పార్వతీపురం మన్యం జిల్లా: భామిని మండలం పాలవలస గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి గిరిజన రైతుల ఇళ్లు, పంటలు, కోళ్ల ఫారాలు, ధాన్యం, అరటి తోటలను ధ్వంసం చేయడంతో బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. బాధిత రైతులను పరామర్శించిన మండల నాయకులు నష్టాన్ని పరిశీలించి తక్షణ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏనుగుల దాడిలో నిమ్మల లింగన్న, నిమ్మల గణేష్, నిమ్మల సుధాకర్, కొండగొర్రి దాలయ్యలకు చెందిన ఇళ్లు, ధాన్యం, నిత్యావసర వస్తువులు, కోళ్ల ఫారం, అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైయస్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించి, నష్టపోయిన పంటలు, ఆస్తులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి ఈ సందర్భంగా మండల ఎంపీపీ ప్రతినిధి తోట సింహాచలం మాట్లాడుతూ, గత రెండేళ్లుగా జిల్లాలో ఏనుగుల బెడద తీవ్రరూపం దాల్చిందని, ముఖ్యంగా భామిని మండలంలో రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు. అడవి జంతువుల వల్ల నష్టపోయే రైతులకు పరిహారం కల్పించే జీవో నెం.57ను సవరించి మెరుగైన నష్టపరిహారం అందించాలని కోరారు. జిల్లాకు తీసుకొచ్చిన కుంకీ ఏనుగులను సమర్థంగా వినియోగించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, రైతుల ప్రాణాలు, పంటలు, ఆస్తులను రక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.