మాగుంట వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

వైయ‌స్ జ‌గ‌న్‌ను విమర్శించే ముందు మాగుంట తన చరిత్రను గుర్తు చేసుకోవాలి

అద్దంకి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డా. అశోక్‌కుమార్‌ ఫైర్

ప్రకాశం జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని అద్దంకి వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి డా. అశోక్‌కుమార్‌ మండిపడ్డారు. చంద్రబాబు కాళ్ల దగ్గర బానిసగా ఉండాలనుకుంటే ఉండొచ్చని, కానీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా ఉండాలని హితవు పలికారు. మాగుంట ఒక ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసని అన్నారు. అధికార మదంతో వ్యవహరిస్తే రేపు అధికారం మారిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు.

వెలిగొండ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డేనని డా. అశోక్‌కుమార్‌ స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు కమ్యూనిస్టు నేత పూల సుబ్బయ్య పేరు పెట్టింది కూడా వైయ‌స్‌ఆర్‌ేనని గుర్తుచేశారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించి, కీలక పనులను పూర్తి చేశారని తెలిపారు. అలాంటి నాయకుడిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం మానుకుని వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని డా. అశోక్‌కుమార్‌ సూచించారు.

Back to Top