వెలిగొండ నిర్వాసితులకు ముందుగా న్యాయం.. ఆ తర్వాతే తరలింపు

తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్యే నాగార్జున‌రెడ్డి
 

వెలిగొండ: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన లక్ష్మీపురంలో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే తరలింపు ప్రక్రియ చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే నాగార్జున‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం స్థానిక రైతులు, పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి వెలిగొండ ప్రాజెక్ట్‌ను సంద‌ర్శించారు. ఆయ‌న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నిర్వాసితుల కటాఫ్‌ తేదీని 2026 వరకు పొడిగించాలని, అప్పటివరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. గత ఏడేళ్లలో కొత్తగా ఏర్పడిన 30 నుంచి 35 కుటుంబాలకు కూడా నివాస స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మిగిలి ఉన్న స్థలాన్ని అర్హులకు పంచాలని, అవసరమైతే సమీప భూముల్లో కొత్త ప్లాట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

 పంట చేతికొచ్చే వరకు గడువు ఇవ్వాలి

లక్ష్మీపురం పరిధిలో సుమారు 350 నుంచి 400 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. పంటల కోసం లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులను పంట చేతికొచ్చే సమయంలో ఖాళీ చేయిస్తే తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 4 నుంచి 5 నెలల గడువు ఇచ్చి పంటలను పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. చాలా కుటుంబాలు మూడు, నాలుగు గేదెల నుంచి 20–30 పశువుల వరకు పెంచుకుంటూ జీవిస్తున్నాయని తెలిపారు. పశువులను ఒక్కసారిగా తరలించడం సాధ్యం కాదని, పాడి రైతులకు ప్రత్యేక సమయం ఇవ్వడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో పశువుల షెడ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అసైన్డ్‌, చుక్కల భూములకు సంబంధించి రైతులకు న్యాయం చేయాలని, సుమారు 600 ఎకరాల భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నిర్వాసితులను కేవలం ఖాళీ చేయించడం కాకుండా వారి పిల్లలు, కొత్త కుటుంబాలు, రైతులు, పాడి రైతుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
వెలిగొండ ప్రాజెక్టు అభివృద్ధితో పాటు దాని కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవితాలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, ముందుగా వారి సమస్యలను పరిష్కరించి ఆ తర్వాతే తరలింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 

Back to Top