గుంటూరు: అమరావతి పేరుతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాధనాన్ని దోచుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో కాంట్రాక్టు పనుల అంచనాలను భారీగా పెంచేసి వేల కోట్ల రూపాయలను కాజేస్తున్నారని, సీడ్ యాక్సెస్ రోడ్డు మొదలుకొని సచివాలయం, టవర్ల నిర్మాణం వరకు ప్రతి పనిలోనూ విపరీతమైన అవినీతి చోటుచేసుకుంటోందని ఆయన లెక్కలతో సహా ఎండగట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. అమరావతి అంటే నగరం కాదు.. అవినీతి సామ్రాజ్యం.. అమరావతిలో జరుగుతున్న పనులు చూస్తుంటే ఎవరికైనా విస్మయం కలగక మానదు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వారెవరైనా సరే ఈ దోపిడీని చూసి బాధపడాల్సిందే. చివరకు తెలుగుదేశం పార్టీలోని ఆలోచనాపరులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అమరావతి అంటే అద్భుతమైన నగరం కాదు, అమరావతి అంటే దోపిడీ, అమరావతి అంటే అవినీతి అని స్పష్టంగా తేలిపోయింది. వైఎస్సార్‌సీపీ నాయకుడిగా నేను ఏదో బురదజల్లుతున్నానని అనుకోకుండా.. నేను ఆధారాలతో సహా చెబుతున్న లెక్కల్లో వాస్తవాలు ఉన్నాయో లేదో ప్రజలు, మేధావులు ఆలోచించాలి. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని కట్టలు కట్టలుగా ఎలా దోచుకుంటున్నారో కొన్ని ఉదాహరణలు చూస్తే అర్ధం అవుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో నిలువుదోపిడీ: 21.77 కి.మీలకు రూ.1,519 కోట్లా? చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సీడ్ యాక్సెస్ రోడ్డు దోపిడీకి నిలువెత్తు నిదర్శనం. అమరావతి సీడ్ నుంచి నేషనల్ హైవే వరకు కలిపే ఈ రోడ్డు మొత్తం పొడవు కేవలం 21.77 కిలోమీటర్లు. దీనికి చంద్రబాబు పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? ఏకంగా రూ.1,519 కోట్లు!. ప్రపంచంలో ఎక్కడైనా 21 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఇంత భారీగా ఖర్చు పెట్టడం చూశారా? ఫేజ్-1 దోపిడీ లెక్కలు: 14.21 కిలోమీటర్ల మొదటి దశ రహదారి నిర్మాణానికి 2017లో రూ.285 కోట్లు మంజూరు చేసి పనులు అప్పగించారు. 2019 నాటికి రూ.185 కోట్లు ఖర్చు చేశారు. అంటే మొదటి అంచనాల ప్రకారం మిగిలింది కేవలం రూ.100 కోట్ల పనులు మాత్రమే. రూ.100 కోట్లతో పూర్తి కావాల్సిన మిగిలిన భాగాన్ని 'రివైవ్' పేరుతో రూ.365 కోట్లకు పెంచారు. దానికి జీఎస్టీ, ఇతర ఖర్చులు కలిపి ఏకంగా రూ.465 కోట్లకు అప్పగించారు. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనిని రూ.465 కోట్లకు ఎందుకు పెంచారో చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎన్‌హెచ్‌ఏఐ ప్రమాణాలకు.. బాబు దోపిడీ రేట్లకు పొంతనేది? జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే రోడ్డు సగటు ఖర్చు కిలోమీటర్‌కు రూ.23 నుంచి రూ.24 కోట్లు మాత్రమే అవుతుంది. కానీ, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు కిలోమీటర్‌కు దాదాపు రూ.180 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద అత్యంత రద్దీ ప్రాంతంలో రెండు వైపులా కలిపి 4.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్ రోడ్డును సుమారు రూ.180 కోట్లకే నిర్మించారు. కానీ సీడ్ యాక్సెస్ రోడ్డులో 3.5 కిలోమీటర్ల ప్యాకేజీని ఏకంగా రూ.532 కోట్లతో నిర్మిస్తున్నారు. కనకదుర్గమ్మ వారధి - సీడ్ యాక్సెస్ ఫ్లైఓవర్: విజయవాడలో 2.6 కిలోమీటర్ల 6-లైన్ల కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆనాడు రూ.282.4 కోట్లు వెచ్చించారు (కిలోమీటర్‌కు రూ.108.61 కోట్లు). కానీ ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డులో నిర్మిస్తున్న 3.5 కిలోమీటర్ల 6-లైన్ల ఫ్లైఓవర్‌కు రూ.610.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే కిలోమీటర్‌కు రూ.180 కోట్లు! కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కన్నా ఇక్కడ కిలోమీటర్‌కు రూ.72 కోట్లు అదనంగా ఎందుకు పెరిగింది? కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 'నీకు సగం.. నాకు సగం' పంచుకోవడానికే ఈ రేట్లు పెంచలేదా?. కుంగిపోయిన తాత్కాలిక స్టీల్ బ్రిడ్జికి రూ.80 కోట్ల హంగామా! నాణ్యత లోపించి ఒకానొక సందర్భంలో కుంగిపోయిన తాత్కాలిక స్టీల్ బ్రిడ్జికి మరమ్మతులు చేసి రూ.80 కోట్లు వెచ్చించారు. ఆ తాత్కాలిక బ్రిడ్జిని ప్రారంభించి నిన్న చంద్రబాబు పెద్ద ఎత్తున హంగామా చేశారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్లు, గొప్ప ఉపన్యాసాలు దంచడంలో చంద్రబాబును మించిన వారు లేరు. కనకదుర్గమ్మ వారధిని పూర్తి చేసి ప్రారంభించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనన్న సంగతి ప్రజలకు తెలుసు. చదరపు అడుగుకు రూ.22 వేలా? రోడ్లలో బంగారం, ప్లాటినం పోస్తున్నారా? నిర్మాణ రంగంలో దేశంలో ఎక్కడా లేని విడ్డూరమైన రేట్లు అమరావతిలో చూస్తున్నాం. శాశ్వత సచివాలయం పేరుతో చదరపు అడుగుకు (Sft) ఏకంగా రూ.18,413 ఖర్చు పెడుతున్నారు. ఐదు ఐకానిక్ భవనాలకు చదరపు అడుగుకు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు అంచనాలు వేశారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఎక్కడా ఈ స్థాయి ధరలు లేవు. మరోవైపు ఈ భవనాలకు వేల కోట్ల రూపాయలతో అంచనాలు వేస్తున్నారు. ఆ ఐదు భవనాలకు కేవలం అద్దాల (గ్లాస్ ఫసాడ్) కోసమే రూ.2,455.22 కోట్లు ఖర్చు పెడతారట. రోడ్లు, భవనాల్లో తారు, సిమెంటు కాకుండా ప్లాటినం, బంగారం పొదుగుతున్నారా? లేక విలువైన గనులేమైనా తెచ్చి వేస్తున్నారా? రైతులకు మొండిచేయి.. కాంట్రాక్టర్లకు వేల కోట్ల దోపిడీ.. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కనీసం ఒక్క పర్ఫెక్ట్ లేఅవుట్ అయినా సిద్ధం చేసి ప్లాట్లు ఇచ్చారా? రైతులు తమ భూములు ఇచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. కాంట్రాక్టర్లకు మాత్రం ఎస్టిమేషన్లు పెంచి వేల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. అప్పులు తేవడం, ఎస్టిమేషన్లు పెంచడం, బాబు-కొడుకులు బస్తాలు బస్తాలుగా డబ్బు మూటగట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే రూ.57 వేల కోట్లు అప్పులు తెచ్చారు.. మరో రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి అందులో 50 శాతం కొట్టేయడానికి స్కెచ్ వేశారు. అమరావతిపై నమ్మకముంటే మంత్రులంతా బయటే ఎందుకుంటున్నారు? చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు సరే.. మంత్రులెవరైనా అక్కడ ఉంటున్నారా? మంత్రులంతా తాడేపల్లి, విజయవాడ, గుంటూరులలో ఉంటున్నారు తప్ప రాజధానిలో ఉండే ధైర్యం ఎవరికీ లేదు. చంద్రబాబు ఏడేళ్ల పాలనలో అమరావతిలో అన్నీ తాత్కాలిక భవనాలు, తాత్కాలిక బ్రిడ్జిలే మిగిలాయి. అమరావతి అనేది చంద్రబాబు కుటుంబానికి దోపిడీ సామ్రాజ్యమే తప్ప.. ఎప్పటికీ పూర్తయ్యే నగరం కాదు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బాబుకు ఉందా? సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? ఈ భారీ అవినీతి చూసే ఆయన డుమ్మా కొట్టారా? నేను వేసిన లెక్కల ప్రశ్నలకు చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ సమాధానం చెప్పగలరా? అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతో తప్పించుకుంటున్నారని... దమ్ముంటే వైయస్సార్సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే... సభకు వచ్చి ఈ దోపిడీని ఆధారాలతో సహా నిలదీస్తామని స్పష్టం చేశారు. అనుకూల ఎల్లో మీడియాతో అమరావతిని అద్భుతంగా చిత్రీకరించినా.. చంద్రబాబు చేస్తున్న ఈ చారిత్రక దోపిడీని వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతూనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.