వెలిగొండ ప్రాజెక్టును తానే కట్టానని చంద్రబాబు క్రెడిట్‌ చోరీ

వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మించిన ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకుంటున్న బాబు

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు.

వెలిగొండపై చర్చకు రమ్మంటే పారిపోయిన వెన్నుపోటు పార్టీ

మాగుంటా నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు:

హెచ్చరించిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

తాడేపల్లి: దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిలు వెలిగొండ ప్రాజెక్టును 82 శాతానికి పైగా పూర్తి చేస్తే.. అంతా తానే చేసినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తీవ్రంగా ఖండించారు.

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టులో ఎవరి హయాంలో ఎంత పని జరిగిందో లెక్కలతో సహా చర్చకు రావాలని గత కొద్దిరోజులుగా సవాల్‌ విసిరినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం తోక ముడిచిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుపై వాస్తవాలు మాట్లాడే దమ్ములేక, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో వ్యక్తిగతంగా నీచమైన భాషలో మాట్లాడించారని ఆక్షేపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకులకు ప్రకాశం జిల్లా ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే..

 టన్నెళ్లు తవ్వింది వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌... క్రెడిట్‌ చోరీ చేస్తోంది చంద్రబాబు: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం పేరిట వారం రోజులుగా చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి టీడీపీ నాయకుల వరకు అబద్ధపు ప్రచారాలు చేస్తుంటే ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. 1996లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు 8 ఏళ్లపాటు సీఎంగా ఉండి ఒక్క పనీ చేయలేదు. 2004లో వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి గారు అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి 20 కిలోమీటర్లకు పైగా టన్నెల్స్‌ తవ్వించారు. చంద్రబాబు హయాంలో కేవలం 6.68 కిలోమీటర్లు మాత్రమే తవ్వగా, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు సీఎం అయ్యాక 10.56 కిలోమీటర్ల మేర సొరంగాలను పూర్తి చేసి బ్రేక్‌ త్రూ సాధించారు. టన్నెల్‌–1ను 2021 జనవరిలో, టన్నెల్‌–2ను 2024 జనవరిలో పూర్తి చేసి 2024 మార్చిలోనే వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జాతికి అంకితం చేశారు. మొత్తం 37 కిలోమీటర్ల టన్నెల్లలో వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ కలిసి 31 కిలోమీటర్ల పైచిలుకు పూర్తి చేస్తే, అంతా తానే చేసినట్లు చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఎందుకు పరిహారం ఇవ్వలేదు?

2024 మార్చిలోనే వైయ‌స్‌ జగన్‌ రెండు టన్నెళ్లను పూర్తి చేసినప్పుడు, గడిచిన 27 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం ఎందుకు కల్పించలేదు? వారికి ఇవ్వాల్సిన నిధులను ఎందుకు విడుదల చేయలేదు? ఏ పనీ చేయకుండా తానే మొత్తం చేశానని చంద్రబాబు ఊరూరా ప్రచారం చేసుకోవడం ఊరిలో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉంది.

మాగుంట దిగజారుడు మాటలు..

వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ దయతో రాజకీయాల్లో ఎదిగిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచి ఇవాళ మాట్లాడే భాష ఇదేనా? 2024 మార్చిలో వైయ‌స్‌ జగన్‌ గారు టన్నెల్లను జాతికి అంకితం చేసిన సభలో మాగుంట కూడా ఉన్నారు. ఆ విషయం మర్చిపోయి, ఈరోజు చంద్రబాబు ప్రాపకం కోసం అదే జగన్‌గారిపై పిచ్చిగా మాట్లాడుతున్నారు. అయ్యా, శ్రీనివాసులురెడ్డిగారూ మీరు కావాలంటే చంద్రబాబు కాళ్లు కడిగి నెత్తిన పోసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ వైయ‌స్‌ జగన్‌ను, పార్టీని దూషిస్తే సహించేది లేదు. మేము జెండాలు మోసి ఎదిగిన కార్యకర్తలం. మాగుంటా..నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. 

దమ్ముంటే ఒంగోలు ఎంపీ పదవికి రాజీనామా చేసి వెలిగొండపై ఎన్నికలకు రా.. మాగుంట!: 

టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, మాజీ ఎమ్మెల్యే 

 ఎవరికో పుట్టిన బిడ్డను ఇంటికి తెచ్చుకుని పేరు పెట్టుకున్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్మించిన ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సాష్టాంగ నమస్కారాలు పెట్టి క్రెడిట్‌ నాదే అనడం సిగ్గుచేటు. 1996 నుంచి 2004 వరకు ఎనిమిదిన్నరేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వెలిగొండ ప్రారంభోత్సవం రోజు మైకులు, ఫోన్లు, డయాస్‌ కోసం రూ. 11 లక్షలు ఖర్చు చేయడం తప్ప కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదు. దమ్ముంటే చంద్రబాబు ఆ ఎనిమిదిన్నరేళ్లలో వెలిగొండపై ఎంత ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలి. 32 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణాన్ని పూర్తి చేసింది కేవలం వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ మాత్రమే.

మాగుంట కుటుంబానికి రాజకీయ మరణ శాసనం..

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో పెరిగి, పార్టీ అన్నం తిని ఇవాళ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు. చంద్రబాబు ప్రాపకం కోసం మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ను ‘మూర్ఖుడు, వాడు’ అని సంబోధిస్తారా? స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న చరిత్ర మాగుంటది. వైయ‌స్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజే ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబ రాజకీయ మరణ శాసనం లిఖించబడింది.

ఒంగోలు ఎంపీ పదవికి రాజీనామా చేయ్‌..

మాగుంట శ్రీనివాసులు రెడ్డికి నిజంగా దమ్ముంటే ఒంగోలు ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. వైయ‌స్‌ జగన్‌ ప్రచారానికి కూడా రారు. కేవలం వెలిగొండ ప్రాజెక్టు అంశంపైనే పశ్చిమ ప్రకాశంలోని ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి అసెంబ్లీ పరిధిలో ఎన్నికలకు వెళ్దాం, తేల్చుకుందాం రా. 2019లో వైవీ సుబ్బారెడ్డిని కాదని టికెట్‌ ఇస్తే గెలిచి ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీపైనే విషం కక్కుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తారు. జిల్లాలో ఎక్కడ తిరిగినా చెప్పులతో స్వాగతం పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. చంద్రబాబు ప్రాజెక్టుల వద్ద పొర్లు దండాలు, డ్రామాలు ఆపి.. ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, ఇళ్లను తక్షణమే అందించాలి.
 

Back to Top