ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలి

తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నిరసన
 
భూ ఆక్రమణలపై విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని డిమాండ్

తిరుపతి : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు "బూతులు మాట్లాడుతున్న ఎమ్మెల్యే మాకు వద్దు", "పులివర్తి నానిని అరెస్ట్ చేయాలి", "చిత్తూరు రౌడీయిజం తిరుపతిలో వద్దు" అంటూ నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఉన్న భూ ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నారనే అహంకారంతో ఎవరూ చట్టానికి అతీతులు కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు సిద్ధమయ్యారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. 

Back to Top