తాడేపల్లి: తమ హక్కుల కోసం, పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన ఉద్యోగ సంఘాల నాయకులపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బెదిరింపులకు దిగడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల తన సర్వీసులో ఏ ముఖ్యమంత్రీ, మంత్రీ ఉద్యోగులను ఇలా బెదిరించలేదని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటుతున్నా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఉద్యోగులు, పెన్షనర్లను నిలువునా మోసం చేసిందని దుయ్యబట్టారు. తక్షణమే తమ రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు రోడ్డెక్కడం ఖాయమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. బెదిరించే ధైర్యం ఎక్కడిది? మా హక్కుల కోసం, బకాయిల కోసం నిలదీసిన ఓ ఉద్యోగ సంఘం నాయకుడిపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బెదిరింపులకు దిగడం దుర్మార్గం. ఉద్యోగ నాయకుడిని బెదిరించే దమ్ము, ధైర్యం మంత్రికి ఎక్కడి నుంచి వచ్చాయి? నా 40 ఏళ్ల సర్వీసులో ఏ ముఖ్యమంత్రీ, ఏ మంత్రీ ఉద్యోగులను ఇలా బెదిరించిన పాపాన పోలేదు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ 30, 40 ఏళ్లు ప్రభుత్వంలో ఉండేది ఉద్యోగులే. మా డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే మీరు రాజకీయాలు అంటగడతారా? ఉద్యోగులు బానిసలు కాదు ప్రభుత్వ ఉద్యోగులకు, సంఘాలకు ఏ పొలిటికల్ పార్టీతోనూ సంబంధం ఉండదు. మాకు అన్యాయం జరిగితే ఎవరినైనా నిలదీస్తాం. ప్రభుత్వంలో ఉద్యోగులే చక్రం లాంటి వారు. ఏ సంక్షేమ పథకం ప్రజలకు చేరాలన్నా ఉద్యోగులే కీలకం. అలాంటి ఉద్యోగ వ్యవస్థను బెదిరిస్తూ, బానిసల్లా చూస్తామంటే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా బకాయిలు తక్షణమే చెల్లించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. రూ. 40 వేల కోట్ల మా సొమ్ము ఏమైంది? మా జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, డీఏ బకాయిలు కలుపుకుని దాదాపు రూ.40 వేల కోట్ల మా సొమ్మును ప్రభుత్వం వాడుకుంటోంది. మేము దాచుకున్న డబ్బులు మాకు ఎప్పుడిస్తారు? జూలై 22న మంత్రుల బృందంతో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగి 40 రోజులు గడిచినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి అంత లెక్కలేనితనమా అని సూటిగా అడుగుతున్నాను. హామీల అమలులో నిలువునా మోసం ఎన్నికల సమయంలో కూటమి పార్టీలన్నీ కలిసి 10 పాయింట్లతో ఒక మేనిఫెస్టో ఇచ్చాయి. 27 నెలలవుతున్నా ఏ ఒక్క పనీ చేయకుండా మోసం చేశారు. సీపీఎస్, జీపీఎస్‌పై పునఃసమీక్షిస్తామని చెప్పి మూడు లక్షల మంది ఉద్యోగులతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. గతంలో జగన్ గారు 12వ పీఆర్సీ కోసం మన్మోహన్ సింగ్ కమిటీని నియమిస్తే, ఈ ప్రభుత్వం ఆ కమిషనర్‌తో రాజీనామా చేయించి ఇంటికి పంపింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి, కేంద్రం ఇచ్చే డీఏలు ఎప్పటికప్పుడు ఇస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టి ఉద్యోగుల పొట్టకొడుతున్నారు. నాడు జగన్ గారు చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం చిన్న తరగతి, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పథకాలు ఇస్తామని మాట తప్పింది. వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి, ఆ వ్యవస్థనే నాశనం చేసింది. ఈ డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలి తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలి. 12వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు, 30 శాతానికి తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటించాలి. ఎంప్లాయీస్ హెల్త్ కార్డులను నాశనం చేశారు. మా జీతాల్లో ప్రతి నెలా డబ్బులు కట్ చేస్తూ, ఆస్పత్రులకు ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడంతో వైద్యం అందక రోడ్లపాలవుతున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, లేదంటే రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కడం ఖాయమని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.