రాజమహేంద్రవరం: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో వైయస్ఆర్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో "ఏపీ జెన్ జెడ్ వార్" పేరుతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, మేధావులు, వ్యాపార ప్రముఖులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. - డీఎస్సీ అక్రమాలపై పూర్తి విచారణ జరగాలి సమావేశంలో మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు, మెరిట్ జాబితా ప్రకటించకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి అమలు చేయాలని కోరారు. - విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి నీట్, డీఎస్సీ వంటి కీలక పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠినమైన శిక్షలు అమలు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.