తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశంలోనూ అవినీతి రాజ్యమేలుతోందని, మెగా డిఎస్సీ పేరుతో చేపట్టిన ప్రక్రియలో పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటా అవకతవకలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, యూత్ ఎంపవర్ మెంట్ సెల్ కన్వీనర్ సలాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఈ 'దగా డిఎస్సీ'పై రాష్ట్ర వ్యాప్తంగా యువత ఉద్యమిస్తున్న తరుణంలో, అలాగే రాబోయే శాసనసభ సమావేశాల్లో వైయస్సార్సీపీ వైపు నుంచి వచ్చే ప్రశ్నలను తట్టుకోలేకనే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 2018 గ్రూప్-1 నియామకాలపై 'సిట్' నివేదిక పేరుతో తమ పెంపుడు పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో విషప్రచారం చేస్తూ ప్రజలను, నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరమేమన్నారంటే... యనమల నాగార్జున యాదవ్ (వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి): రాష్ట్రంలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. డిఎస్సీ కుంభకోణంపై యువత రోడ్లెక్కి పోరాడుతుంటే, త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో వైయస్సార్సీపీ మండలిలో ఈ అంశంపై తమను నిలదీస్తుందనే భయంతో చంద్రబాబు ఒక పెద్ద కుట్రకు తెరలేపారు. 2018 గ్రూప్-1 నియామకాలపై తమ పెంపుడు పత్రికల ద్వారా అభూతకల్పనలతో వార్తలు రాయించి విషం చిమ్ముతున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యవహారంలో అవినీతికి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ధగా డీఎస్సీ నిర్వహించింది. స్పోర్ట్స్ కోటా నుంచి పేపర్ లీకేజీ వరకు డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రంలోని యువత మొత్తం వీధుల్లోకి వచ్చి పోరాడుతున్న పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపింది. 2018లో జరిగిన గ్రూప్-1 నియామకాల అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం డీఎస్సీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని యువత ఆశలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.డిజిటల్ మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఎవరు చెప్పారు? డిజిటల్ మూల్యాంకనం పద్ధతి: హైకోర్టు ఇచ్చిన తీర్పులో (జస్టిస్ సోమయాజులు గారి బెంచ్) డిజిటల్ ఎవల్యూషన్‌ను ఎక్కడా తప్పుపట్టలేదు. ఫ్యూచర్ ఎవల్యూషన్‌లో కూడా ఇలాంటి అడ్వాన్స్డ్ పద్ధతులు వాడుకోవచ్చని స్పష్టంగా పేర్కొంది. కేవలం నోటిఫికేషన్‌లో ముందస్తుగా పేర్కొనలేదు కాబట్టి ఇంటర్వ్యూలకు వెళ్లొద్దని మాత్రమే చెప్పింది. మరి నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం జరిగిందని ఎల్లో మీడియా ఎలా రాస్తుంది? సిట్ నివేదిక ప్రకారం హైలాండ్‌లో జరిగిన ప్రక్రియ కేవలం డిజిటల్ ఎవల్యూషన్‌లో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లలో బబ్లింగ్/మార్కింగ్ చేయడానికి మాత్రమే జరిగింది. జవాబు పత్రాలను ఎవరూ కదల్చలేదు, అక్కడ ఎలాంటి ఎగ్జామినర్లు లేరని సిట్ స్పష్టంగా చెప్పింది. జవాబు పత్రాలు సేఫ్: ఒరిజినల్ ఆన్సర్ స్క్రిప్ట్స్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు (ఆల్టరేషన్లు) జరగలేదని సిట్ విచారణలో తేలింది. వీటిని దేశంలోని 7 సీఎఫ్‌ఎస్ఎల్ (CFSL) సెంటర్లకు పంపగా, ఎక్కడా టాంపరింగ్ జరగలేదని నివేదికలిచ్చాయి. హ్యూమన్ ఎర్రర్స్ జరగకుండా ఉండేందుకు ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశల్లో పేపర్లను తనిఖీ చేస్తారు. టోటలింగ్ తప్పులు లేదా టెక్నికల్ పొరపాట్లను సరిదిద్దడానికి కరెక్షన్స్ చేయడం సర్వసాధారణం. ఇది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీతో సహా అన్ని రిక్రూట్‌మెంట్లలో జరిగే ప్రక్రియే. విచారణకు వచ్చిన ఎగ్జామినర్లు కూడా తామే ఆ కరెక్షన్స్ చేశామని, థర్డ్ పార్టీ ప్రమేయం లేదని సిట్ ముందు స్పష్టం చేశారు. కానీ డిఎస్సీలో జరిగిన దారుణమైన అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు నాయుడు ఈ విధంగా సిట్ నివేదికను వక్రీకరించి బట్టలన్నీ ఊడదీసుకునేలా వ్యవహరిస్తున్నారు. సలాంబాబు (వైయస్సార్సీపీ యూత్ ఎంపవర్ మెంట్ సెల్ కన్వీనర్): తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు నెలకు రెండుసార్లు ఢిల్లీ పర్యటనలు చేస్తూ, పచ్చ మీడియాతో ఎలివేషన్లు ఇప్పించుకుంటున్నారు. కానీ, డిఎస్సీ పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటాలో జీవోలు ఇచ్చి మరీ 450 ఉద్యోగాలు అమ్ముకున్న వ్యవహారాలు బయటపడటంతో లోకేష్ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడానికే చంద్రబాబు ఈ గ్రూప్-1 డైవర్షన్ డ్రామా ఆడతున్నారు. ప్రతిభావంతులైన అభ్యర్థులపై బురదజల్లే యత్నం: 2018 గ్రూప్-1కు ఎంపికైన 163 మంది అభ్యర్థులలో IIT, NIT, IIM, MBBS, BDS చదివిన అత్యంత ప్రతిభావంతులు ఉన్నారు. వీరిలో 39 మంది యూపీఎస్సీ (UPSC) ఇంటర్వ్యూల వరకు వెళ్లినవారు కాగా, 16 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్‌లకు ఎంపికయ్యారు. సీఎం చంద్రబాబు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఇంతటి ప్రతిభావంతులైన అభ్యర్థుల క్రెడిబిలిటీని రోడ్డుపై పడేయడం దారుణం. కరెక్షన్స్ మూల్యాంకన ప్రక్రియలో భాగమే.. జవాబు పత్రాల మూల్యాంకనంలో కరెక్షన్స్ చేయడం సాధారణ ప్రక్రియ. ఎగ్జామినర్ తర్వాత స్క్రూటినైజర్, చీఫ్ ఎగ్జామినర్ స్థాయిల్లో పరిశీలన జరుగుతుంది. మూల్యాంకనంలో పాల్గొన్న ఎగ్జామినర్లే సిట్‌కు కరెక్షన్స్ తామే చేశామని స్పష్టం చేసినా, వాటిని అక్రమాలుగా చిత్రీకరించడం సరికాదు. ఇంటర్వ్యూల్లో పూర్తి పారదర్శకత.. గ్రూప్-1 ఇంటర్వ్యూలకు మూడు బోర్డులు ఏర్పాటు చేసి, ప్రతి బోర్డులో ఇద్దరు ఏపీపీఎస్సీ సభ్యులు, ఇద్దరు సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఒక అకాడమిషియన్‌ను నియమించారు. 24 మంది సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. బోర్డు కేటాయింపులను లాటరీ విధానంలో చేయడంతో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంటర్వ్యూ మార్కింగ్ షీట్ల పరిశీలనలో నిర్దేశిత మార్కుల పరిధిలోనే గ్రేడింగ్ జరిగిందని, నిర్దేశిత గ్రేడింగ్ విధానం నుంచి ఎలాంటి వ్యత్యాసం గుర్తించలేదని సిట్ నివేదిక పేర్కొంది. అలాంటప్పుడు ఇంటర్వ్యూలపై అనుమానాలు రేకెత్తించడం ఎందుకు? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మూల్యాంకన కేంద్రాలు, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పరీక్షల్లో ఇంపర్సనేషన్‌ను అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంటర్వ్యూ మార్కుల్లో నిర్దేశిత గ్రేడింగ్ విధానం లో ఎలాంటి వ్యత్యాసం గుర్తించలేదని సిట్ నివేదికే చెబుతోంది. డీఎస్సీ నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం.. డీఎస్సీ అక్రమాలు, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా వ్యవహారాలపై నిరుద్యోగ యువత పోరాడుతున్న సమయంలో గ్రూప్-1 అంశాన్ని తెరపైకి తీసుకురావడం డైవర్షన్ రాజకీయాల్లో భాగమే. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో జరగని విషయాలను జరిగినట్టుగా చూపించే ప్రయత్నాన్ని త్వరలో పూర్తి ఆధారాలతో ప్రజల ముందు పెడతాం. చంద్రబాబు నైతికత ఏమైంది?: వైకాపా హయాంలో అక్రమాలు జరిగాయని ప్రచారం చేసిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే అదే 2018 గ్రూప్-1 అభ్యర్థిని కుప్పం డెవలప్‌మెంట్ అథారిటీలో ఎందుకు నియమించుకున్నారు? నీవు నియమించుకుంటే సరైనది, ఇతరులు చేస్తే అక్రమమా? పారదర్శకంగా నియామకాలు... వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ అత్యంత పారదర్శకంగా వ్యవహరించింది. జంబ్లింగ్ సిస్టమ్ ద్వారా లాటరీ పద్ధతిలో బోర్డులను కేటాయించాం. కోర్టు అడగకపోయినా ఇంటర్వ్యూల గురించి ప్రస్తావిస్తూ ఐఏఎస్ ఆఫీసర్ల నిజాయితీని శంకించడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం ఎంత కుట్ర చేసినా డిఎస్సీ బాధితుల తరఫున వైయస్సార్సీపీ పోరాడుతుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో ప్రభుత్వ అవినీతిని, నాటకాలను ఖచ్చితంగా బట్టబయలు చేస్తాం.