా ఎస్సైకి ఇబ్బంది కలుగుతోందని గమనించి, 'అమ్మా.. కాస్త దూరంగా ఉండండి' అని మంచి మాట చెప్పినందుకు వైయస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్‌పై మీద పోలీసులతో ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు బనాయించారు. ఆయన్ను ఒక రౌడీలా, తీవ్రవాదిలా ప్రజల ముందు నడిపించి అవమానించారు. బెయిల్ రాకుండా ఉండేందుకు 21 మందిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. బీసీ నాయకులను ఈ విధంగా కించపరచడం దుర్మార్గం కాదా?.

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నాయుడిపై దాడి.. అర్ధరాత్రి అక్రమ అరెస్టులు

ఆలూరు నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్త గిరిపై టీడీపీ నేత నాగరాజు వర్గం మూకుమ్మడిగా దాడి చేసి చంపేందుకు యత్నించింది. 'నన్ను చంపేస్తున్నారు కాపాడండి' అని వీడియో కాల్ ద్వారా కార్యకర్త వేడుకుంటే, కాపాడేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి నాయుడు, ఆయన సోదరుడు శ్రీరాములుపై దాడి చేసి చేయి విరగ్గొట్టారు. దెబ్బలు తిన్నది మా వాళ్లయితే.. అర్ధరాత్రి దొంగల్లా తలుపులు బద్దలుకొట్టి ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యేని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని సైతం కించపరుస్తూ కుట్ర పూరితంగా కేసులు పెట్టడం టీడీపీకి అలవాటుగా మారింది.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, వాసు యాదవ్‌లపై కల్పిత కథలు..

మత్స్యకార కుటుంబానికి చెందిన డాక్టర్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సెల్ నేత వాసు యాదవ్‌లపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లి చంపడానికి ప్రయత్నించారంటూ కల్పిత కథలు అల్లారు. పెట్టిన కేసులకు సంబంధించి ఒక్క ఆధారమైనా, వీడియో విజువల్స్ అయినా ఉన్నాయా? కేవలం వైయస్.జగన్ పై  ఉన్న రాజకీయ కక్షతోనే బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ కేసులు పెడుతున్నారు.

వైయస్.జగన్ ను చూస్తే చంద్రబాబుకు వెన్నులో వణుకు..

వైయస్.జగన్ బాధితులకు భరోసా ఇచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుంటేనే చంద్రబాబుకు వణుకు పుడుతోంది. దారులు మూసేసి, చెక్‌పోస్టులు అడ్డం పెట్టినా జగన్‌పై ఉన్న ప్రజాభిమానాన్ని ఆపలేరు. గత 40 ఏళ్లుగా బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ, ఎన్నికలప్పుడు మాత్రమే 'బీసీల పార్టీ' అంటూ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్నారు. గతంలో ఆదరణ పథకం పేరుతో పనిముట్లు ఇచ్చి బీసీలను ఎల్లప్పుడూ కూలీలుగా, బానిసలుగానే ఉంచాలని చూశారు.

వైయస్సార్సీపీ హయాంలోనే బీసీలకు విద్యా, వైద్య విప్లవం..

తరతరాలుగా చదువుకు దూరమైన బీసీల కోసం వైయస్.జగన్ విద్యా విప్లవం తీసుకొచ్చి, ప్రభుత్వ బడులను బాగుచేసి మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా చేశారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేకుండా సంస్కరణలు తెచ్చారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను పేదల గుమ్మం వద్దకే చేర్చారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక నేడు బీసీ నాయకత్వంపై పగబట్టి దాడులు చేస్తున్నారు.

పోలీసులకు హెచ్చరిక – చట్టం అధికార పార్టీకి చుట్టం కాదు..

చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ సైన్యంలా మారిన కొందరు పోలీస్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు పావులుగా మారి చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దు. చట్టం అధికార పార్టీకి చుట్టం కాదు. మీరు చేసే అనైతిక చర్యల వల్ల బీసీ సమాజం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అక్రమ కేసులకు, బెదిరింపులకు వైయస్సార్సీపీ బీసీ నాయకులు ఎవరూ భయపడే ప్రసక్తే లేదు.

అణచివేత పెరిగితే బీసీల తిరుగుబాటు తప్పదు..

ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు గారూ.. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు ప్రజలకు వెన్నుపోటు పొడవొదన్న రమేష్ గౌడ్... అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు అంతే తీవ్రంగా ఉంటుందిని హెచ్చరించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్యాయానికి గురవుతున్న ప్రతి బీసీ కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండంత అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.  చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు, వైయస్.జగన్ సంక్షేమ దృక్పథానికి ఉన్న తేడాను బీసీలు, మేధావులు గమనించాలని కోరారు. అదే విధంగా భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పోరాడి మళ్లీ వైయస్.జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు.

Back to Top