నెల్లూరు: వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించి, తానే పూర్తి చేసినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. సోమవారం నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాలనలో కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని అన్నారు. వెలిగొండలో 30.5 కిలోమీటర్ల పనులు తండ్రీకొడుకులవే 37.5 కిలోమీటర్ల మేర ఉన్న రెండు ప్రధాన టన్నెళ్లలో దాదాపు 30.5 కిలోమీటర్ల పనులను వైయస్‌ఆర్, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేశారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైయస్‌ఆర్ హయాంలో 20 కిలోమీటర్ల టన్నెల్ పనులు జరిగితే, చంద్రబాబు హయాంలో 6.6 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో కరోనా కష్టకాలంలోనూ 10.5 కిలోమీటర్ల పనులు పూర్తి చేసి, 2024 జనవరిలో జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. నల్లమలసాగర్ పనుల్లోనూ వైయస్‌ఆర్, జగన్‌దే కీలక పాత్ర 55 టీఎంసీల సామర్థ్యం ఉన్న నల్లమలసాగర్ రిజర్వాయర్ పనుల్లో 82 శాతం వైయస్‌ఆర్, 15 శాతం వైయస్ జగన్ పూర్తి చేశారని, చంద్రబాబు చేసింది కేవలం 3 శాతం మాత్రమేనని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వెలిగొండ రెండు ప్రధాన హెడ్ రెగ్యులేటర్లు, 30 కిలోమీటర్ల మేజర్ కెనాల్స్ పనులు కూడా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు. వెలిగొండపై వాస్తవాలు ప్రజల ముందున్నాయి వెలిగొండ ప్రాజెక్టుపై ఎన్ని అబద్ధాలు చెప్పినా, సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా వాస్తవాలు మారవని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏ సమయంలో ఏ పని జరిగిందో ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా ఉందని, ప్రజలు కూడా అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచడమే తమ ఉద్దేశమన్నారు. నెల్లూరు రైతాంగంలో ఆందోళన రాబోయే రెండు నెలల్లో నెల్లూరు జిల్లాకు మొదటి పంటకు నీళ్లు వస్తాయో లేదోనని రైతాంగం ఆందోళన చెందుతోందని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో పెన్నా, నెల్లూరు బ్యారేజీలతో పాటు సుమారు రూ.3 వేల కోట్ల సాగునీటి పనులు జరిగాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం కోటి రూపాయల పనైనా జరిగిందా అని ప్రశ్నించారు. తాను రాజకీయ టూరిస్టును కాదని, పార్టీకి, వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందుండి గొంతెత్తే సైనికుడినని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.