నంద్యాల జిల్లా: రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించకుండా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు శిల్పా కార్తీక్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల సమస్యలను తెలుసుకుని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. శాంతియుతంగా రైతుల సమస్యలపై చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, సాగునీరు విడుదల చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపుతో కదిలిన రైతాంగం రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఇచ్చిన పిలుపుతో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముట్టడికి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సాగు, తాగునీటి అవసరాలకు విడుదల చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని వారు కోరారు. రైతులను అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు వీబీఆర్ వైపు రైతులు, వైయస్ఆర్‌సీపీ శ్రేణులు వెళ్లకుండా పోలీసులు పలు మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గుంతకందాల, వేల్పనూరు, నంద్యాల రోడ్డు, ఆత్మకూరు రోడ్డు సహా ప్రధాన మార్గాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షించారు. మోతుకూరు వద్ద వైయస్ఆర్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు మోతుకూరు సమీపంలోని గోడౌన్ వద్ద శిల్పా చక్రపాణిరెడ్డి తనయుడు శిల్పా కార్తీక్‌రెడ్డి, సోదరుడు భువనేశ్వర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు వీబీఆర్ వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నంద్యాల–ఆత్మకూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని కోరారు. ఇదే సమయంలో వెలుగోడు వైపు వస్తున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. రైతుల నీటి హక్కు కోసం పోరాటం రిజర్వాయర్‌లో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందక పంటలపై తీవ్ర ప్రభావం పడుతోందని శిల్పా కార్తీక్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసే వరకు రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని యువనేత శిల్పా కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు.