మదనపల్లె: పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, యుద్ధ ప్రాతిపదికన శాండ్ రింగ్ బండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమ్మద్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మదనపల్లె పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయని నిసార్ అహమ్మద్ తెలిపారు. 2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా సుమారు 1.36 లక్షలు కాగా, ప్రస్తుతం సుమారు రెండు లక్షలకు చేరువలో ఉన్నట్లు అంచనాలు ఉన్నాయని చెప్పారు. అందుబాటులోకి వచ్చే నీటిని సమర్థవంతంగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. చిప్పిలి ట్యాంక్‌కు నీరు వచ్చే సమయానికి రక్షణ చర్యలు పూర్తి చేయాలని మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి అన్నారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు నీరు వచ్చినా ట్యాంక్‌లో సురక్షితంగా నిల్వ చేసుకోలేకపోతే ప్రజలకు నీటిని ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ట్యాంక్ బలహీన ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట శాండ్ రింగ్ బండ్, ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి కోరారు. నీరు వచ్చిన తర్వాత ఏర్పాట్లు చేయకుండా ముందుగానే అన్ని చర్యలు పూర్తి చేయాలని, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని అన్నారు. కదిరి నియోజకవర్గంలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితి ఏర్పడితే, ఆ నీటిని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో సమర్థవంతంగా నిల్వ చేసుకునేందుకు అధికారులు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు కోరారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, వి.ఎస్. రెడ్డి, సి.పి. రాఘవ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.