పోలీసు వాహనంలోనే గంజాయి..

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో వ్యవస్థల పతనానికి పరాకాష్ట

వంగవీటి నరేంద్ర ఫైర్

పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర

ప్రకాశం జిల్లాలో పోలీసు వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు

100 రోజుల్లో గంజాయి నిర్మూలన మాటలు ఏమయ్యాయి?

డ్రోన్లతో గంజాయి నియంత్రణ ఎక్కడ?

24 గంటల తర్వాత ఎస్పీ వివరణ ఎందుకు?

గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత స్వాధీనం చేసుకున్నారు?

పోలీసు వ్యవస్థను రెడ్‌బుక్ అమలుకు వాడొద్దు

వైయ‌స్సార్‌సీపీ హయాంలో ఎస్‌ఈబీతో గంజాయిపై ఉక్కుపాదం

గంజాయి నియంత్రణకు 14500 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు

ప్రకాశం ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలి

ప్రెస్‌మీట్‌లో వంగవీటి నరేంద్ర డిమాండ్

తాడేపల్లి: పోలీసులే గంజాయి, మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు బయటపడిన ఘటన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని మండిపడ్డారు. గంజాయిని 100 రోజుల్లో నిర్మూలిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్‌, అనిత.. ఇప్పుడు పోలీసు వాహనంలోనే గంజాయి బయటపడటంపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.

ప్రెస్‌మీట్‌లో వంగవీటి నరేంద్ర ఏమన్నారంటే..

- గంజాయి నియంత్రణపై కూటమి మాటలు ఏమయ్యాయి?

“2024 ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్‌, అనిత గంజాయిపై ఎన్నో మాటలు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక డ్రోన్లతో గంజాయి సాగును గుర్తించి అరికట్టామని, రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చామని ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో గంజాయి, మద్యం, ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అందుతున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు ఘటన దీనికి తాజా ఉదాహరణ. గంజాయి, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసుల వాహనంలోనే అవి బయటపడటం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం”.

- ప్రకాశం ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

“ప్రైవేట్ వాహనంలో ఇద్దరు పోలీసు అధికారులు ఉండటం, వెనుక డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు, పోలీసు దుస్తులు కనిపించడం, ప్రమాదం తర్వాత ప్రజలు వీడియో తీసి ఈ విషయం బయటకు తీసుకురావడం జరిగింది. ఆ ఘటనపై 24 గంటల తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ వివరణ ఇచ్చారు. నిజంగా పోలీసులు గంజాయిని ఒకచోట రికవరీ చేసి తీసుకెళ్తుంటే.. రికవరీ ఎక్కడ జరిగింది? ఎంత పరిమాణంలో స్వాధీనం చేసుకున్నారు? పోలీసు అధికారులు సివిల్‌ డ్రెస్సుల్లో ఎందుకు ఉన్నారు? ఫిర్యాదు ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలను ప్రజలకు చెప్పాలి. ప్రజలు నిలదీసిన సమయంలో ఆ విషయాలు చెప్పకుండా 24 గంటల తర్వాత ఎస్పీ వివరణ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి తప్పు చేసిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి. ఘటనను వీడియో తీసిన ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు”.

- గంజాయి నియంత్రణలో వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వ చర్యలు

“వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేసి గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకున్నాం. ‘ఆపరేషన్‌ పరివర్తన’ ద్వారా గంజాయి సాగుదారులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించి, వారి జీవనోపాధిలో మార్పు తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. 2021 సెప్టెంబరు నాటికి 220 కేసులు నమోదు చేసి 384 మందిని అరెస్టు చేసి, 18,686 కిలోలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 2020 నుంచి 2022 మధ్య రెండు లక్షల కిలోల గంజాయి పొడిని ధ్వంసం చేశాం. రూ.500 కోట్ల విలువైన గంజాయి, రూ.9,500 కోట్ల విలువైన గంజాయి పంటను పోలీసులు దగ్గరుండి ధ్వంసం చేశారు. గంజాయి సాగు, వ్యాపారం, అక్రమ రవాణాపై సమాచారం కోసం 14500 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. ఇన్ని చర్యలు చేపట్టిన వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థనే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఉపయోగించడం సిగ్గుచేటు. పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి కాకుండా అంబేద్కర్‌ రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వర్తించాలి. లేదంటే భవిష్యత్తులో ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది” అని వంగవీటి నరేంద్ర హెచ్చరించారు.  

Back to Top