ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు, ఆయన చేతలకు ఎలాంటి పొంతన లేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. తనపై రాజకీయంగా అనేక నిందలు వేస్తున్నారని, కులమతాలకు అతీతంగా ప్రజలతో మమేకమై ఉన్న తన వ్యక్తిత్వానికి, కుటుంబ వంశ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేత చల్లా రాజగోపాల్ తన ఇంట్లో జూదం ఆడించి మేజులు తీసుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై రాచమల్లు తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను నిరూపించాలని సవాల్ చేశారు. వరదరాజులరెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మునిసిపల్ చైర్మన్ ఎన్నికల్లో తామిద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే ఎవరి బలం ఎంతో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, తన కుమారుడు రాఘవేంద్రరెడ్డిని బరిలో నిలుపుతానని, వరదరాజులరెడ్డి కూడా తన కుమారుడు కొండారెడ్డిని పోటీకి దించాలని సవాల్ చేశారు. ప్రొద్దుటూరు ప్రజల తీర్పుతో ఎవరి బలం ఏమిటో తేలిపోతుందని పేర్కొన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, వైయస్ఆర్‌సీపీ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.