అనంతపురం: కరవు పీడిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని ముందుగానే హెచ్చరికలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని అన్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, కరవు పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. కరవు పరిస్థితులపై మంత్రులు, టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. పశువులకు గడ్డి, పశుగ్రాసం అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని, పశుగ్రాసం కోసం పశువులను కలెక్టర్ కార్యాలయానికి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుందా అని నిలదీశారు. తక్షణమే కరవు సహాయక చర్యలు చేపట్టి, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు.