కర్నూలులో జగన్‌ పర్యటనకు భారీ స్పందన

  ప్రతి కార్యకర్తకు పేరు పేరునా అభివందనాలు

కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్

కర్నూలు: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆయనను పరామర్శించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో గురువారం చేపట్టిన పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా కోడుమూరు నియోజకవర్గం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు, కోడుమూరు, బెలగల్, గూడూరు మండలాల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

 - జగన్‌ వెంట కదిలిన జనప్రవాహం

శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో సుమారు 38 కిలోమీటర్ల మేర జనప్రవాహం కొనసాగిందని వారు తెలిపారు. దాదాపు ఆరు గంటలపాటు ప్రజల మధ్య ఆయన కాన్వాయ్ ముందుకు సాగడం కర్నూలులో జగన్‌పై ఉన్న ప్రజాభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు.

  అడ్డంకులు పెట్టినా ఆగని అభిమానం

గురువారం ఉదయం నుంచే పోలీసులు మంత్రాలయం నుంచి కర్నూలు వరకు పలు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించేందుకు ప్రయత్నించినా, జగన్‌పై ఉన్న అభిమానంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజాభిమానాన్ని అడ్డుకోలేరని నిన్నటి పర్యటన మరోసారి నిరూపించిందన్నారు.

 - ఎమ్మెల్యే విరూపాక్షికి అండగా వైయ‌స్ఆర్‌సీపీ

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిపై దాడి జరగడం, అనంతరం ఆయనపైనే కేసులు నమోదు చేయడం, హత్యాయత్నం కేసు పెట్టడం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో విరూపాక్షికి, వైయ‌స్ఆర్‌సీపీకి అండగా కర్నూలు జిల్లా ప్రజలు నిలిచారని చెప్పారు. పోలీసులు, కేసులు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదని స్పష్టమైందన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి ప్రజలకు సేవ చేయడం ద్వారా వారి అభిమానాన్ని పొందాలని అధికార పార్టీకి సూచించారు.

- ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు

కర్నూలు, కోడుమూరు, బెలగల్, గూడూరు మండలాల నుంచి తరలివచ్చిన ప్రతి నాయకుడు, గ్రామస్థాయి కార్యకర్త, పార్టీ అభిమానికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పట్టుదలతో పనిచేసి వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.  ప్ర‌జల హక్కుల కోసం, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ స్పష్టం చేశారు. జగన్‌ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

కర్నూలులో శ్రీ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు చూపిన అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతే వైయ‌స్ఆర్‌సీపీకి బలమని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం నిరంతరం పోరాడుతామని వారు పేర్కొన్నారు.
 

Back to Top