డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి :

అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి:

శాసన మండలి విపక్ష నేత  బొత్స సత్యనారాయణ డిమాండ్

విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనర్శయ్య నివాసంలో మీడియాతో మాట్లాడిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

విద్యార్ధులు, వైఎస్సార్సీపీ ర్యాలీలపై అణచివేత సరికాదు.

అక్రమాలపై సమాధానం చెప్పలేక అధికారుల మార్పుతో కాలయాపన

డిఎస్సీ అక్రమాల్లో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు వచ్చినా చర్యలెక్కడ

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన బొత్స సత్యనారాయణ

విజయనగరం: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ వేసి మంత్రి తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనర్శయ్య నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలను ప్రభుత్వం పోలీసు బలగాలతో అడ్డుకోవడం, నాయకులను గృహనిర్బంధాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలకు దిగినా, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలు స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు, యువతతో అత్యంత విజయవంతమయ్యాయని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఆయన ఇంకా ఏమన్నారంటే..

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు – సీబీఐ విచారణ జరపాలి..

గత 74 రోజులుగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో జరిగిన లీకేజీలు, స్పోర్ట్స్ కోటా జీవోల మార్పులపై మేం పోరాటం చేస్తున్నాం. ఉన్న పాత జీవోలను మార్చి, కొత్త జీవోలు ఇచ్చి మెరిట్ లేకుండా, అసోసియేషన్ల అధ్యక్షులు ఇచ్చిన సర్టిఫికెట్లతో పరీక్ష రాయకుండా డైరెక్ట్‌గా ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు? ఈ వ్యవహారంపై నిజాయితీ ఉంటే ప్రభుత్వం థర్డ్ పార్టీ ఎంక్వయిరీ లేదా సీబీఐ విచారణ వేయాలి. అంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను పక్కన పెట్టాలి, ఆయన రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలి.

ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి ఏవి?

విద్యార్థులకు అందాల్సిన రూ. 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కాలేజీల నుంచి అవుట్‌గోయింగ్ విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక వారి భవిష్యత్తు నాశనమవుతోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగాలైనా ఇవ్వండి, లేకపోతే రూ. 3,000 నిరుద్యోగ భృతి అయినా చెల్లించండి. ఏ ఒక్క జిల్లాలోనైనా ఎంతమందికి ఉపాధి కల్పించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా?

ప్రజాస్వామ్య హక్కులపై దాడి..

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ నిరసన శిబిరాలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? విజయవాడ, చిలకలూరిపేట, పులివెందుల ఇలా రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్బంధాలు, అరెస్టులు, లాఠీచార్జీలతో పరిపాలన సాగిస్తున్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి, గతంలో ఆడపిల్లలకు అండగా ఉన్న దిశా చట్టం వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

సంపద సృష్టి అంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమేనా?

రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సభలో మాట్లాడుతూ రెండున్నరేళ్లలో సంక్షేమం కోసం సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని అంటున్నారు. చంద్రబాబు గారూ... మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, రాబోయే తరాలకు అప్పులు మిగుల్చుతున్నారు. ఇదేనా మీరు చెప్పిన సంపద సృష్టి?

దేశంలో ఏ ఒక్క అభివృద్ధి పారామీటర్‌లో అయినా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పగలరా? సంక్షేమాన్ని పక్కన పెడితే విద్య, వైద్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆరోగ్య రంగానికి బకాయిలు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. రైతులకు ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? రైతు కూలీలు, విద్యార్థులు, సామాన్య కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఓటు వేసినందుకు ఐదేళ్లు ప్రజలు బాధపడాల్సిన పరిస్థితి రాకూడదు. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థం, ఆర్జన కోసమే పనిచేస్తోందన్న భావన ప్రజల్లో బలపడుతోంది. ప్రతి సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం వెంటనే తన విధానాలను మార్చుకోవాలి.
సంపద సృష్టి కాదు... అప్పుల పాలు..

రెండు సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. మరి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత వడ్డీ రుణాలు నిలిచిపోయాయి. శానిటేషన్ లేక వీధులు కంపు కొడుతున్నాయి. ఈ ప్రభుత్వం ప్రజల కోసం కాక స్వార్థం, అమరావతి, అవినీతి కోసమే పనిచేస్తోంది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాల్సిందే.

శాంతిభద్రతలు ఎక్కడున్నాయి?

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గతంలో ఆడపిల్లలకు దిశా చట్టం అండగా ఉండేది. ఆపద వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ భరోసా కనిపించడం లేదు. ఇలాంటి పరిపాలన చాలా దురదృష్టకరం. గతంలో ఆడపిల్లలకు దిశా చట్టం, పోలీసుల తక్షణ స్పందన ఒక భరోసాగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శానిటేషన్ లేక వీధులు కంపుకొడుతున్నా పర్యవేక్షణ లేదు. సున్నా వడ్డీ పథకం ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం లేదు. అమరావతి, అవినీతి తప్ప ప్రభుత్వం వద్ద మరో కార్యక్రమం కనిపించడం లేదు.

రాజీనామా చేసి... నిజాయితీ నిరూపించుకోవాలి..

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా? ధర్నాలు, ర్యాలీలు చేసే హక్కు లేదా? ప్రభుత్వం, పోలీసులు ఏ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందని నిరసన శిబిరాలను పీకేస్తున్నారు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? పోలీసులతోనే ప్రభుత్వాన్ని పరిపాలించాలనుకుంటున్నారా?

ర్యాలీలకు వెళ్లకుండా గృహనిర్బంధాలు, అరెస్టులు, అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాం. ఎక్కడా పరుష పదాలు ఉపయోగించకుండా మా నిరసనను, ప్రజా ఆగ్రహాన్ని రాష్ట్రానికి చూపించాం. పులివెందులలో లాఠీచార్జి చేయడం, విజయవాడ, చిలకలూరిపేటతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్బంధాలు, అరెస్టులు చేయడం ఇదేనా పరిపాలన?

74 రోజులుగా డీఎస్సీ అవకతవకలపై పోరాడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించాలి. సీబీఐ విచారణకు కూడా సిద్ధపడాలి. నిజాయితీ ఉంటే సంబంధిత మంత్రి రాజీనామా చేసి తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాలి. ప్రజలకు అనుమానాలు వచ్చినప్పుడు వాస్తవాలను రుజువులతో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎన్ని అడ్డంకులు, అరెస్టులు, లాఠీచార్జిలు చేసినా విద్యార్థులు, ఉద్యోగులు, కార్యకర్తలు కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. అందుకే మేము మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. సీబీఐ నివేదిక వచ్చే వరకు సంబంధిత మంత్రిని పక్కన పెట్టాలి. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకోవాలి. తక్షణమే విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలి.

మరోవైపు ప్రభుత్వం  విద్యార్థులకు బకాయిలు పడ్డ రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయడంతో పాటు... ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని లేదా  నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఒకవైపు వేల, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని..   ఏ  జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలన్నారు.

Back to Top