విద్యా సంవత్సరం మధ్యలో ఎస్టీ హాస్టల్‌ తొలగింపా?  

మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

కాకినాడ‌: విశాఖపట్నంలోని ఎస్టీ ఇంగ్లీష్‌ మీడియం హాస్టల్‌ను విద్యా సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా తొలగించి, విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు ఆ భవనాన్ని నారాయణ విద్యాసంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు మండిపడ్డారు. విద్యార్థుల చదువులకు అంతరాయం కలిగించే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండగా, వాటిని అడ్డుకునేందుకు పోలీసులు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను  హౌస్‌ అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న కాకినాడ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఉత్తరాంధ్ర జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జిని కూడా పోలీసులు విశాఖకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని నేతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, గిరిజనుల హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని, హాస్టల్‌ను యథాతథంగా కొనసాగించి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని వైయ‌స్ఆర్‌సీపీ స్పష్టం చేసింది.
 

Back to Top