తాడేపల్లి: చంద్రబాబు మొగల్తూరులో చేసిన వ్యాఖ్యలకు వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వెన్నుపోటు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన చరిత్రను సైతం గర్వంగా చెప్పుకునే స్థాయికి చంద్రబాబు వెళ్లారని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి చెప్పుకునే చంద్రబాబు.. రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలకు చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్‌లు చేసి క్రెడిట్ కొట్టేయడం తప్ప చంద్రబాబు సాధించింది ఏమీ లేదని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో వంగవీటి నరేంద్ర ఏమన్నారంటే.. * వెన్నుపోటు చరిత్రను గర్వంగా చెప్పుకుంటున్న చంద్రబాబు వెన్నుపోటు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాల్సిన పరిస్థితి చంద్రబాబు తన వ్యాఖ్యలతోనే తెచ్చుకున్నారు. మొగల్తూరులో తాను ముఖ్యమంత్రి అయిన రోజును గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. నాడు పిల్లనిచ్చిన మామకు చేసిన వెన్నుపోటు చరిత్రను ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే ఆయన రెండేళ్ల పాలనలో తనదైన అభివృద్ధి, సంక్షేమం ఒక్కటైనా చూపించలేకపోతున్నారు. ప్రతి సభలోనూ వైయస్ఆర్‌సీపీ, గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పలేకపోతున్నారు. * జగన్ పూర్తి చేసిన పనులకు రిబ్బన్ కటింగ్.. క్రెడిట్ కొట్టేయడమే చంద్రబాబు పని వైయస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేసి క్రెడిట్ కొట్టేయడమే చంద్రబాబు పని అయిపోయింది. వెలిగొండ ప్రాజెక్టుకు 30 ఏళ్ల క్రితం శిలాఫలకం వేసి ఇప్పుడు తానే ఆ కలను నెరవేర్చానని చెప్పుకోవడం ఏంటి? భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ, ఇతర ప్రక్రియలను పూర్తి చేసి జగన్ ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్లింది. జగన్ హయాంలోనే ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయి. చివరకు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి తానే చేశానని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమే. ఇక సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3,000, 50 ఏళ్లు దాటిన వారికి రూ.4,000 పెన్షన్, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలను ఎక్కడ అమలు చేశారో చెప్పాలి. * సంక్షేమాన్ని కోసి.. హామీలను గాలికొదిలారు వైయస్ జగన్ పాలనలో పార్టీ, కులం, మతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందింది. కరోనా సమయంలోనూ ఒక్క పథకాన్ని ఆపలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం పెన్షన్ల పేరుతో విచారణలు నిర్వహించి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మందికి కోత పెట్టింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారో చెప్పలేని పరిస్థితి. పెన్షన్లకు ఖర్చు చేసిన ప్రజాధనాన్ని భారంగా చూపించడం సిగ్గుచేటు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలనే అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. * రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులంటూ మాటలు.. నేలపై కనిపించేది శూన్యం రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారు. నిజంగా అంత పెట్టుబడి, అంత ఉద్యోగాలు వస్తే నిరుద్యోగులు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు? రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? టమాటా, మామిడి, వరి, మొక్కజొన్న, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు లేదు? విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.21 వేల కోట్ల భారం మోపి, కొంత తగ్గింపును గొప్పగా చెప్పుకోవడం ఏంటి? మరోవైపు యోగాంధ్ర పేరుతో రూ.400 కోట్లు, ఇతర ప్రచార కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ రాష్ట్రంపై అప్పుల భారాన్ని పెంచుతున్నారు. జగన్ పాలనను కాపీ కొట్టడం, ఆయన పూర్తి చేసిన పనులకు రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు చూపించడానికి ఏమీ లేదు.