తాడేపల్లి: మహనీయురాలు మదర్ థెరిసా జయంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆమెకు నివాళులర్పించారు. మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మదర్ థెరిసా సేవలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని అన్నారు. ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఎంత చిన్న సేవ అయినా ఒకరి జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదని ఆమె జీవితం చాటిచెప్పిందన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే మదర్ థెరిసాకు మనం అందించే నిజమైన నివాళి అని వైయస్ జగన్ తెలిపారు. మదర్ థెరిసా స్ఫూర్తితో ప్రేమ, దయ, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.