ఫోర్జ‌రీ స‌ర్టిఫికెట్ల‌తో కార్య‌క‌ర్త‌ల‌కు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు

డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

నైతిక బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలి

వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీల డిమాండ్

అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మీడియాతో మాట్లాడిన వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీలు 

డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం భయపడి పారిపోతోంది

సమాధానం చెప్పలేక వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తోంది  

26 రోజుల్లోనే 447 జీవోను ఎందుకు రద్దు చేశారు?

పీవీ సింధు ఉద్యోగంతో డీఎస్సీ అక్రమాలను పోల్చడం సిగ్గుచేటు

నారా లోకేష్ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాడు 

వెన్నుపోటు కూటమి పాల‌న‌లో 6 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్స్

వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల తీవ్ర ఆగ్ర‌హం 

అసెంబ్లీ మీడియా పాయింట్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమాలపై శాసనమండలిలో చర్చకు పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేక ప్రభుత్వం వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ పారిపోతోందని ఎద్దేవా చేశారు. డీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, స్పోర్ట్స్ అసోసియేషన్ల నకిలీ సర్టిఫికెట్లతో తమ పార్టీ కార్యకర్తలకు అడ్డదారిలో ఉద్యోగాలు కట్టబెట్టారని వారు ఆరోపించారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా ఐడీ బ్లాక్ చేసి, అతని ద్వారా పేపర్ లీక్ చేశారని విమర్శించారు. కేవలం 26 రోజుల్లోనే 447 జీవోను ఎందుకు రద్దు చేశారని, ఈ కుంభకోణంపై పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారు స్పష్టం చేశారు. అలాగే ఒలింపిక్ విజేత పీవీ సింధు ఉద్యోగంతో, ఈ అక్రమ నియామకాలను పోల్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, అమ్మఒడి, విద్యాకానుక, మధ్యాహ్న భోజన పథకాలను నీరుగార్చడం వల్ల ఆరు లక్షల మంది విద్యార్థులు బడులకు దూరమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు నూరుశాతం రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ 3ను పునరుద్ధరించకపోతే 32 లక్షల మంది గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 

ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే...

డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి 
- ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

డీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు, కానీ తమ పార్టీ కార్యకర్తలకు మాత్రం ఈ కోటాలో ఉద్యోగాలు కట్టబెట్టారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ కుంభకోణంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.

మా వ‌ద్ద ప‌క్కా ఆధారాలున్నాయి
- పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

సుమారు 5 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం భయపడి పారిపోతోంది. డాక్టర్, టీచర్ ఉద్యోగాలను ఏ పరీక్షలు లేకుండా ఇష్టమొచ్చినట్లు కార్యకర్తలకు పంచుతామంటే చూస్తూ ఊరుకోం. నవీన్ అనే వ్యక్తి ద్వారా డీఎస్సీ పేపర్ లీక్ అయి అనేక కోచింగ్ సెంటర్లకు చేరింది, దీనిపై కచ్చితంగా విచారణ జరగాలి. ఉద్యోగాల కోసం 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్న వాట్సాప్ ఆడియోలపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదు? పక్కా ఆధారాలు మా వద్ద ఉన్నాయి, సీబీఐ ఎంక్వైరీ జరిగే వరకూ మా పోరాటం ఆగదు. 

26 రోజుల్లోనే 447 జీవోను ఎందుకు రద్దు చేశారు?
- ఎమ్మెల్సీ ఇసాక్ బాషా

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని మేం పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం వాయిదా తీర్మానాలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తోంది. కేవలం 26 రోజుల్లోనే 447 జీవోను ఎందుకు రద్దు చేశారు? ఇది స్కామ్ కాదా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ వస్తే, కావాలనే ఐడీ బ్లాక్ చేసి ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారు. స్పోర్ట్స్ కోటా ముసుగులో ఎంతమంది నిరుద్యోగుల పొట్టకొట్టారు? విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ కౌన్సిల్, అసెంబ్లీలను స్తంభింపజేసి తీరుతాం.

పీవీ సింధు ఉద్యోగంతో పోల్చ‌డం సిగ్గుచేటు
- ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

ప్రతిపక్షం ఉన్న శాసనమండలిలో చర్చకు అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్షం లేని అసెంబ్లీలో మంత్రి లోకేష్ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్ జగన్ గారికి గనుక ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, ఈ కుంభకోణంపై సభలో మీకు చుక్కలు చూపిస్తారు. ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు ఇచ్చిన ఉద్యోగంతో, ఈ డీఎస్సీ అక్రమ నియామకాలను పోల్చడం సిగ్గుచేటు. బేరసారాల ఆడియో, వీడియోలపై కేసులు పెట్టామంటేనే, ఉద్యోగాలు అమ్ముకున్నారన్న వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. సీబీఐ విచారణ ద్వారానే అసలు నిజాలు బయటపడతాయి, విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. ఇక మా పార్టీ నాయకులపై గంజాయి ఆరోపణలు చేస్తున్న కూటమి నేతలు, అద్దంకిలో ఇద్దరు ఎస్సైలు గంజాయితో పట్టుబడిన వాస్తవాన్ని ఎందుకు దాస్తున్నారు? ఈ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణ వేయాలి.

జీవో నెంబ‌ర్ 3పై చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు
- కుంభా రవిబాబు

శాసనమండలిలో గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుల ఉద్యోగాలన్నీ నూరు శాతం గిరిజనులకే ఇచ్చే 'జీవో నెంబర్ 3'పై చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకుండా కూటమి నేతలు గిరిజన బిడ్డలను మోసం చేస్తున్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లేదా ఆర్టికల్ 371(డి)ని సవరించి ఈ జీవోను పునరుద్ధరించాలని మేం పదేపదే డిమాండ్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంబిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే, రాష్ట్రంలోని 32 లక్షల మంది గిరిజన బిడ్డల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం.

న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌కు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు
- సిపాయి సుబ్రహ్మణ్యం

డీఎస్సీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 3 శాతం ఉద్యోగాలను ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారో ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పడం లేదు. స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ల ఫోర్జరీ సంతకాలతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి తమ అనుయాయులకు బ్యాక్ డోర్ ద్వారా 438 ఉద్యోగాలు కట్టబెట్టిన వ్యవహారంపై లోకేశ్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి, తక్షణమే సీబీఐ విచారణ వేయాలి, అక్రమాలకు పాల్పడిన మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15 గంటలు పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమస్యలపై సమ్మె చేస్తే, కేవలం 3 శాతం పెంపు ఇచ్చి ప్రభుత్వం వారిని అవమానించింది. 

విద్యావ్యవస్థ పూర్తిగా గాడితప్పింది
- కల్పలతారెడ్డి

వెన్నుపోటు కూట‌మి పాల‌న‌లో విద్యావ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కనీస నాణ్యత లేదు, అలాగే ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడి, విద్యాకానుక వంటి పథకాలను నిలిపివేసి పేద విద్యార్థులను రోడ్డున పడేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్స్ కావడం ఈ విద్యాశాఖ వైఫల్యానికి సజీవ సాక్ష్యం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్లు ఖర్చు చేసి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులను బాగు చేస్తే, నేడు వాటన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. సాలూరులో పాఠశాల ప్రహరీ కూలి ఓ విద్యార్థి చనిపోవడమే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.

స‌మ‌స్య‌లు ప‌రిష్కరించే ధోర‌ణిలో ప్ర‌భుత్వం లేదు
- పాలవలస విక్రాంత్

రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 'ఎల్‌నినో' ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణత, డీఎస్సీ అక్రమాల ద్వారా యువతకు జరిగిన అన్యాయం తదితర ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేం శాసనమండలిలో ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకుండా దాటవేత ధోరణితో వ్యవహరించడం మానుకోవాలి.

Back to Top