అసెంబ్లీ మీడియా పాయింట్: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై చర్చించేందుకు వైయస్ఆర్‌సీపీ తరఫున పట్టుబడితే రెండో రోజు కూడా ప్రభుత్వం భయపడి పారిపోయిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ దాటవేత ధోరణిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పత్రికల్లో 'మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం' అని గొప్పలు చెప్పడం తప్ప, వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా డీఎస్సీ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని బొత్స ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 3 శాతం స్పోర్ట్స్ కోటా ఇస్తూ ఇచ్చిన జీవోకు అసలు చట్టబద్ధత ఉందా? దాన్ని కేబినెట్‌లో గానీ, అసెంబ్లీలో గానీ పెట్టారా? అని నిలదీశారు. ఒకసారి మంత్రి సంతకంతో జీవో ఇవ్వడం, మళ్లీ ఆయనే దాన్ని రద్దు చేసి పాత జీవోకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. దీనివల్ల స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 438 మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. గ్రూప్-1పైనా విచారణకు మేం సిద్ధం డీఎస్సీలో ఎలాంటి పేపర్ లీకేజీ జరగకపోతే, ప్రభుత్వం ఇంతవరకు మెరిట్ లిస్ట్‌ను ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం సెల్‌ఫోన్లలో బేరసారాలు ఆడిన వీడియోలు, ఆడియోలు బహిర్గతమైనా వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై పక్కా ఆధారాలతో తాము నిలదీస్తున్నా.. శాసనసభలో ఏవో మాటలు చెప్పడం తప్ప మండలిలో సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ ఎంక్వైరీ వేయాలని, అప్పటివరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో తప్పులు జరిగాయని ఆరోపిస్తున్న వారు, దానిపైనా సీబీఐ విచారణ వేసుకోవచ్చని.. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని బొత్స సవాల్ విసిరారు. రైతు సమస్యల పట్ల చిత్తశుద్ధి కరువు రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రజా సమస్యలపై బీఏసీలో చర్చించాలని, అవసరమైతే అసెంబ్లీని మరో రెండు మూడు రోజులు పొడిగించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వ్యవసాయం అన్నా, రైతులన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో పూర్తిస్థాయి చర్చ జరిగేంత వరకు వైయస్ఆర్‌సీపీ తరఫున తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.