రైతులకు ఉరి.. బినామీలకు సిరి 

స‌హకార షుగర్‌ ఫ్యాక్టరీల ఆస్తులను కొల్లగొట్టే కుట్ర 

వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఆగ్రహం 

విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు. 
వారితోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పెట్ల ఉమాశంకర్‌ గణేశ్, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్, అనకాపల్లి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త మలసాల భరత్, నియోజకవర్గ పరిశీలకులు గండి రవి, వీసం రామకృష్ణ, సత్యారావు తదితరులు. 

సహకార నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీల లిక్విడేషన్‌ ప్రక్రియ

రైతుల జనరల్‌ బాడీ మీటింగ్‌ లేకుండానే నిర్ణయాలు

ఆస్తుల విక్రయం ముసుగులో ఏపీఐఐసీ ద్వారా తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే కుట్ర

అప్పుల భారం రైతులపై మోపొద్దు: రుణాలను ప్రభుత్వమే గ్రాంట్‌గా భరించి బకాయిలు తీర్చాలి

వైయస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌ 

గతంలో రైతులను ఆదుకున్నది వైయ‌స్ఆర్‌సీపీపీ ప్రభుత్వమే

చక్కెర కర్మాగారాలకు రూ.90 కోట్ల పైచిలుకు నిధులిచ్చాం 

సెప్టెంబర్‌ 20లోగా రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలి 

ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహా ఉద్యమం 

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన వైయస్సార్‌సీపీ నాయకులు

విశాఖపట్నం:  రాష్ట్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన కోఆపరేటివ్‌ చక్కెర కర్మాగారాలను నిర్వీర్యం చేసి, వాటి ఆస్తులను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. సహకార నిబంధనలకు విరుద్ధంగా ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల తదితర ఫ్యాక్టరీలను లిక్విడేషన్‌ చేసి భూములను ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు జరుగుతున్న యత్నాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. 
    విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
    వేలాది రైతులు షేర్‌ హోల్డర్లుగా ఉన్న ఫ్యాక్టరీల భవిష్యత్తుపై వారితో కనీసం జనరల్‌ బాడీ మీటింగ్‌ కూడా నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. అప్పులు తీర్చే నెపంతో ఆస్తులను విక్రయించి, తమ అనుయాయులకు ఈ భూములను కారుచౌకగా కట్టబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను అమలు చేసేందుకే నామమాత్రంగా నలుగురు మంత్రులతో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఏర్పాటు చేశారని విమర్శించారు. రైతులకు సంబంధించిన భూములను లాక్కోవాలని చూస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని, వారికి అండగా న్యాయపోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
    గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతుల కోసం ప్రతి ఏటా నిధులు కేటాయించి, సుమారు రూ.90 కోట్లు ఇచ్చి సహకార ఫ్యాక్టరీలను ఆదుకున్నారని గుర్తు చేశారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న 24 వేల మంది రైతులకు, కార్మికులకు సంబంధించిన రూ.35 కోట్ల బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ప్రభుత్వం హామీగా ఉన్న రుణాలను రైతులపై మోపకుండా, వాటిని ప్రభుత్వమే గ్రాంట్‌గా భరించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి సర్కార్‌ పై ఉందన్నారు. రైతుల షేర్‌ క్యాపిటల్, ఫ్యాక్టరీ లాభాలతో ఏర్పడిన పదుల ఎకరాల ఆస్తులపై పెత్తనం చెలాయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని వారు సూటిగా ప్రశ్నించారు. రైతులను సంప్రదించకుండా ఏపీఐఐసీకి ఆస్తుల బదలాయింపు పేరుతో తీసుకొచ్చిన జీవోలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తేల్చి చెప్పారు. సెప్టెంబర్‌ 20వ తేదీలోగా రైతుల బకాయిలు చెల్లించి, జనరల్‌ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఫ్యాక్టరీల భవిష్యత్తుపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. అలా జరగని పక్షంలో, సెప్టెంబర్‌ 20 తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున జనరల్‌ బాడీ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. 

ప్రెస్‌మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

ఏపీఐఐసీ ద్వారా అనుయాయులకు కట్టబెట్టే కుట్ర 
:బూడి ముత్యాల నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి

– ఏటికొప్పాక, తుమ్మపాల, తాండవ చక్కెర కర్మాగారాలను లిక్విడేషన్‌ చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రక్రియలో భాగంగా ఫ్యాక్టరీల భూములను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తులు, అనుయాయులకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నలుగురు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ నామమాత్రపు కమిటీగా ఉంది; ముఖ్యమంత్రి ముందే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ కమిటీకి అర్థం ఏమిటి? ఫ్యాక్టరీలను లిక్విడేషన్‌ చేయడానికి ముందు రైతులు, షేర్‌హోల్డర్లతో జనరల్‌ బాడీ నిర్వహించి వాస్తవ పరిస్థితిని వివరించాలి. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీపై సుమారు 24 వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు, వారి బకాయిలు, కార్మికుల జీతాలు కలిపి సుమారు రూ.35 కోట్లు రెండేళ్లుగా చెల్లించలేదు. 
    వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ గారు ప్రతి ఏడాది ఫ్యాక్టరీ రైతులకు ప్రభుత్వం ద్వారా నిధులు అందించి ఆదుకున్నారు. ఐదేళ్లలో సుమారు రూ.90 కోట్లు ఇచ్చి ఫ్యాక్టరీ రైతులకు అండగా నిలిచాం. అందుకే ప్రస్తుత ప్రభుత్వం కూడా వెంటనే రూ.35 కోట్లు విడుదల చేసి రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలి. సెప్టెంబర్‌లో జనరల్‌ బాడీ నిర్వహించి రైతుల బకాయిలు, కార్మికుల జీతాలు చెల్లించడంతో పాటు ఫ్యాక్టరీ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటించాలి. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి జనరల్‌ బాడీ నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. అవసరమైతే రైతుల తరఫున కోర్టును ఆశ్రయిస్తాం, రైతులకు నష్టం కలగకుండా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.
    
కోఆపరేటివ్‌ నిబంధనలకు విరుద్ధంగా లిక్విడేషన్‌ ప్రక్రియ
:గుడివాడ అమర్‌నాథ్‌. మాజీ మంత్రి

– కోఆపరేటివ్‌ చక్కెర కర్మాగారాలను నిబంధనలకు విరుద్ధంగా లిక్విడేషన్‌ చేసే ప్రక్రియలో భాగంగానే వాటి ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. రైతులు, షేర్‌హోల్డర్లతో కనీసం జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించకుండా ఫ్యాక్టరీల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఏటికొప్పాక, తాండవ, భీమసింగ్‌ ఫ్యాక్టరీలను లిక్విడేషన్‌ చేయడంతో పాటు, ఇతర ఫ్యాక్టరీల విషయంలోనూ కోర్టు కేసుల ఫలితాలకు లోబడి లిక్విడేషన్‌ చర్యలు తీసుకునేలా జీవోలో నిర్ణయాలు ఉన్నాయి. ఫ్యాక్టరీల ఆస్తులను ఏపీఐఐసీ ద్వారా విక్రయించి అప్పులు చెల్లించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. నలుగురు మంత్రులతో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రక్రియలో భాగంగానే కనిపిస్తోంది. కోఆపరేటివ్‌ ఫ్యాక్టరీల్లో రైతులే వాటాదారులు, షేర్‌హోల్డర్లు కాబట్టి వారి అభిప్రాయం తీసుకోకుండా లిక్విడేషన్‌ నిర్ణయాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. 
    గతంలో వైఎస్సార్‌ హయాంలో రైతులకు అండగా నిలిచి, చెరకు సాగుకు ప్రోత్సాహకాలు అందించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీలను మూసివేయడం, ఆస్తులను అప్పగించడం కాకుండా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. ఈ నిర్ణయాలను వైఎస్సార్సీపీ అడ్డుకుంటుంది, రైతులను కలుపుకుని భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాం. సెప్టెంబర్‌ 20లోగా గోవాడ రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి, జనరల్‌ బాడీ నిర్వహించి ఫ్యాక్టరీ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటించాలి. లేకపోతే సెప్టెంబర్‌ 20 తర్వాత రైతులతో కలిసి జనరల్‌ బాడీ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఫ్యాక్టరీ భూములను విక్రయించడం కాకుండా ప్రత్యామ్నాయ పంటలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి రైతుల భవిష్యత్తును కాపాడాలి.

రైతులతో మాట్లాడి వారి సమ్మతితో నిర్ణయం తీసుకోవాలి 
:కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే

– కోఆపరేటివ్‌ ఫ్యాక్టరీలను లిక్విడేషన్‌ చేసే పేరుతో వాటి ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. షేర్‌ హోల్డర్లుగా ఉన్న రైతులతో జనరల్‌ బాడీ నిర్వహించి, వారి సమ్మతితో తీర్మానం చేయకుండా ఫ్యాక్టరీలపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు. రైతులను సంప్రదించకుండా జీవో ద్వారా ఏపీఐఐసీకి ఆస్తులను అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. చోడవరం ఫ్యాక్టరీ భూముల విలువ పెరిగినందున వాటిని ఏపీఐఐసీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వం హామీగా తీసుకున్న రుణాలను ప్రభుత్వం గ్రాంట్‌గా భరించాలి, ఆ భారాన్ని రైతులపై మోపకూడదు. చోడవరం రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించకుండా రెండేళ్లుగా ప్రభుత్వం జాప్యం చేస్తోంది.కనీసం రైతులకు బ్యాంకు వడ్డీ అయినా చెల్లిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రైతులు షేర్‌ హోల్డర్లుగా ఉన్నందున వారి షేర్‌ విలువకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
    చంద్రబాబు హయాంలో మూతపడిన కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలను నాటి జగన్‌ గారి ప్రభుత్వం ఆదుకుంది. జగన్‌ గారి ప్రభుత్వ హయాంలో ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీల్లో క్రషింగ్‌ జరిగింది. చోడవరం ఫ్యాక్టరీని కాపాడేందుకు సుమారు రూ.90 కోట్ల వరకు ప్రభుత్వ గ్రాంట్లు తీసుకొచ్చి ఫ్యాక్టరీని నిలబెట్టాం. జనరల్‌ బాడీ నిర్వహించకుండా ఏకపక్షంగా లిక్విడేషన్, ఆస్తుల బదలాయింపు చేస్తే వైయ‌స్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది.

ఆ రుణాలు ప్రభుత్వం మాఫీ చేయలేదా? 
:సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్సీ

– ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ 1954లో భారతదేశంలోనే తొలి కోఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీగా ఏర్పడింది. ఫ్యాక్టరీలో 5,400 మంది సభ్యులు ఉన్నారు, రైతుల షేర్‌ క్యాపిటల్, ఫ్యాక్టరీ లాభాలతోనే భూములు, ఆస్తులు సమకూరాయి. ఏటికొప్పాక ఫ్యాక్టరీకి 72 ఎకరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్చేజింగ్‌ సెంటర్ల భూములు, అదనంగా కొనుగోలు చేసిన భూములు కలిపి సుమారు 100 నుంచి 120 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా రైతుల షేర్‌ క్యాపిటల్, ఫ్యాక్టరీ లాభాలతో ఏర్పడిన ఈ ఆస్తులను ఏపీఐఐసీకి అప్పగించడం సరికాదు. జనరల్‌ బాడీలు నిర్వహించి రైతుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఫ్యాక్టరీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలి. లిక్విడేషన్‌ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ముందు రైతుల హక్కులు, షేర్‌ విలువ, ఫ్యాక్టరీ ఆస్తులపై స్పష్టత ఇవ్వాలి.
అన్ని షుగర్‌ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సుమారు రూ.100–120 కోట్లకు మించదు, రైతుల ప్రయోజనం కోసం ఆ మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేయాలి. 
    ఏటికొప్పాక ఫ్యాక్టరీ గతంలో లాభాలతో నడిచింది, చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో నష్టాల్లోకి వెళ్లింది. వైఎస్సార్‌ హయాంలో ప్రతి టన్నుకు రూ.200 ఇన్సెంటివ్‌ ఇచ్చి చెరకు రైతులకు, ఫ్యాక్టరీలకు ప్రభుత్వం అండగా నిలిచింది. అప్పుడు రైతులను ఆదుకునే విధానాలు అమలు చేస్తే, ఇప్పుడు ఫ్యాక్టరీల ఆస్తులను లిక్విడేషన్‌ పేరుతో ఏపీఐఐసీకి అప్పగించడం ఎందుకు? కోఆపరేటివ్‌ వ్యవస్థలోనే రైతులకు ఉపయోగపడే విధంగా ఫ్యాక్టరీలను కొనసాగించాలి. రైతులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్సార్సీపీ, జగన్‌ గారి నాయకత్వంలో రైతుల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Back to Top