వైయ‌స్‌ జగన్ ఎదుట గోడు వెల్లబోసిన పొగాకు రైతులు

దేవరపల్లి పొగాకు యార్డులో రైతులతో ముఖాముఖి అయిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్

 గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు... కూటమి ప్రభుత్వంలో దారుణ పరిస్థితులంటూ రైతుల ఆవేదన

  "మీరు వస్తున్నారని కేజీకి రూ.10 పెంచారు"... రైతుల వ్యాఖ్య

 "ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది"... కన్నీటి పర్యంతమైన పొగాకు రైతులు

తూర్పుగోదావరి జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి టోబాకో బోర్డు పొగాకు యార్డుకు చేరుకుని అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పొగాకు వేలం ప్రక్రియ, ధరలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా పరిశీలించిన ఆయన, అనంతరం రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖిగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నాం

వైయ‌స్ జగన్ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్న రైతులు, గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయని, సాగు ఖర్చులు పెరిగినా పొగాకుకు సరైన ధర లభించడం లేదని వాపోయారు.

  "98 శాతం పొగాకును రూ.170కే కొనుగోలు చేస్తున్నారు"

పొగాకు గ్రేడింగ్ పేరుతో అధికశాతం ఉత్పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. 98 శాతం పొగాకును కేవలం కిలోకు రూ.170కే కొనుగోలు చేస్తున్నారని, దీంతో పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని వివరించారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన నేపథ్యంలోనే అధికారులు, కొనుగోలుదారులు కిలోకు మరో రూ.10 పెంచారని, లేకపోతే ఆ పెంపు కూడా ఉండేదే కాదని రైతులు పేర్కొన్నారు.

వైయ‌స్‌ జగన్ హయాంలో ధరలు... ఇప్పుడు భారీ పతనం

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర రూ.365 వరకు లభించేదని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం అదే పొగాకుకు సగటున రూ.260 మాత్రమే వస్తోందని, దీంతో ప్రతి రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాగు వ్యయం పెరిగిపోతున్నా, ఆదాయం తగ్గిపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

 వడ్డీలేని రుణాల నుంచి వడ్డీ భారం వరకు

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలు అందేవని రైతులు తెలిపారు. ప్రస్తుతం రుణాలపై వడ్డీ భారం మోపుతున్నారని, బ్యాంకు రుణాలతో పాటు ప్రైవేట్ అప్పుల భారంతో రైతులు కుంగిపోతున్నారని చెప్పారు.

  "మా గోడు వినడానికి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా రాలేదు"

తమ సమస్యలు చెప్పుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ ముందుకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ పొగాకు రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు యార్డుకు రాలేదని వాపోయారు.

  "ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది"

గిట్టుబాటు ధర లేకపోవడం, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, రుణ భారం కారణంగా అనేక మంది రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని కన్నీటి పర్యంతమై వైయ‌స్ జగన్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ఓపికగా విన్న వైయ‌స్ జగన్, వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గిట్టుబాటు ధర, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని వారికి భరోసా ఇచ్చారు.

Back to Top