పోలవరంపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు..

ఎత్తిపోతల నీళ్లను గ్రావిటీ జలాలంటూ పచ్చి మోసం:

మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజం

రాజమండ్రి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్.

కుర్చీ చోరీ నుంచి ఓట్ల చోరీ.. ఇప్పుడు ప్రాజెక్టుల క్రెడిట్ చోరీ:

సీఎం చంద్రబాబుపై భరత్ ఫైర్

వైయ‌స్‌ఆర్, వైయ‌స్‌ జగన్ కష్టాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న బాబు

క్రెడిట్ చోరీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య

ఆధారాలతో సహా ఎండగట్టిన మాజీ ఎంపీ మార్గాని భరత్.

రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు గరిష్ట నిర్మాణ పనులన్నీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే రికార్డు స్థాయిలో పూర్తయ్యాయని, అయితే అంతా తానే నిర్మించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తోట వెంకటాచలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని ఏలేరు రిజర్వాయర్‌కు ఎత్తిపోసి అనకాపల్లికి పంపిస్తూ.. పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు వదిలామని చంద్రబాబు ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నారని ఆధారాలతో ఎండగట్టారు. 1996లో సొంత మామ ఎన్టీఆర్ కుర్చీ చోరీతో మొదలైన చంద్రబాబు చోరీ నైజం, 2024లో ఓట్ల చోరీ నుంచి నేడు ఇరిగేషన్ ప్రాజెక్టుల క్రెడిట్ చోరీ దాకా కొనసాగుతోందని భరత్ తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

క్రెడిట్ చోరీలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి:

1996లో సొంత మామ కుర్చీని చోరీ చేయడంతో మొదలైన చంద్రబాబు నైజం ఇప్పటికీ మారలేదు. 2024 ఎన్నికల్లో ఓట్లు చోరీ చేశారు. ఇప్పుడు వైయ‌స్‌ఆర్, వైయ‌స్‌ జగన్ రెక్కల కష్టంతో నిర్మించిన ప్రాజెక్టులకు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. తన కొడుకు వయసున్న వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను తన ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుపడటం లేదు.

పోలవరం నుంచి గ్రావిటీపై చుక్క నీరు వెళ్లట్లేదు:

రేపు పాయకరావుపేట వద్ద పోలవరం ప్రాజెక్టు నీళ్లు అనకాపల్లికి విడుదల చేస్తున్నామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నేను నొక్కి వక్కాణిస్తున్నా.. పోలవరం హెడ్ వర్క్స్ నుంచి గ్రావిటీ ద్వారా అనకాపల్లికి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లట్లేదు. పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసి, ఏలేరు రిజర్వాయర్ మీదుగా పంపిస్తూ.. పోలవరం నీరంటూ ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు.

పురుషోత్తపట్నం పనులకు పునాది వేసింది వైయ‌స్‌ఆర్:

తోట వెంకటాచలం పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పనులను 2008 మార్చి 14న ప్రారంభించిందే వైయ‌స్‌ఆర్. ఆ రోజుల్లో పోలవరం కాలువలు తవ్వుతుంటే 'ఇది జలయజ్ఞం కాదు.. ధన యజ్ఞం.. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే' అని విషం కక్కిన చంద్రబాబుకు, ఇవాళ అవే కాలువల వద్ద నిలబడి రిబ్బన్లు కట్ చేయడానికి సిగ్గు లేదా? పోలవరం కుడి కాలువను 90 శాతం, ఎడమ కాలువను 70 శాతం పూర్తి చేసింది దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్. రాజశేఖరరెడ్డే.

పోలవరం ఎత్తు తగ్గించి బ్యారేజీగా మార్చేశారు:

పోలవరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.72 మీటర్లు నిలబెడితేనే ఉత్తరాంధ్రకు గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్లడం సాధ్యమవుతుంది. కానీ, చంద్రబాబు ఆగస్టు 28, 2024న కేంద్రంతో కేవలం 41.15 మీటర్ల ఎత్తుకు పరిమితం చేస్తూ సంతకం పెట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నప్పుడు... సీడబ్ల్యూసీ ద్వారా రూ.48 వేల కోట్లకు క్లియరెన్స్ ఇస్తే, చంద్రబాబు దాన్ని రూ.30,436 కోట్లకు కుదించి సంతకాలు చేసి పోలవరాన్ని కేవలం ఒక బ్యారేజీగా, ఎత్తిపోతల ప్రాజెక్టుగా మార్చేశారు.

చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెట్టాలి:

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండానే నీళ్లు వదిలేసి, పోలవరం ప్రాజెక్టు గుండెకాయ లాంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణమైన వ్యక్తి చంద్రబాబే. ప్రాజెక్టును సర్వనాశనం చేసినందుకు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారే స్పిల్ వే, హైడ్రాలిక్ గేట్లు, అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి ప్రాజెక్టును నిలబెట్టారు.

ఎడమ కాలువ ప్యాకేజీల్లో అడ్డగోలు దోపిడీ:

181 కిలోమీటర్ల ఎల్ఎంసీ కాలువ పనుల్లో 70 శాతం పనులు రాజశేఖర్‌రెడ్డి గారి హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలిన 30 శాతం కాలువ పనులు మాత్రమే ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది. సాధారణంగా ప్రాజెక్టుల అంచనాలు పెరిగినా 10 శాతమో, 15 శాతమో పెరుగుతాయి. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ (LMC) పనుల అంచనాలను అడ్డగోలుగా 200 నుంచి 300 శాతం పెంచి చంద్రబాబు సర్కార్ ప్రజాధనాన్ని లూటీ చేసింది.

  • ప్యాకేజీ-1 అంచనా వ్యయం రూ.20 కోట్లు ఉంటే దాన్ని రూ.70 కోట్లకు పెంచారు.
  • ప్యాకేజీ-3 అంచనా వ్యయం రూ.30 కోట్లు ఉంటే రూ.112 కోట్లకు పెంచారు.
  • ప్యాకేజీ-6A అంచనా వ్యయం రూ.98 కోట్లు ఉంటే రూ.336 కోట్లకు పెంచారు.
  • ప్యాకేజీ-5.5A అంచనా వ్యయం రూ.81 కోట్లు ఉంటే రూ.307 కోట్లకు పెంచారు.
  • ప్యాకేజీ-8.8A అంచనా వ్యయం రూ.20 కోట్లు ఉంటే రూ.76 కోట్లకు పెంచారు.

ఇలా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. ఇది ప్రభుత్వ సొమ్ము కాదు.. ప్రజల సొమ్ము. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ప్రజల డబ్బే. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా ప్యాకేజీల అంచనాలు పెంచి ఖర్చు చేయడం దోపిడీ కాదా?

వెలిగొండను 13 ఏళ్లు గాలికొదిలేసి.. ఇప్పుడు సాష్టాంగ నమస్కారాలా?:

1996లో వెలిగొండకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, 13 ఏళ్లు సీఎంగా ఉండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు?. వైయ‌స్. జగన్ మోహన్ రెడ్డి ఫారెస్ట్ క్లియరెన్స్‌లు తెచ్చి 90 శాతం పనులు పూర్తి చేస్తే, ఇప్పుడు చంద్రబాబు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఆ కార్యక్రమంలో సాక్షాత్తూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని తోసేసి తన కుల కక్షను చంద్రబాబు బయటపెట్టుకున్నారు.

రాజమండ్రి ఫ్లైఓవర్ నుంచి భోగాపురం దాకా అన్నీ క్రెడిట్ చోరీలే:

రాజమండ్రిలో రాత్రింబవళ్లు కష్టపడి మేము మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మిస్తే, క్రెడిట్ తీసుకోవడానికి ఐదుగురు కూటమి ప్రజాప్రతినిధులు ఎగబడ్డారని భరత్ మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులైనా, ప్రాజెక్టులైనా వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే చేసామని, కరోనా రెండేళ్లు రాకపోయి ఉంటే ఈ పాటికి పోలవరం నుంచి విశాఖ దాకా గ్రావిటీ ద్వారానే నీళ్లు ఇచ్చేవాళ్లమని తేల్చి చెప్పారు. చంద్రబాబుకి దమ్ముంటే పోలవరం నుంచి నీళ్లు ఇస్తున్నామని హెడ్ వర్క్స్ వద్దకు వచ్చి రిబ్బన్ కట్ చేయాలని సవాల్ విసిరిన భరత్.. ఈ జెన్‌జీ యుగంలో టక్కు టమారు విద్యలతో ప్రజలను మోసం చేయలేరని స్పష్టం చేశారు.
 

Back to Top