తాడేపల్లి: అప్పుడు వైయస్‌ఆర్, ఆ తర్వాత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వేగంగా సాగిన వెలిగొండ ప్రాజెక్టు పనులను తనవిగా చెప్పుకుంటూ చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టులో తాను చేయని పనులను సైతం చెప్పుకుంటున్న చంద్రబాబు.. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో అందించాల్సిన పరిహారాన్ని ఎగ్గొట్టడమే కాకుండా, వారిపై ఎదురువేధింపులకు దిగుతున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరావతి రైతుల తరహాలో వెలిగొండ నిర్వాసితులకు కూడా ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌లో తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏమన్నారంటే... వెలిగొండపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే ఈ రోజు వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న కర్త, కర్మ, క్రియ ఎవరో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా గమనించాలి. నిజంగా పూల సుబ్బయ్య గారి పోరాటం లేకపోతే, వైయస్‌ఆర్ గారి సంకల్పం లేకపోతే, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు టన్నెల్స్ పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఉండకపోతే, ఆ ప్రాంత ప్రజలు తమ జీవితాలను త్యాగం చేసి స్థలాలు ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టు ఉండేదా? ఈ ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుందని ఆశిస్తున్నాం. దీని వెనుక వీరందరి కష్టం, త్యాగం, పట్టుదల, కృషి లేదా? ప్రతిదీ నాదే అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ మరోసారి క్రెడిట్ చోరీ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందంటే దానికి సంబంధించిన కాలువలు, టన్నెల్స్ పూర్తవ్వాలి. ఇవన్నీ చేయకుండా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? వెలిగొండ ప్రాజెక్టుకు గుండెకాయ అయిన సొరంగాలను పూర్తి చేసి, మళ్లీ అధికారంలోకి రాగానే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి నల్లమలసాగర్‌లోకి నీటిని నింపుతామని వాటిని జాతికి అంకితం చేసేటప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినా.. పూర్తి ప్యాకేజీని జాతికి అంకితం చేసినట్లుగా తప్పుడు ప్రచారాలు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు చేసిందేంటి? వెలిగొండ ప్రాజెక్టు అంటే వైయస్‌ఆర్ గారు కేవలం రెండు సొరంగాలు అనుకోలేదు, గొట్టిపడియ, కాకర్ల, సుంకేశుల డ్యామ్‌లు మాత్రమే అనుకోలేదు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌లు అన్నీ కలిపితేనే వెలిగొండ ప్రాజెక్టు. దీంతో పాటు 62 వేల ఎకరాలకు నీళ్లిచ్చే తీగలేరు కుడి, ఎడమ కాలువలు కలిపితేనే కదా వెలిగొండ ప్రాజెక్టు. ఇప్పుడు నేను వెన్నుపోటు పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నా. నేను చెబుతున్న ఈ పనులన్నీ మేమే మొదలుపెట్టి, పూర్తి చేశామని చెప్పుకునే దమ్మూ ధైర్యం మీకూ, మీ నాయకుడికి ఉందా అని ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పండి. వెలిగొండ ప్రదాతలు వైయస్‌ఆర్, వైయస్ జగన్ మోహన్ రెడ్డిలే 1993లో మొదలైన ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధంగా ఉండగా.. ఎనిమిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, కేంద్రంలో చక్రాలు తిప్పిన వ్యక్తి అనుమతులు ఎందుకు తీసుకురాలేదు, పక్క రాష్ట్రాన్ని ఎందుకు ఒప్పించలేదు, నల్లమలసాగర్ డ్యామ్‌లు ఎందుకు నిర్మించలేకపోయారు, అర్ధరూపాయి ఖర్చు ఎందుకు పెట్టలేకపోయారు, అయినా నిస్సిగ్గుగా మేం ఖర్చుపెట్టామని అబద్ధాలు చెప్పుకుంటున్నారు. ఛాట్‌జీపీటీని అడిగితే మీ నిర్వాకం ఏంటో చూపిస్తుంది. 2014కు ముందు చంద్రబాబు ఈ ప్రాజెక్టులో ఏదైనా పని చేసి ఉంటే, భూసేకరణ చేసి ఉంటే, ఒక్క డ్యామ్ అయినా నిర్మించి ఉంటే ఫొటోలు బయటపెట్టండి. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంకల్పించి, పశ్చిమ ప్రకాశం వాసుల జీవనాడి అని గుర్తించి, కడప, నెల్లూరుకు తాగు, సాగునీరు ఇచ్చే వరప్రదాయిని అవుతుందని గుర్తించి, అధికారం చేపట్టిన తొలిసారే ఐదు వేల కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. ఈ రోజుకీ తీగలేరు కెనాల్‌కు తవ్విన కాలువలను చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులు గుర్తుకొస్తాయి. ఆ తర్వాత మళ్లీ పనులు ఆగిపోయాయి. కోవిడ్ సమయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు కొండల్ని తొలిచి సొరంగాలు ఏర్పాటు చేశారు. రెండేళ్లు వృథా పోయినా ఎక్కడా తలవంచకుండా మూడేళ్లలో రూ.1,050 కోట్లు వెచ్చించారు. అంటే ఏడాదికి రూ.350 కోట్ల చొప్పున ఖర్చు పెట్టారు. ఆ లెక్కన వెన్నుపోటు పార్టీ 20 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టాలి? ఇవాళ నీళ్లు వదులుతున్నానని సాష్టాంగ నమస్కారం చేస్తున్న చంద్రబాబు.. రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పానికి నమస్కారం చేయాలి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సంకల్పానికి నమస్కరించాలి. అదంతా వదిలేసి కోట్లు కుమ్మరించి సర్కార్ వారి సర్కస్ ఫీట్లు చేశారు. మీరు ఇవన్నీ డ్యామ్ దగ్గర చేయకుండా గంటవానిపల్లి దగ్గర ఎందుకు చేశారు? డ్యామ్ దగ్గరికి వెళ్లి ఉంటే నిర్వాసితులు మీ దుర్మార్గాన్ని బయటపెట్టేవారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోగా వేధింపులా? వెలిగొండ నిర్వాసితులను చంద్రబాబు దారుణంగా అవమానించారు. ఇవాళ నీళ్లు వదులుతూ రాత్రి వరకూ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదు. 2020లో 324 జీవో ప్రకారం 7,555 మంది నిర్వాసిత కుటుంబాలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే.. దాన్ని 7,321 కుటుంబాలకు కుదించేశారు. అంటే 200 కుటుంబాలను ఎత్తేశారు. ఏవేవో సాకులు చెప్పి మరో 1,100 కుటుంబాలను పక్కనబెట్టారు. 2019కి ముందు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సుమారు 6 లక్షలు ఉండేది, దాన్ని రూ.12.50 లక్షలు చేసిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డిదే. జీవో 324లో ఇది స్పష్టంగా ఉంది. మరి చంద్రబాబు రూ.900 కోట్లు ఖర్చుపెట్టి అంతా ఇచ్చేశానంటే అబద్ధం కాదా? మీరు ఇస్తానంటున్న ప్లాట్లు, లేఅవుట్లు కానీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రోడ్లు వేసి, గుడులు కట్టి, బడులు కట్టి, వారికి అన్ని వసతులు కల్పించింది నిజం కాదా? ఇవాళ మార్కాపురానికి ఏదో చేసేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కలెక్టర్ ఆఫీసు కట్టుకోలేకపోయారు, నిర్వాసితులకు ఇచ్చిన స్కూల్ బిల్డింగ్‌లో కలెక్టరేట్ పెట్టిన చేతకాని, అసమర్థ ప్రభుత్వం మీది. మార్కాపురానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ తీసుకొస్తే, దాన్ని కూడా ప్రైవేటుకు అమ్మేయాలని కక్షగట్టిన దుర్మార్గపు ప్రభుత్వం మీది. ఇవాళ చంద్రబాబు సభ పెట్టిన డోర్నాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి 90 శాతం పూర్తి చేసిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డిదైతే, ఇవాళ మీరు రోడ్డు కూడా వేయలేకపోయారు. డబ్బా కబుర్లు కళ్లు ఆర్పకుండా చెప్పేస్తాడు చంద్రబాబు. కలెక్టర్ చుట్టూ రెండేళ్లుగా తిరిగినా నిర్వాసితులకు న్యాయం చేయకపోగా, అర్ధరాత్రి చీకట్లో పోలీసులు నీళ్లు వస్తున్నాయని చెప్పి వారిని బయటికి గెంటేశారు. ఎస్సీ కాలనీల్లో గర్భవతులు ఉంటే వారికి ఇళ్లు ఇవ్వలేదు, పశు సంపద ఉన్నా, ముసలి వాళ్లు ఉన్నా ఇళ్లు ఇవ్వలేదు. మాది వెనుకబడ్డ నియోజకవర్గం. ఎనిమిది, తొమ్మిది వేల కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ చంద్రబాబు వచ్చి ప్రారంభోత్సవం చేసిన తర్వాత కూడా అక్కడ నిర్వాసితులకు పట్టాలు అందలేదు. కల్నూతల, గొట్టిపడియ, సుంకేశుల, గుండంచర్లలో కేవలం గొట్టిపడియ, మార్కాపురం వాళ్లకు కొన్ని పట్టాలు ఇచ్చారు. 80 శాతం భూభాగం కలిగిన నిర్వాసితులకు అర్ధరూపాయి ప్యాకేజీ కూడా అందని వారు 300 మంది. వీళ్లంతా రాత్రి పడిగాపులు పడుతున్నా, తాగునీరు ఇవ్వకుండా, పది గంటలకు బోర్లకు కరెంటు కట్ చేశారు, ఇళ్లను పగులగొట్టించి బయటికి పంపేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తేనే వెళ్తామన్నా, అవార్డు ప్రకటించమని అడిగినా కలెక్టర్ స్పందించలేదు. కలెక్టర్ గారు వెళ్లిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పచ్చచీర కట్టుకుని వెళ్లారు కానీ, నిర్వాసితుల కన్నీళ్లు తుడవాలని అనుకోలేదు. వెలిగొండ నిర్వాసితులను అమరావతి రైతుల తరహాలో ఆదుకోవాలి గొట్టం రామాంజనేయులు అనే నిర్వాసితుడి కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టి, కుటుంబంలో ఆరుగురు ఉంటే ఒక్కరికి మాత్రమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. అన్నకు వస్తే తమ్ముడికి రాదు, కొడుక్కి వస్తే తండ్రికి రాదు. ఇలా వింత వింత సర్కస్ ఫీట్లు చేశారు. టీడీపీ సానుభూతిపరులకు ప్యాకేజీ ఇచ్చేసి, వైయస్ఆర్‌సీపీ అని అనుమానం వచ్చిన వాళ్లకు ఆపేశారు. కలనూతల గ్రామానికి చెందిన రోశమ్మ అనే ఎస్సీ మహిళ తనకు ప్యాకేజీ ఇవ్వలేదని చెబితే నేను వెళ్లి కలిశాను. తాగడానికి నీళ్లు లేకపోతే రెండు ట్యాంకర్లు పంపిస్తే వాటినీ అనుమతించలేదు. 300 కుటుంబాలకు తాగునీరు కూడా ఇవ్వకుండా నిర్వాసితులపై కక్ష సాధించారు. మనస్తాపానికి ఆ రోశమ్మ చనిపోయింది. ప్రచారం కోసం పెద్ద పెద్ద వేదికలు కట్టుకున్న చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కన్నీళ్లు మాత్రం తుడవలేకపోయాడు. వెలిగొండలో ప్రవహిస్తుంది కృష్ణాజలాలు మాత్రమే కాదు, అక్కడి నిర్వాసితుల కన్నీళ్లు కూడా. వాళ్లు పుట్టిన నేలను, చదువుకున్న స్కూలును, కొలిచిన గుడిని, పిత్రుల సమాధులను, జీవనోపాధికి ఉపయోగించుకున్న పొలాలను, నివాసాలను వారు వెలిగొండ ప్రాజెక్టు కోసం ధారాదత్తం చేశారు. వారు ఇచ్చింది కేవలం స్థలాలు మాత్రమే కాదు, వారి నూరేళ్ల జీవితాలను కూడా ఈ ప్రాజెక్టు కోసం ఇచ్చారు. వాళ్లు ఇవాళ బయటికి వస్తే ఏం చేయాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, వాళ్లకు ఇచ్చిన స్కూల్ బిల్డింగ్‌ను కలెక్టర్ ఆఫీసులుగా మార్చేసుకున్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో తీసుకున్న భూమిని స్థానిక టీడీపీ నేతలు కొని, మళ్లీ అదే భూమిని రూ.1.30 కోట్లకు కలెక్టర్ గారికి ఇచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రూ.1.30 కోట్లకు కలెక్టర్ గారు తీసేసుకుని, డబ్బులు కూడా చెల్లించారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో ఎకరం భూమి కూడా రాదు. అక్కడ చేసుకోవడానికి ఎలాంటి వాణిజ్య సముదాయాలు కూడా లేవు. ఓ రైతు తన భూమి అమ్ముకుంటేనో, ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఇస్తే అది రాష్ట్రం కోసం చేసిన త్యాగం అని చిత్రీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. సంతోషమే. కానీ ఇక్కడ కూడా అలా ఎందుకు ఇవ్వలేదు. అమరావతిలో తీసుకున్న భూములకు వెయ్యి గజాల ప్లాట్లు, 450 చదరపు గజాల వాణిజ్య స్థలం ఇచ్చారు, రుణమాఫీ చేశారు, స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. అవే నిబంధనలు ఇక్కడ ఎందుకు వర్తించవు. చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేసిన స్థలం వెలిగొండ నిర్వాసితులది కాదా అని అడుగుతున్నాం. వారు ఎస్సీలని ఇలా అవమానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఒకే న్యాయం చేయరా? అమరావతిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు కడుతూ, వెలిగొండలో మాత్రం నిర్వాసితులను రోడ్డుపై విసిరేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 10 వేల కుటుంబాలు రోడ్డున పడితే ముందస్తు చర్యలు తీసుకోకుండా, ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా, వారికి ప్లాట్లు కేటాయించకుండా, రోడ్డు కంటే మూడు అడుగుల లోతులో వారి ప్లాట్లు ఉంటే, ఇక్కడ నుంచి తెచ్చుకునే సామాగ్రి రోడ్డు మీద పారేసుకోవాలా, ఎంత అన్యాయం చేస్తున్నారో అర్థమవుతోంది. అందుకే వెలిగొండ నిర్వాసితులకు కచ్చితంగా న్యాయం చేయాల్సిందే. అమరావతి తరహాలో వెలిగొండ నిర్వాసితులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందని వారికి వెంటనే దాన్ని విడుదల చేయాలి, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకూ దీన్ని వర్తింపజేయాలి. మీరు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామంటున్నారు, దీంతో వాళ్లు ఎకరం పొలం కొనగలరా, వ్యాపారం చేసుకోగలరా, పెళ్లి చేసుకుంటే కుటుంబాన్ని పోషించుకోగలరా, కాబట్టి వారందరికీ పూర్తి ప్యాకేజీ వర్తింపజేయాలి. ఇళ్ల స్థలాలు కేటాయించి, శాశ్వత ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలి. చౌకబారు మాటలతో మాగుంట గౌరవం తగ్గించుకోవద్దు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అంటే మాకూ గౌరవం. ఎందుకంటే పెద్దలు, మంచి కుటుంబం నుంచి వచ్చిన వారు, కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు వారి సోదరులకూ ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇవాళ ఆయన మాటలు చూస్తుంటే ఎందుకింత దిగజారి పోతున్నారని అనిపిస్తోంది. చివరికి కులాన్ని కూడా వాడేస్తున్న పరిస్థితి. ఎవరి దగ్గర పార్టీ టికెట్ తీసుకుని ఎంపీ అయిన మాగుంట ఇవాళ వాడూ, వీడూ అని సంబోధిస్తున్న పరిస్థితి చూస్తుంటే.. చంద్రబాబుకు ఇంత భజన చేయాలా అనిపిస్తోంది. ఇవాళ గంగమ్మ నీళ్లు వస్తే మీ ఒళ్లు పులకరించి పోయిందన్నారు, మరి 9 సంవత్సరాలు సీఎంగా ఉండి వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు మోసం చేస్తుంటే అప్పుడు మీ ఒళ్లు ఎందుకు మండలేదు. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడలేని మీరు, వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు వచ్చిందంటే అది వైయస్‌ఆర్ గారి సంకల్పం. డాబుసరి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. చంద్రబాబు కోసం మీ గౌరవం తగ్గించుకోవద్దు. వెలిగొండలో రెండు సొరంగాలు పూర్తి చేసి జాతికి అంకితం చేసినప్పుడు మీరు మాట్లాడి ఉండాల్సింది కదా. మార్కాపురంపై మీకు ప్రేమ ఉండి ఉంటే, అక్కడ మెడికల్ కాలేజీని ఆపేస్తే మీకు ఒళ్లు మండాలి కదా, కానీ మండదు. ఎందుకంటే మనం రాజకీయం చేస్తున్నాం, కాబట్టి రాజకీయమే కావాలి, మంచి అక్కర్లేదు. ఇది సరికాదని మాగుంట శ్రీనివాసరెడ్డికి తాటిపర్తి చంద్రశేఖర్ హితవు పలికారు.