తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలో జరిగే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోనున్న వైయస్ జగన్, అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. సెప్టెంబర్ 2న ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయస్‌ఆర్ ఘాట్ వద్ద వైయస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. కార్యక్రమం అనంతరం వైయస్ జగన్ ఇడుపులపాయ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.