నంద్యాల జిల్లా: రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని కోరుతూ వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)ను ముట్టడించేందుకు వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపునకు రైతుల నుంచి భారీ స్పందన లభించింది. రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సాగు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెలుగోడు వైపు కదిలారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడంతో బండి ఆత్మకూరు, నందికొట్కూరు, మోతుకూరు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగోడు వైపు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డితో పాటు రైతులు, పార్టీ నాయకులను బండి ఆత్మకూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గ్రామాల నుంచి రైతులు తరలిరాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాక్టర్లలో వస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని నోటీసులు ఇచ్చినట్లు వైయస్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. పోలీసుల అడ్డంకులపై రైతులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ సాగునీటి కోసం నినాదాలు చేశారు. రైతులపై పోలీసుల ఆంక్షలు బండి ఆత్మకూరు బస్టాండ్ వద్ద రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు. వెంటనే కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు ఇవ్వాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకోవడం సరికాదని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వెలుగోడు రిజర్వాయర్ల ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. నాయకులను అడ్డుకున్న పోలీసులు నందికొట్కూరు వద్ద వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, నాయకులు ధారా సుధీర్, వెన్నపూస రవీంద్రరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మోతుకూరు వద్ద కార్తీక్‌రెడ్డి, శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, అంబాల ప్రభాకర్‌రెడ్డి, శోభన్‌బాబులను కూడా పోలీసులు అడ్డుకున్నట్లు వైయస్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. ఇంటి వద్దే మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అడ్డగింత ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకున్నారు. వెలుగోడుకు వెళ్లేందుకు అనుమతించాలని కోరినా పోలీసులు అనుమతించలేదని ఆయన తెలిపారు. శ్రీశైలం డ్యాంలో నీరు ఉన్నప్పటికీ వెలుగోడు రిజర్వాయర్‌ను నింపకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని గంగుల బిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ప్రశ్నించేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం సరికాదని అన్నారు. సాగునీరు విడుదల చేసే వరకు పోరాటం వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, రవిచంద్రకిశోర్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుల హక్కుల కోసం చేపట్టిన పోరాటాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొనసాగిస్తామని, నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని తెలిపారు.