తూర్పు గోదావరి జిల్లా: రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కూతురిని కాపాడుకుంటుందన్న ఆశతో ఇన్నాళ్లూ ఆస్పత్రి చుట్టూ తిరిగిన కుటుంబానికి ప్రియాంక మృతి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద సమయంలో వైయస్ఆర్‌సీపీ అండగా నిలిచింది. ప్రియాంక మృతి విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నేత తాటిపర్తి చంద్రశేఖర్ , పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆస్పత్రికి వెళ్లి ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించారు. తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి బాధలో వైయస్ఆర్‌సీపీ భాగస్వామిగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా నిలిచి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఆరె శ్యామల స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఘటన జరిగిన తర్వాత ఇన్ని రోజులు గడిచినా కుటుంబానికి తగిన న్యాయం అందకపోవడం ఆవేదన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఒక కుటుంబం కూతురిని కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న వేళ.. వారి కన్నీటిని తుడవడానికి ముందుకు వచ్చిన వైయస్ఆర్‌సీపీ నాయకత్వం.. "మీరు ఒంటరివారు కాదు.. న్యాయం జరిగే వరకు మీ వెంటే ఉంటాం" అనే భరోసా ఇచ్చింది. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నాయకులు తెలిపారు.