విశాఖపట్నం: మారికవలస గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలను విద్యా సంవత్సరం మధ్యలో తరలించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మారికవలసకు వెళ్లే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేయడంతో పాటు, పలువురు నేతలను హౌస్ అరెస్ట్, అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. గిరిజన విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా మారికవలసకు వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో పాటు ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నట్లు తెలిపారు. పుష్పశ్రీవాణి, బాలరాజులను నడిరోడ్డుపై అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు కనీస గౌరవం లేకుండా వ్యవహరించడం సరికాదని ప్రశ్నించారు. మారికవలసకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు మారికవలస గిరిజన విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు బయలుదేరిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర వాహనాన్ని సాలూరు పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రాజన్నదొర, గిరిజన విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం తమ పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు హౌస్ అరెస్ట్ మారికవలసలో వైయస్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ మంత్రి కురసాల కన్నబాబును కాకినాడలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైయస్ఆర్ హయాంలో ప్రారంభమైన మారికవలస గురుకులాన్ని జీవో నంబర్ 99 ద్వారా ఎత్తివేసి ఎక్సలెన్సీ సెంటర్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో 480 మంది గిరిజన విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడం అమానుషమని, ఎక్సలెన్సీ సెంటర్ ఏర్పాటు చేయాలంటే వేరుగా భూములు కేటాయించాలని కోరారు. విశాఖ నేతలకు పోలీసుల నిర్బంధం మారికవలస నిరసనలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి బాలరాజు, వైయస్ఆర్‌సీపీ నాయకులు పేడాడ రమణికుమారి, ద్రోణంరాజు శ్రీవత్సవ, కె.కె. రాజు తదితరులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని పార్టీ నాయకులు పేర్కొన్నారు. రేగం చాణక్యకు అడ్డంకులు మారికవలస గురుకులంలో విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్యను సుంకరమెట్ట చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు జడ్పీటీసీ కమ్మిడి అశోక్, ఎంపీటీసీ ఓలేసి రాజ్‌కుమార్‌లను కూడా అడ్డుకున్నారు. గిరిజన విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా, వారి తరఫున ప్రశ్నించే వారిని అడ్డుకోవడం దారుణమని రేగం చాణక్య పేర్కొన్నారు. మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస దేవన్‌రెడ్డికి హౌస్ అరెస్ట్ మారికవలసలో నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావును పోలీసులు కార్యాలయంలోనే నిర్బంధించేందుకు ప్రయత్నించారని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును కాలరాయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో 480 మంది గిరిజన విద్యార్థులను అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య ఇతర ప్రాంతాలకు తరలించిన ఘటనపై తల్లిదండ్రుల నిరసనకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్‌రెడ్డిని న్యూపోర్టు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు వైయస్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. గిరిజన విద్యార్థుల హక్కుల కోసం పోరాటం మారికవలస గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని, విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించకుండా వారి విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని వైయస్ఆర్‌సీపీ స్పష్టం చేసింది. పోలీసుల నిర్బంధాలు, అడ్డంకులతో గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రుల న్యాయమైన పోరాటాన్ని అణచివేయలేరని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందని పార్టీ నాయకులు తెలిపారు.