తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నేతలకు వైయస్. జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సమావేశం అనంతరం పార్టీ ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం గత రెండున్నరేళ్ల కాలంలో ప్రజలను అన్ని రంగాల్లో దారుణంగా వంచించిందని ధ్వజమెత్తారు. ‘సూపర్ సిక్స్’, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలు, పోలీసుల దౌర్జన్యాలు, నకిలీ ఓట్ల ఆధారంగా అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలిపి, ప్రజల పక్షాన పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి సర్వసన్నద్ధంగా ఉందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే... *ఆర్కే రోజా (మాజీ మంత్రి):* *కూటమి ప్రభుత్వ మోసాలు, కుట్రలను తిప్పికొడతాం..* *స్థానిక పోరులో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగరేస్తాం!* స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని మా పార్టీ అధ్యక్షుడు వైయస్. జగన్ మోహన్ రెడ్డి గారు మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టి, పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసి గెలవాలని, లేదా దొంగ నాటకాలు ఆడి గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ కుట్రలను భగ్నం చేసి, ప్రజలకు నిరంతరం సేవలందించే సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించి వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగరేస్తుంది. గత ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేయడమే కాకుండా, వైయస్. జగన్ ఇచ్చే సంక్షేమం కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను దగా చేశారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా ఇంటింటికీ సంక్షేమం అందించిన వైయస్. జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎస్ఐఆర్‌లోనే 45 లక్షలకు పైగా నకిలీ, గుర్తించని ఓట్లు ఉన్నాయని తేలింది. అలాంటిది పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? ఇది ముమ్మాటికీ నేరపూరిత ఆలోచన కాదా? బీసీ రిజర్వేషన్ 44 శాతానికి పెంచుతూ జీవో 105 పేరుతో మరో నాటకానికి తెరతీశారు. గతంలోనే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై కోర్టు కొట్టివేసిన విషయం తెలిసి కూడా, మళ్లీ అదే దొంగ జీవో ఇచ్చి ఎన్నికలు ఆపించేందుకు కుట్ర పన్నుతున్నారు. వైయస్. జగన్ చిత్తశుద్ధితో బీసీలకు అత్యధిక స్థానాలు ఇచ్చి జడ్పీ చైర్మన్లు, మేయర్లుగా చేశారు. రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు, 50 ఏళ్లకే పెన్షన్ అన్న హామీ ఏమైంది? కొత్త రేషన్ కార్డు, ఇంటి పట్టా, నిరుద్యోగ భృతి ఏవీ ఇవ్వలేదు. మూడు బడ్జెట్లలో రూ.2.39 లక్షల కోట్లకు గాను రూ.31,500 కోట్లు (13 శాతం) కూడా ఖర్చు చేయకుండా అమరావతి పేరుతో దోచుకుంటున్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే పోలీసు అధికారుల పేర్లు డిజిటల్ బుక్‌లోకి ఎక్కుతాయి, చట్టం ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. *అంబటి రాంబాబు (మాజీ మంత్రి):* *వెన్నుపోటు కూటమి పాలనకు ప్రజలు చరమగీతం పాడటం ఖాయం..* *అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి!* చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, మండలాలు, జెడ్పీటీసీలు.. ఎక్కడ ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. ఎన్నికలు ధర్మంగా, పారదర్శకంగా జరిగితే వైఎస్సార్‌సీపీ అఖండ మెజారిటీ సాధించే వాతావరణం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 26 నెలల పాలనలో తెలుగుదేశం పార్టీ కూటమిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా మారిన ఇది ముమ్మాటికీ వెన్నుపోటు ప్రభుత్వం. గతంలో బంధువులను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఇప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. మొన్న పులివెందుల స్థానిక ఎన్నికల్లో ఓటర్లను కాకుండా పోలీసులను, టీడీపీ నాయకులను పెట్టి ఓట్లు వేయించుకున్న దుర్మార్గాన్ని చూశాం. అలాంటి అక్రమాలకు తావులేకుండా ఎన్నికల కమిషన్, పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అధికార పార్టీకి తొత్తులుగా మారే అధికారులను, తప్పు చేసేవారిని గుర్తించి భవిష్యత్తులో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మా అధినేత వైయస్. జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. *సాకే శైలజానాథ్ (మాజీ మంత్రి):* *బీసీలకు ద్రోహం చేస్తూ అబద్ధాల పాలన..* *స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం!* సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే నిబంధన తెలిసినప్పటికీ, చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను మోసం చేస్తూ ద్రోహపూరిత ప్రకటనలు, జీవోలతో మోసగిస్తున్నారు. గతంలో తెలంగాణలో గానీ, ఏపీలో గానీ రిజర్వేషన్ల పరిమితి దాటితే కోర్టులు ఎన్నికలను నిలిపివేసిన వాస్తవాన్ని కప్పిపుచ్చి ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉంది. ప్రజలకు సంక్షేమాన్ని, మేలును అందించిన పార్టీగా వైయస్. జగన్ నాయకత్వంలో మేం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, దుర్మార్గాలను ఎదుర్కొని పంచాయతీ స్థాయి నుంచి ప్రతి స్థానంలోనూ మా కార్యకర్తలు పోటీలో నిలుస్తారు. రెండున్నరేళ్ల పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి, ప్రజల ఆస్తులను కారుచౌకగా అమ్మేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, సాగు చేయవద్దని చెప్పే దుస్థితి తెచ్చారు. రాయలసీమలో కృష్ణా జలాలు అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ అరాచక పాలనపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి ఘన విజయం సాధిస్తాం. *మార్గాని భరత్ (మాజీ ఎంపీ):* *మహిళలు, బీసీలను నిలువునా వంచించిన కూటమి సర్కార్..* *ఓపెన్ చర్చకు సిద్ధమా?* కూటమి ప్రభుత్వానిది ముమ్మాటికీ మోసపూరితమైన వెన్నుపోటు పాలన, ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రతి నియోజకవర్గ అభ్యర్థితో ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున 'తల్లికి వందనం' ఇస్తామని పత్రాలు పంపిణీ చేశారు. అలాగే 50 ఏళ్లు దాటిన మహిళలందరికీ రూ.4,000 పెన్షన్ (ఏడాదికి రూ.48,000) ఇస్తామని నమ్మబలికారు. మరి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఆ హామీలు ఏమయ్యాయి?" డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌లకు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం ద్వారా చట్టసభలు, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను ఎందుకు తీసుకురాలేకపోయారు? కోర్టులు కొట్టేస్తాయని తెలిసి కూడా పనికిరాని జీవోలు ఇస్తూ ప్రజలను ఏమారుస్తున్నారు. గత 21 ఏళ్లలో చంద్రబాబు బీసీలకు ఏం చేశారు? మా జగనన్న 5 ఏళ్లలో బీసీలను సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఎలా ఉన్నత స్థానాల్లో నిలబెట్టారో తేల్చుకోవడానికి లోకేష్ ఓపెన్ చర్చకు సిద్ధమా? జగనన్న నలుగురు బీసీలకు రాజ్యసభ ఇచ్చారు, అత్యధికంగా ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, ఎంపీ సీట్లు ఇచ్చి గౌరవించారు. విద్యార్థులకు టోఫెల్, బైజూస్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ట్యాబ్‌లు ఇచ్చి ఉన్నత చదువులు చెప్పించిన ఘనత జగనన్నది. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకపై జరిగిన దారుణ ఘటనను మూడు రోజుల పాటు కప్పిపుచ్చాలని చూశారు. ఢిల్లీ నిర్భయ, కోల్‌కతా అభయ ఘటనల మాదిరిగానే రాజమండ్రి ఘటన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం కాబోతోంది. మహిళలను, బీసీలను అన్ని వర్గాలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గట్టి బుద్ధి చెప్పడం ఖాయం.