గుంటూరు: గత నెల 27న అమరావతి రైతుల కోరిక మేరకు పెనుమాకకు పరామర్శకు వెళ్తున్న తమపై టీడీపీ గూండాలు దాడులు చేసినా ఇప్పటివరకూ ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. తమపై వాళ్లు కేసులు పెడితే మాత్రం ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు (డైమండ్ బాబు), గుంటూరు ఈస్ట్ ఇన్ ఛార్జ్ నూరీ ఫాతిమా మండిపడ్డారు. ఉండవల్లి సమీపంలో తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఇవాళ గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన నాయకులు, అక్కడ ఆయన లేకపోవడంతో అదనపు ఎస్పీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు, మాజీ మంత్రి ఉండవల్లి, పెనుమాక ఘటనలపై గుంటూరు ఎస్పీని కలిసేందుకు వచ్చాం. వచ్చే ముందు రెండు రోజుల క్రితమే అపాయింట్ మెంట్ అడిగితే ఇవాళ ఉదయం ఫోన్ చేసి 4 గంటలకు రావాలని చెప్పారు. మేము కూడా చాలా షార్ప్ గా 4 గంటలకు వచ్చాం. కానీ ఎస్పీ గారు షార్ప్ గా 4 గంటలకే లేచి వెళ్లిపోయారు. ఇది చాలా దురదృష్టకరం అని బాధతో చెప్తున్నాం. మా దగ్గర వినతిపత్రం తీసుకోవడానికి కూడా లోకేష్ పర్మిషన్ కావాలా? చంద్రబాబు గారి పర్మిషన్ కావాలా? యాక్షన్ తీసుకోవడం సంగతి తర్వాత, కనీసం రెండు రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తే నాలుగు గంటలకు షార్ప్ గా రమ్మని చెప్పి అంతకు ముందు ఏం కబురు చేయకోకుండా అదనపు ఎస్పీకి చెప్పి వెళ్లిపోయారు. ఇది సరికాదు. ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు పోలీసుల ప్రవర్తన ఇలా ఉందంటే పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. గత నెల 27వ తేదీన మేము రైతులను పరామర్శించడానికి ఉండవల్లి వెళుతుంటే మధ్యలో దారి కాచి మా కార్లు పగలగొట్టి కొట్టడానికి ప్రయత్నం చేసి దౌర్జన్యం చేస్తే.. వెనక్కి తిరిగి వచ్చేసాం. తిరిగి మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. అసలు ఎక్కడ కుల దూషణ లేదు. అయినా కేసులు పెట్టారు. మేము ఇచ్చింది కూడా తూతూ మంత్రంగా ఫిర్యాదు తీసుకున్నారు. బందోబస్తుకు వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కి మీద పెద్ద రాయి పడింది. 14 కుట్లుపడ్డాయి. అయినా కేసు పెట్టలేదు. ఎందుకంటే ఆ రాయి ఎవరు విసిరారో వారికి తెలుసు. A1 గా అంబటి రాంబాబుని పెట్టండి. రాయి వేసింది నేనే. ఆ విజువల్స్ తీసేసి తలకాయ ఆ కిరణ్ తలకాయ స్ధానంలో నా తలకాయ పెట్టండి. ఏ వన్ అంబటి రాంబాబు, ఏ టు మొండి తోక, ఏ త్రీ అప్పిరెడ్డి, ఏ ఫోర్ డైమండ్ బాబు ఉన్నాంగా. అదన్నా పెట్టండి. ఈ అన్యాయాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నించడానికి మేము రాకూడదా? ఏ డీజీపీ, రిప్రెజెంటేషన్ తీసుకోడు. ఎవరికో అప్పచెబుతాడు. ఎస్పీకి ఇస్తే ఎవరికో అప్తజెప్తారు. ఎందుకంటే మా మొఖం చూడలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కలకాలంఇలాగే ఉండదు. ఐపీఎస్ లు కొద్దిగా అయినా న్యాయంగా ఉండాలి కదా? కేసు అన్నా రిజిస్టర్ చేయాలి కదా? ఈ కేసులకు భయపడతావా? కేసులకు భయపడం మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ గత 27వ తేదీన గుంటూరు జిల్లా పెనుమాకలో వైఎస్సార్సీపీ నాయకులపై జరిగిన దాడులపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చాం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు పెనుమాక గ్రామానికి వెళ్తుండగా.. ఉండవల్లి గ్రామంలో రైతు ముసుగులో టీడీపీ కార్యకర్తలు, నాయకులు మాపై దాడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాల్ని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూశారు. సంఘటన జరిగిన తర్వాత రోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా మీద జరిగిన హత్యా ప్రయత్నం, దానికి సంబంధించిన ఆధారాల్ని సమర్పించాం. కానీ తాడేపల్లి సీఐ ఆ కేసును రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా, కనీసం మేము ఇచ్చిన ఫిర్యాదుకు రసీదు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ఉన్నతాధికారులు అనుమతిస్తే ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అయినా రెండు, మూడు సార్లు సీఐని కలిసినా ప్రయోజనం లేదు. అయితే మాపై దాడులు జరిగితే, తిరిగి మమ్మల్నే నిందితులుగా పెట్టి మరో కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తుంటే... ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. పోలీసుల్ని మేం కోరేది ఏంటంటే, సరే మీరు ఎలాగో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లని చంపేసినా పట్టించుకోరు. హత్యా ప్రయత్నం చేసినా పట్టించుకోరు. దాడి చేసినా పట్టించుకోరు. మమ్మల్ని మా మీద ఏది చేసినా పట్టించుకోరు. కనీసం మీ సొంత పోలీసు, మీ కుటుంబ వ్యక్తి ఒక కానిస్టేబుల్ కి టీడీపీ నాయకుడు రాయి విసిరితే 14 కుట్లు పడి, మణిపాల్ హాస్పిటల్లో సృహ తప్పి పడిపోయిపోతే.. మేం ఎక్కడ పరామర్శకు వస్తామో అని ఆయన్ను చిత్తూరుకు పంపించేశారు. ఈ ఘటనపైనా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. అయినా ఇవాళ మరోసారి ఎస్పీ, అదనపు ఎస్పీకి ఆదారాలు సమర్ఫించాం. వీళ్లు కేసు నమోదు చేయకపోతే, న్యాయ పోరాటం చేస్తాం. ప్రైవేట్ కేసుకి ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఎవరైతే ఈ కేసు రిజిస్టర్ చేయట్లేదో, వాళ్లందరినీ కూడా అసెంబ్లీలో ప్రివిలెజ్డ్ కమిటీ ముందు నిలబెడతాం. తప్పకుండా వాళ్ల చేత కేసు రిజిస్టర్ చేసేలాగా, హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ నాయకుల్ని సైతం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదనపు ఎస్పీని కోరాం. ఆయన స్పందించకపోతే న్యాయపోరాటం తప్పదు. బాల వజ్రబాబు (డైమండ్ బాబు), గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ రైతులు మమ్మల్ని ఆహ్వానిస్తే, మేం పెనుమాకకు బయలుదేరాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు విసిరారు. సినిమాలో ఒక మారణకాండ సృష్టించడానికి ఏ విధంగా అయితే ప్రిపేర్ అయి ఉంటారో, అలా సిద్దమై వచ్చారు. మేము రైతులం అని చెప్తున్నా వాళ్లని చూస్తే ఏ ఒక్కరూ రైతుగా అనిపించలేదు. అందులో రాయపూడి కిరణ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ పై పెద్ద రాయి విసిరాడు. పోలీసుల్ని సాధారణంగా ఎవరూ కొట్టరు. ఆ రోజు ఆ రాయి ఆ కానిస్టేబుల్ కి మిస్ అయ్యి మా నాయకులకు తగిలితే ఏం జరిగేది ? వాళ్ల టార్గెట్ వేరు. ఆ కానిస్టేబుల్ చనిపోయాడు అని ఘటనా స్ధలంలో చెప్పారు. అంటే ఒక మారణకాండ సృష్టించారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకోటి అవసరం లేదు. దాడులు చేసిన వాళ్లు రైతులు అని చెప్పుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా బూతులు తిట్టారు. కులాలు లేదు, మతాలు లేదు, ఇష్టారాజ్యంగా మాట్లాడారు. మాపై దాడికి ప్రయత్నించారని పోలీసులకు చెప్తే.. ఆ సీఐ వచ్చి అంబటి రాంబాబు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నాడు. ఇది చూస్తుంటే అసలు పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉందా లేదా అనేది తెలియడం లేదు. కేవలం టీడీపీ వాళ్ల కోసమే ఈ వ్యవస్ధ నడుస్తున్నట్లుంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. ఆ కంప్లైంట్స్ తీసుకోవట్లేదని రిజిస్టర్ పోస్టులు చేశాం. ఎస్పీ, సీఐకి పంపించాం. అయినా కూడా చలనం లేదు. ఎఫ్ ఐఆర్ కూడా కట్టట్లేదు. ఆఖరికి ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తులు మమ్మల్ని తిట్టారు, కొట్టారు అని వాళ్లు కేసులు పెడితే, మా మీద ఎఫ్ ఐఆర్ లు కట్టి, మేము కోర్టులకు వెళ్లి, మేము అభ్యర్థించుకోవాల్సిన పరిస్థితులు తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు నాయకత్వంలో మేము ఇవాళ ఎస్పీని కలిసి మెమోరాండం ఇచ్చాం. ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు తిట్టారో, కొట్టారో వాళ్లని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేస్తున్నాం. నూరి ఫాతిమా, గుంటూరు ఈస్ట్ ఇన్ ఛార్జ్ సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతారు. దాడులు చేస్తే వాళ్లని చూసి వదిలేస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఇది. ఎమ్మెల్సీ, మాజీ మంత్రులపై దాడి చేస్తే పోలీసులు అక్కడే ఉండి ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఒక డ్రామా లాగా క్రియేట్ చేసి ఎదురుకేసులు పెడుతున్నారు. ఒక ప్రజా ప్రతినిధికే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? మేం ఫిర్యాదు చేస్తే తీసుకోకుండా ఉన్నతాధికారుల్ని అడగాలి అంటున్నారు. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద గాని, నిన్న జరిగిన అమరావతికి రైతులకు అండగా ఉండటానికి వెళ్తే మాపై కానీ దాడులకు దిగుతున్నారు. అమరావతిలో రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో రాష్ట్రం మొత్తానికి తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీపై ఉంది. కచ్చితంగా మా ఫిర్యాదు మీద ఎస్పీ గారు స్పందించకుండా వదిలేస్తే మాత్రం ఊరుకోం. ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడం.