గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా?

 మారికవలస గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాల తరలింపు ఆలోచన విరమించుకోవాలి

విద్యార్థులు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దమనకాండ సరికాదు

తాడేప‌ల్లి: విశాఖపట్నం మారికవలసలోని గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలను తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోరారు. గిరిజన విద్యార్థులు తాము కోరుకున్న చోట చదువుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, శ్రేణులపై పోలీసుల దమనకాండను తప్పుబట్టారు.

విద్యార్థులు, తల్లిదండ్రుల పోరాటానికి మద్దతుగా వస్తున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపైనా వైయ‌స్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు.

వైయ‌స్‌ఆర్‌ హయాంలోనే గురుకులాలు ఏర్పాటు

విశాఖపట్నం మారికవలసలోని గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలను తరలించవద్దంటూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వారి అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలవడం, వారి తరఫున గొంతెత్తడం నేరమా? అని ప్రశ్నించారు.

వైయ‌స్‌ఆర్‌ హయాంలో ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సలహాలు, సూచనలతో ఎస్టీ విద్యార్థులు ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ‘స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ కింద 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏడు గురుకులాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య

క్వాలిఫైడ్‌ టీచర్లను నియమించి, వారికి ప్రోత్సాహకాలు అందించడం ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించామని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. ఈ విధానం ద్వారా పలువురు విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు పొందారని పేర్కొన్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా గురుకులాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆన్‌లైన్‌ కోచింగ్‌, ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బోధనను మరింత మెరుగుపరిచామని తెలిపారు. ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందిన గిరిజన విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40 వేలతో పాటు ల్యాప్‌టాప్‌లు కూడా అందించామని వివరించారు.

బాగా నడుస్తున్న పాఠశాలలను ఎందుకు తరలిస్తున్నారు?

బాగా నడుస్తున్న పాఠశాలల్లోని విద్యార్థులను బలవంతంగా తరలించి ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నించారు. విశాఖ వంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే హక్కు లేదా అని నిలదీశారు. నెల్లూరు జిల్లా కోటలో ఎస్సీ గురుకులం నుంచి వందలాది మంది విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలోనే తరలించిన విషయాన్ని ప్రస్తావించారు.

 2 వేల మందికి పైగా విద్యార్థులకు ఇబ్బందులు

మొత్తం నాలుగు గురుకులాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి చెల్లాచెదురు చేశారని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడి నిర్ణయాలతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎనిమిదో తరగతి నుంచే పునాది అవసరం

జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే విద్యార్థులకు కనీసం 8వ తరగతి నుంచే బలమైన పునాది అవసరమని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. అలాంటి లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను నిర్వీర్యం చేయడం సరికాదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని, పిల్లలకు నచ్చిన చోట చదువుకునే అవకాశం కల్పించాలని వైయ‌స్‌ జగన్‌ కోరారు. గిరిజన మహిళా నాయకుల పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు.

గిరిజన విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే పాఠశాలల తరలింపు నిర్ణయాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది.
 

Back to Top