తాడేపల్లి: సంచార జాతులకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గుర్తింపు, ఆత్మగౌరవాన్ని మరే ప్రభుత్వం ఇవ్వలేదని సంచార జాతుల సంఘం నాయకులు పెండ్ర వీరన్న స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో 74వ స్వతంత్ర సంచార జాతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలో నేరస్తులుగా ముద్రపడి, స్వాతంత్య్రం వచ్చినా గుర్తింపునకు నోచుకోని సంచార జాతులకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా బీసీ-ఏ జాబితాలోని 32 సంచార కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎవరూ ఇవ్వని విధంగా లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, సంక్షేమ పథకాలు అందించి అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. సంచార జాతులను చిన్నచూపు చూస్తూ, కనీసం పాలకమండలి కూడా ఏర్పాటు చేయని కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతున్నామని, తమకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 32 కులాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి బీసీ-ఏ జాబితాలో సంచార జాతులకు ఉన్న 7 శాతం రిజర్వేషన్ ఫలాలు బలమైన వర్గాలకే అందుతున్నాయని, అందువల్ల గంగిరెద్దుల, బుడబుక్కల, పిచ్చుగుంట్ల వంటి 32 కులాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని వీరన్న డిమాండ్ చేశారు. ఎంతో కష్టపడి బీటెక్, ఎంటెక్ చదువుకున్న తమ పిల్లలకు రిజర్వేషన్లు అందక, ఉద్యోగాలు రాక హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో పనిచేసుకునే దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి పోరాటం చేస్తామని వారు తీర్మానించారు. అట్టడుగు కులాలకు ప్రాతినిధ్యం కల్పించిన జగన్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, అట్టడుగు కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ జాతుల పోరాటానికి వైయస్ఆర్‌సీపీ మద్దతుగా నిలిచిందని పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. ఓటు, ఆధార్ కార్డు, కనీస ఉపాధి లేక ఉనికి కోల్పోతున్న సంచార జాతుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వీరన్న చేసిన పోరాటాన్ని జగన్ గారు గుర్తించి వారికి సమాజంలో ఒక ‘కేరాఫ్ అడ్రస్’ ఇచ్చారని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం చేసిన జగన్‌ను కాపాడుకోవాలి మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. సంచార జాతులను సహృదయంతో చూసి, వారికి సామాజిక న్యాయం చేసిన జగన్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వర్గాలపై ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, పార్టీ నాయకురాలు సునీతమ్మ తదితరులు పాల్గొన్నారు.