తాడేపల్లి: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ, బీఎల్ఏల బాధ్యతలు, ఓటర్ల అవగాహన, ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టాల్సిన ప్రజా ఉద్యమాలపై ఆయన సమగ్ర దిశానిర్దేశం చేశారు. కీలక అంశాలు: * ఈ నెల 14తో ఇంటింటి సర్వే ముగియనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. * అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిస్థాయిలో జరిగిందో లేదో ప్రతి బూత్‌లో బీఎల్ఏలు నిర్ధారించాలి. * ఓటరు జాబితాల నుంచి పార్టీ ఓట్లు తొలగించకుండా కాపాడడంతో పాటు దొంగ ఓట్లను గుర్తించి తొలగించే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. * ఎస్‌ఐఆర్ ప్రక్రియకు మరో నెల గడువు పొడిగించాలని పార్టీ చేసిన విజ్ఞప్తిపై ఇప్పటికీ స్పందన లేకపోవడాన్ని గమనించాలని సూచించారు. * డిజిటలైజేషన్ ప్రక్రియలో జాప్యం, ఫారాల పంపిణీలో లోపాలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. * అర్బన్ ప్రాంతాల్లో బీఎల్ఏలకు అదనపు సపోర్టింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్‌లతో నిరంతర సమన్వయం కొనసాగించాలి. * ప్రతి అసెంబ్లీ సమన్వయకర్త రోజువారీ సమీక్ష నిర్వహించి ప్రతి బూత్ పరిస్థితిపై స్టేటస్ అప్‌డేట్ తీసుకోవాలి. * పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై నిశితంగా పర్యవేక్షించి ఓటర్లకు ఇబ్బందులు కలిగే మార్పులను వెంటనే గుర్తించాలి. * ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను మీడియా ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. * రైతులు, బాధిత కుటుంబాలు, ప్రజా సమస్యలపై ఇతర ప్రజాసంఘాలతో కలిసి విస్తృత పోరాటాలకు పార్టీ సిద్ధంగా ఉండాలి. "ప్రతి ఓటు విలువైనది... నిర్లక్ష్యానికి తావులేదు" ఎస్‌ఐఆర్ తుది దశలో ప్రతి బీఎల్ఏ అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఎన్నికల్లో విజయం, ఓటమి చాలాసార్లు ఐదు వేల నుంచి పది వేల ఓట్ల తేడాతోనే నిర్ణయించబడుతుందని, అందువల్ల ప్రతి ఓటును కాపాడుకోవడం పార్టీకి అత్యంత కీలక బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఓట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి ఓటర్‌కు ఎన్యూమరేషన్ ఫారం అందిందా లేదా అన్నది కచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో అధికార యంత్రాంగంపై ప్రభావం చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం వస్తోందని పేర్కొంటూ, అలాంటి పరిణామాలపై పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ఫారాలు అందకపోతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయడంతో పాటు పార్టీ కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని చెప్పారు. "రోజువారీ సమీక్షతో ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా పర్యవేక్షించాలి" ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి బూత్ పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు, టాస్క్‌ఫోర్స్ సభ్యులు, పార్లమెంట్, అసెంబ్లీ పరిశీలకులు, సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుని ఎస్‌ఐఆర్ ప్రక్రియను చివరి రోజు వరకు క్షుణ్ణంగా పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. బీఎల్ఏలు ఓటర్లకు ఎస్‌ఐఆర్‌పై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలని, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే మార్పులు ఉంటే వెంటనే స్పందించాలని సూచించారు. "ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి" రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో మీడియాను సమర్థంగా వినియోగించి పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడం, సోషల్ మీడియాపై చర్యలు, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సాయికృష్ణ, క్రాంతికుమార్ కుటుంబాలకు పార్టీ అండగా నిలిచిందని, రైతుల సమస్యలపై చేపడుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పక్షాలతో కలిసి ప్రజా సమస్యలపై మరింత విస్తృత పోరాటాలు నిర్వహించాలని, పోర్టులు, హార్బర్‌ల ప్రైవేటీకరణ వంటి అంశాలపై కూడా ప్రజల తరఫున బలమైన ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. పార్టీలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతర పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.