పెనుకొండ: డీఎస్సీ-2025 నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలను నిరసిస్తూ, నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. పరిగి మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ నాయకత్వం వహించగా, యువజన విభాగం నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ... డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్న పరిణామాలు లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం కష్టపడి సిద్ధమైన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని ఆరోపించారు. వెంటనే స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపి అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆమె మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగ భృతి హామీపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. విద్యార్థుల సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. లోకేష్ రాజీనామా చేయాలి విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించిన ఉషశ్రీ చరణ్, ఈ పరిస్థితికి రాజకీయ, పరిపాలనా బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ నిర్వహించి, అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగే వరకు వైయస్సార్‌సీపీ నిరుద్యోగ యువతకు అండగా పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.