తాడేపల్లి: వెలిగొండ ప్రాజెక్టు కింద తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తున్న నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, పునరావాస ప్యాకేజీలో భారీగా కోతలు విధించి ద్రోహానికి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు వాస్తవాలను, నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆధారాలతో సహా వివరించారు. అన్ని నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేసిన తర్వాతే ట్రయల్ రన్, ప్రారంభోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి, నేటి కూటమి ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కేటాయింపులే నిదర్శనమని ఎమ్మెల్యే విమర్శించారు. 2020లో జిఓ నెంబర్ 324, (24.06.2020) ద్వారా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం ఏకంగా రూ.1,301.56 కోట్లు కేటాయించారని చెప్పారు. కానీ, ప్రస్తుత వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ఆ ప్యాకేజీలో దారుణంగా కోతలు విధించిందని, అర్హులైన వందలాది కుటుంబాలను ఉద్దేశపూర్వకంగా జాబితా నుంచి తొలగించి, కేవలం 7,300 మందిని మాత్రమే లెక్కలోకి తీసుకుందని ధ్వజమెత్తారు. వీరికి కూడా జగన్ గారు కేటాయించిన మొత్తాన్ని కాకుండా, కేవలం రూ.768 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి.. "మేము ప్యాకేజీ ఇచ్చేశాం, ఇక తట్టాబుట్టా సర్దుకుని ఖాళీ చేసి వెళ్లిపోండి" అని గిరిజనులను నిర్దాక్షిణ్యంగా వెన్నుపోటు ప్రభుత్వం తరిమేస్తోందని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండిన యువతకు దక్కాల్సిన పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం ఎగ్గొడుతోందని ఆయన దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... సొరంగం తవ్వింది మేమే.. ఆర్భాటం బాబుది 1996 ఎన్నికల సమయంలో ప్రాజెక్టు పేరు వాడుకునేందుకు రూ.10 లక్షలతో టెంట్లు వేసి చంద్రబాబు కొబ్బరికాయ కొట్టారు తప్ప ప్రాజెక్టు కోసం చేసింది శూన్యం. చంద్రబాబు తన హయాంలో రెండు సొరంగాలు కలిపి కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే తవ్వితే.. వైఎస్సార్ గారు 20.3 కిలోమీటర్లు, జగన్ గారు కరోనా కష్టకాలంలోనూ నిలబడి 10.56 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వించి ప్రాజెక్టును సాకారం చేశారు. గిరిజనులపై వెన్నుపోటు ప్రభుత్వం కర్కశం 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇచ్చి, నివాసాలు కల్పించిన ఆరు నెలల తర్వాతే ప్రాజెక్టులో నీళ్లు నింపాలి. కానీ, ఆగస్టు 31న ప్రారంభోత్సవం పేరుతో.. కరెంటు కట్ చేసి, గిరిజనులు వేసుకున్న 2000 ఎకరాల పత్తి, మిర్చి పంటలను నాశనం చేస్తూ పోలీసుల సాయంతో వారిని రోడ్డున పడేస్తున్నారు. ఫీడర్ కెనాల్ పేరుతో మళ్లీ దోపిడీ ఫీడర్ కెనాల్ నిర్మాణంలో గతంలో 630 కోట్ల స్కామ్ జరిగిందని కాగ్ అక్షింతలు వేసినా, ఇప్పుడు మళ్లీ అదే కాలువకు లైనింగ్ పేరుతో తన అస్మదీయ కాంట్రాక్టర్‌కు రూ. 450 కోట్లు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఎర్రగొండపాలెంకు నీరందించే తీగలేరు కాలువకు రూ.110 కోట్లు కేటాయించినా, ఇప్పటి వరకు అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదు. 2014-19 మధ్య వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడు. పరిహారం చెల్లించాకే ప్రారంభించాలి సొంతంగా కలెక్టర్ ఆఫీసు కూడా నిర్మించుకోలేని స్థితిలో ఉండి.. వైయస్ఆర్‌సీపీ కట్టిన ఆర్ అండ్ ఆర్ భవనంలో ఆఫీసు పెట్టుకుని వెలిగొండ క్రెడిట్ కొట్టేయాలని చూడటం సిగ్గుచేటు. తక్షణమే ఈ హడావుడి ఆపి నిర్వాసితులందరికీ పూర్తి ప్యాకేజీ చెల్లించి నివాసాలు కల్పించాలి. అలా కాకుండా ఆగస్టు 31న ముందుకు వస్తే, మీ పర్యటనను కచ్చితంగా అడ్డుకుంటాం. త్యాగం చేస్తున్న నిర్వాసితుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి పోరాడుతుందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.