మైనింగ్‌ అక్రమాలపై వేమిరెడ్డి సమాధానం చెప్పాలి

మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన మైనింగ్‌ అక్రమాలపై తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఉన్నాయని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వేమిరెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోతే తాను ఆధారాలతో బయటపెట్టిన అంశాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వేమిరెడ్డికి సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో ఫిన్‌ కంపెనీ పేరుతో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. తాను ఆధారాలు బయటపెట్టిన తర్వాత ఆ అపార్ట్‌మెంట్‌లోని కార్యాలయాన్ని ఖాళీ చేసి ఊటుకూరుకు మార్చారని తెలిపారు.

2025లో ఒక మేజర్‌ మినరల్‌ మైన్‌ రద్దు చేసినప్పటికీ అది ఇప్పటికీ ఎలా కొనసాగుతోందని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. చైనా వ్యక్తి యాంగ్జున్‌ డౌకు వేమిరెడ్డికి ఉన్న సంబంధం ఏమిటనేది అసలు ప్రశ్న అని పేర్కొన్నారు. యాంగ్జున్‌ డౌకు వీసా ఇవ్వాలని కేంద్ర మంత్రికి వేమిరెడ్డి రాసిన లేఖను బయటపెట్టిన ఆయన, గ్రానైట్‌ ట్రేడింగ్‌ చేసే డౌను ఇంజినీరింగ్‌ ఎక్స్‌పర్ట్‌గా లేఖలో పేర్కొనడం ఏమిటని ప్రశ్నించారు. వేమిరెడ్డి ఆధ్వర్యంలోనే సిండికేట్‌ కొన్ని వందల కోట్ల అక్రమాలకు పాల్పడుతోందన్న అంశంపై సమాధానం చెప్పాలని కోరారు.

2024 నవంబర్‌లో నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ చైనాలో తానే మేయర్‌నంటూ డెలిగేట్స్‌ సమావేశాల్లో పాల్గొన్నారని అనిల్‌ యాదవ్‌ తెలిపారు. వేమిరెడ్డి కంపెనీలో కీలక వ్యక్తి రమణకుమార్‌ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారని, చైనాలో జరిగిన సమావేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. నెల్లూరు మేయర్‌గా గిరిజన మహిళ ఉన్న సమయంలో తాను మేయర్‌నంటూ చెప్పుకోవడం దారుణమని, రూప్‌కుమార్‌ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ సిండికేట్‌ ఇంకా ఎన్ని దేశాల్లో తమ అక్రమ కార్యకలాపాలను విస్తరించిందనే అనుమానాలు కలుగుతున్నాయని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. తాను కేవలం విమర్శలు చేస్తున్నానంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రకు ఆధారాలు సరిపోతాయని తెలిపారు. 2019లో వేమిరెడ్డికి రాజ్యసభ స్థానం, ఆయన భార్యకు టికెట్‌ ఇవ్వాలని వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సిఫార్సు చేయాలని తనను కోరిన విషయం నిజం కాదా అని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు.

Back to Top