‘శాప్‌’ సర్టిఫికెట్లతో కార్యకర్తలకు ఉద్యోగాలు

డీఎస్సీ–2025 పేపర్‌ లీక్‌ అయింది

అందుకే డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి

మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

:వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీల డిమాండ్‌

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 

డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం భయపడి పారిపోతోంది

సమాధానం చెప్పలేక వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తోంది  

26 రోజుల్లోనే 447 జీవోను ఎందుకు రద్దు చేశారు?

:సూటిగా ప్రశ్నించిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు

పీవీ సింధు ఉద్యోగంతో డీఎస్సీ అక్రమాలను పోల్చడం సిగ్గుచేటు

నారా లోకేష్‌ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాడు 

వెన్నుపోటు కూటమి పాలనలో 6 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్స్‌

:వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఫైర్‌

అసెంబ్లీ మీడియా పాయింట్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు.
    డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో చర్చకు పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేక ప్రభుత్వం వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ పారిపోతోందని ఎద్దేవా చేశారు. డీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, కేవలం స్పోర్ట్స్‌ అసోసియేషన్ల సర్టిఫికెట్లతో తమ పార్టీ కార్యకర్తలకు అడ్డదారిలో ఉద్యోగాలు కట్టబెట్టారని ఇంకా డీఎస్సీ–2025 పేపర్‌ కూడా లీక్‌ అయిందని వారు ఆరోపించారు.
    ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన నవీన్‌ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా ఐడీ బ్లాక్‌ చేసి, అతని ద్వారా పేపర్‌ లీక్‌ చేశారని గుర్తు చేశారు. కేవలం 26 రోజుల్లోనే 447 జీవోను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించిన వారు, ఈ కుంభకోణంపై పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే ఒలింపిక్‌ విజేత పీవీ సింధు ఉద్యోగంతో, ఈ అక్రమ నియామకాలను పోల్చడం సిగ్గుచేటని మండిపడ్డారు.
    వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, అమ్మఒడి, విద్యాకానుక, మధ్యాహ్న భోజన పథకాలను నీరుగార్చడం వల్ల ఆరు లక్షల మంది విద్యార్థులు బడులకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు నూరుశాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో నెం:3 ను పునరుద్ధరించకపోతే 32 లక్షల మంది గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇంకా ప్రెస్‌మీట్‌లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:

డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి 
:లేళ్ల అప్పిరెడ్డి. ఎమ్మెల్సీ.

– డీఎస్సీ నియామకాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పరీక్ష లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు, కానీ తమ పార్టీ కార్యకర్తలకు మాత్రం ఈ కోటాలో ఉద్యోగాలు కట్టబెట్టారు. ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ కుంభకోణంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి లోకేష్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి.

మా వద్ద పక్కా ఆధారాలున్నాయి
:పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి. ఎమ్మెల్సీ.

– సుమారు 5 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న డీఎస్సీ అక్రమాలపై చర్చకు ప్రభుత్వం భయపడి పారిపోతోంది. డాక్టర్, టీచర్‌ ఉద్యోగాలను ఏ పరీక్షలు లేకుండా ఇష్టమొచ్చినట్లు కార్యకర్తలకు పంచుతామంటే చూస్తూ ఊరుకోం. నవీన్‌ అనే వ్యక్తి ద్వారా డీఎస్సీ పేపర్‌ లీక్‌ అయి అనేక కోచింగ్‌ సెంటర్లకు చేరింది, దీనిపై కచ్చితంగా విచారణ జరగాలి. ఉద్యోగాల కోసం 15 లక్షల రూపాయలు డిమాండ్‌ చేస్తున్న వాట్సాప్‌ ఆడియోలపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదు? పక్కా ఆధారాలు మా వద్ద ఉన్నాయి, సీబీఐ ఎంక్వైరీ జరిగే వరకూ మా పోరాటం ఆగదు. 

26 రోజుల్లోనే 447 జీవోను ఎందుకు రద్దు చేశారు?
:ఇషాక్‌ బాషా. ఎమ్మెల్సీ.

– డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని మేం పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం వాయిదా తీర్మానాలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తోంది. కేవలం 26 రోజుల్లోనే 447 జీవోను ఎందుకు రద్దు చేశారు? ఇది స్కామ్‌ కాదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తే, కావాలనే ఐడీ బ్లాక్‌ చేసి ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారు. స్పోర్ట్స్‌ కోటా ముసుగులో ఎంతమంది నిరుద్యోగుల పొట్టకొట్టారు? విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ కౌన్సిల్, అసెంబ్లీలను స్తంభింపజేసి తీరుతాం.

పీవీ సింధు ఉద్యోగంతో పోల్చడం సిగ్గుచేటు
:వరుదు కళ్యాణి. ఎమ్మెల్సీ.

– ప్రతిపక్షం ఉన్న శాసనమండలిలో చర్చకు అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్షం లేని అసెంబ్లీలో మంత్రి లోకేష్‌ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌ గారికి గనుక ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, ఈ కుంభకోణంపై సభలో మీకు చుక్కలు చూపిస్తారు. ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుకు ఇచ్చిన ఉద్యోగంతో, ఈ డీఎస్సీ అక్రమ నియామకాలను పోల్చడం సిగ్గుచేటు. బేరసారాల ఆడియో, వీడియోలపై కేసులు పెట్టామంటేనే, ఉద్యోగాలు అమ్ముకున్నారన్న వాస్తవాన్ని ప్రభుత్వం అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. సీబీఐ విచారణ ద్వారానే అసలు నిజాలు బయటపడతాయి, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలి. ఇక మా పార్టీ నాయకులపై గంజాయి ఆరోపణలు చేస్తున్న కూటమి నేతలు, అద్దంకిలో ఇద్దరు ఎస్సైలు గంజాయితో పట్టుబడిన వాస్తవాన్ని ఎందుకు దాస్తున్నారు? ఈ స్కామ్‌పై తక్షణమే సీబీఐ విచారణ వేయాలి.

జీవో నెంబర్‌ 3పై చర్చకు అవకాశం ఇవ్వలేదు.
:కుంభా రవిబాబు. ఎమ్మెల్సీ.

– గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుల ఉద్యోగాలన్నీ నూరు శాతం గిరిజనులకే ఇచ్చే ’జీవో నెంబర్‌ 3’పై మండలిలో చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకుండా కూటమి నేతలు గిరిజన బిడ్డలను మోసం చేస్తున్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ లేదా ఆర్టికల్‌ 371(డి)ని సవరించి ఈ జీవోను పునరుద్ధరించాలని మేం పదేపదే డిమాండ్‌ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంబిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే, రాష్ట్రంలోని 32 లక్షల మంది గిరిజన బిడ్డల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం.

‘శాప్‌’ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు
:సిపాయి సుబ్రహ్మణ్యం. ఎమ్మెల్సీ.

– డీఎస్సీ ద్వారా స్పోర్ట్స్‌ కోటాలో ఇచ్చిన 3 శాతం ఉద్యోగాలను ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారో ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పడం లేదు. స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్లు ఇచ్చిన సర్టిఫికెట్స్‌తో తమ అనుయాయులకు బ్యాక్‌ డోర్‌ ద్వారా ఉద్యోగాలు కట్టబెట్టిన వ్యవహారంపై లోకేశ్‌ సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి, తక్షణమే సీబీఐ విచారణ వేయాలి, అక్రమాలకు పాల్పడిన మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15 గంటలు పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్లు తమ సమస్యలపై సమ్మె చేస్తే, కేవలం 3 శాతం పెంపు ఇచ్చి ప్రభుత్వం వారిని అవమానించింది. 

విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది.
:కల్పలతారెడ్డి. ఎమ్మెల్సీ.

– వెన్నుపోటు కూటమి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కనీస నాణ్యత లేదు, అలాగే ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడి, విద్యాకానుక వంటి పథకాలను నిలిపివేసి పేద విద్యార్థులను రోడ్డున పడేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్స్‌ కావడం ఈ విద్యాశాఖ వైఫల్యానికి సజీవ సాక్ష్యం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్లు ఖర్చు చేసి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడులను బాగు చేస్తే, నేడు వాటన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. సాలూరులో పాఠశాల ప్రహరీ కూలి ఓ విద్యార్థి చనిపోవడమే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.

సమస్యలు పరిష్కరించే ధోరణిలో ప్రభుత్వం లేదు
:పాలవలస విక్రాంత్‌. ఎమ్మెల్సీ.

– రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ’ఎల్‌నినో’ ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణత, డీఎస్సీ అక్రమాల ద్వారా యువతకు జరిగిన అన్యాయం తదితర ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేం శాసనమండలిలో ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకుండా దాటవేత ధోరణితో వ్యవహరించడం మానుకోవాలి. 

నిజాయితీపరులైతే మండలిలో చర్చించాలి  
:తోట త్రిమూర్తులు. ఎమ్మెల్సీ

– డీఎస్సీపై కౌన్సిల్‌లో చర్చ జరగాలని మేం నిన్నటి నుంచి పట్టుబడుతుంటే, సమాధానం చెప్పలేక ప్రభుత్వం వెనక్కి తగ్గుతోంది. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో మాత్రం వాళ్లు అబద్ధాలు చెప్తూ డబ్బా కొట్టుకుంటున్నారు. డీఎస్సీ అక్రమాలపై అడగడానికి మేం ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నాం, మీరు నిజంగా నిజాయితీపరులైతే ఇక్కడకు వచ్చి చర్చకు సమాధానం చెప్పాలి కదా? ఒకేసారి 15, 20 లక్షల రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారని వాట్సాప్‌ ఆడియోలు బయటకు వచ్చినా చర్యలు లేవు, కానీ ఎన్నికలప్పుడు మాత్రం డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులందరికీ నెలనెలా 3 వేల నిరుద్యోగ భతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. మీ తప్పులన్నీ బయటపడతాయనే భయంతోనే కౌన్సిల్‌ సమావేశాలను ఆరు నెలలకోసారి నిర్వహిస్తున్నారు, దీన్ని బట్టే మీ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతోంది.

కౌన్సిల్‌లో లోకేష్‌ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
:మొండితోక అరుణ్‌కుమార్‌. ఎమ్మెల్సీ.

– డీఎస్సీ నియామకాల్లో, స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అక్రమాలకు సంబంధించి మేం కౌన్సిల్‌లో ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరించడం దారుణం. అసెంబ్లీలో నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పిన మంత్రి లోకేష్, కౌన్సిల్‌కు వచ్చి సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతున్నారు? పేపర్‌ లీక్‌ చేసిన ఈయన లోకేష్‌ కాదు ‘లీకేష్‌’. స్పోర్ట్స్‌ కోటా కింద, కేవలం శాప్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చి, వాటిని అమ్ముకున్నారు. ఇంకా పీవీ సింధుకు ఇచ్చిన ఉద్యోగంతో, ఈ అక్రమ నియామకాలను పోల్చడం సిగ్గుచేటు. డీఎస్సీ అక్రమాలతో పాటు ఈ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌ కళ్యాణ్, ఆయన పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలి.

Back to Top