విశాఖ: కూటమి పాలనలో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులపై అదనపు భారం పడుతోందని నిరసిస్తూ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని 42వ వార్డులో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో 42వ వార్డు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భీశెట్టి ప్రసాద్‌తో పాటు పార్టీ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులతో నిరసన చేపట్టి ధరల పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచదార, ఉల్లిపాయలు, పప్పులు, బియ్యం, వంట నూనెలు, పాలు, పెరుగు, గ్యాస్ ధరలు పెరగడంతో కుటుంబాలపై నెలకు అదనంగా రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు భారం పడుతోందని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ నిధిని విడుదల చేసి మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని, సబ్సిడీ కౌంటర్ల ద్వారా కందిపప్పు, పామాయిల్‌ను తక్కువ ధరకు అందించాలని, హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.