తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో స్కాం జరిగిందని ఎన్నో ఆధారాలతో మేం బయటపెట్టినా, ఇంకా ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకుండా, ఉద్యోగాలు వచ్చిన వాళ్లతో నిరసనలు చేయించడం, ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయించడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు బయటికి రావాలంటే సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేనని, అంతకన్నా ముందు మంత్రి నారా లోకేష్ రాజీనామా చేస్తే ఈ దర్యాప్తు పారదర్శకంగా ముందుకు సాగుతుందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మండలి సమావేశాల్లోనూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ప్రెస్ మీట్లో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇంకేమన్నారంటే... డీఎస్సీ రద్దు కోరట్లేదు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే : డీఎస్సీ స్కాంపై వేలాది మంది ప్రతీ నియోజకవర్గంలో నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారు. మేం డీఎస్సీని రద్దు చేయమని అడగట్లేదు, ప్రస్తుత ఉద్యోగాలు తీసేయమని అడగడం లేదు, కేవలం సీబీఐ దర్యాప్తు చేయమని అడుగుతున్నాం. సీబీఐ దర్యాప్తులో తప్పులు తేలితే వాటిపై ఏ శిక్ష వేయాలన్నది కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. లోకేష్ మంత్రిగా ఉండగా సీబీఐ దర్యాప్తు చేసినా పారదర్శకంగా విచారణ జరగదు కాబట్టి, ఆయన ముందుగా రాజీనామా చేయాలనేది మా డిమాండ్. సీబీఐ దర్యాప్తులో లోకేష్ కు క్లీన్ చిట్ వస్తే ఆయన విద్యాశాఖ మంత్రి పదవిలో తిరిగి కొనసాగవచ్చు. డీఎస్సీలో పేపర్లు అమ్ముకోవడం, లీకుల దగ్గరి నుంచీ, స్పోర్ట్స్ కోటా అక్రమాల వరకూ అన్నీ సాక్ష్యాధారాలతో బయటికి వచ్చాయి కాబట్టి సీబీఐ దర్యాప్తు వేయమని అభ్యర్ధులు అడుగుతున్నారు, మేం అడుగుతున్నాం. కోర్టుల్లో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుని సీబీఐ దర్యాప్తు పడదని సంబరాలు చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని అభ్యర్ధులు రోడ్లపైకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్ మంత్రిపై వోక్స్ వ్యాగన్ ఆరోపణలు వస్తే, పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రిపై కోర్టులో పేపర్లు మిస్సింగ్ ఆరోపణలు వస్తే సీబీఐ దర్యాప్తులు చేయించి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. కానీ డీఎస్సీలో ఇన్ని అక్రమాలు జరిగాయని బయటపడినా, వాటిపై దర్యాప్తు చేయించకుండా క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు. అడుగడుగునా తప్పులు, చేతకానితనం, అవినీతి వల్ల ఇవాళ ఇన్ని లక్షల మంది రోడ్లపైకి వస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ బయటపడుతున్న డీఎస్సీ అక్రమాలు; నవీన్ ఎపిసోడ్ లో ఎస్సీఈఆర్టీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు, ప్రశ్నాపత్రం తయారు చేసింది ఇదే ఎస్సీఈఆర్టీ. డీఎస్సీ నిర్వహణ, ఎస్సీఈఆర్టీని పర్యవేక్షించింది కృష్ణారెడ్డి. అలాగే ఈ నవీన్ కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా ?, మరో సబ్జెక్టులో ఆరో ర్యాంక్ వచ్చిందా లేదా ? నవీన్ ద్వారా చాలా మంది విద్యార్ధులకు, కొన్ని కోచింగ్ సెంటర్లకు ప్రశ్నాపత్రాలు సర్కులేట్ అయ్యాయన్న ఇవాళ అభ్యర్ధులు సాక్షాలతో సహా ముందుకు వస్తున్నారు. ఆ కోచింగ్ సెంటర్ల పేర్లు కూడా చెప్తున్నారు. ఎవరెవరు దీంతో లబ్ది పొందారన్నది కూడా చెప్తున్నారు. అయినా డీఎస్సీ మొత్తం రద్దు చేయమని మేం అడగట్లేదు. సీబీఐ దర్యాప్తులో తప్పులు రుజువైతే మాత్రం తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. లేకపోతే ఏ నిరుద్యోగికీ ఈ ప్రభుత్వంపై, పరీక్షలపై నమ్మకం ఉండదు. మదనపల్లెలో ఓ సబ్దెక్టుకు సంబంధించి ట్రాన్సలేటర్ ను ప్రశ్నాపత్రం తయారీకి పిలిపించారు. ఆయన ఫ్రెండ్ కుటుంబంలో ముగ్గురికి టాప్ ర్యాంకులతో ఉద్యోగాలు వచ్చాయి. అక్కడ ఉన్న వారందరికీ వీరి ద్వారా పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒంగోలులో ఓ ప్రభుత్వ ఉద్యోగి ద్వారా టెట్ పరీక్ష చెన్నై పరీక్ష కేంద్రంలో అక్రమాలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన ఇవాళ కృష్ణాజిల్లా, ప్రకాశం జిల్లాలో ఉన్న రెండు కోచింగ్ సెంటర్లలో మాక్ టెస్టుల పేరుతో అసలు ప్రశ్నలు లీక్ చేశారని, వారికి ఉద్యోగాలు వచ్చాయని తేలుతోంది. ఇలా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటాలో లెక్కలేనన్ని అక్రమాలు: గత కొన్ని నెలలుగా జరుగుతున్న నిరసనల్లో వందల మంది అభ్యర్ధులు పాల్గొంటున్నారు. వీటికి కారణం స్పోర్ట్స్ కోటాలో మీరు తెచ్చిన రెండు జీవోలు. వాటిలో ఎలా అవినీతి, అక్రమాలు చేయొచ్చో పూర్తిగా ఉంది. ఫెడరేషన్లు, అసోసియేషన్లకు ప్రాధాన్యం ఇచ్చి, యూనివర్సిటీ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఎక్కువ మంది ఆడే క్రికెట్ ను కేటగిరీ -బీలో పెట్టడం, అందులో ఒకే ఒక్క ఉద్యోగం రావడం, ఎలాంటి అర్హతలు లేని ఆటలకు వందల ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగాయి. ఇందులో పేకాట వంటి ఆటలు కూడా ఉన్నాయి. ఈ గేమ్ అడితే చాలు ఎలాంటి పరీక్ష లేకపోయినా ఉద్యోగాలు ఇస్తామని జీవోలు ఇవ్వడం అక్రమాలకు నిదర్శనం. స్పోర్ట్స్ కు సంబంధించి ఇచ్చిన జీవోల్లో విచ్చలవిడితనం కనిపిస్తోంది. నిబంధనల్ని పూర్తిగా తుంగలోకి తొక్కేందుకే ఈ జీవోలు ఇచ్చారు. గతంలో నేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పలు ఆధారాలు ఇచ్చాం. వేర్వేరు గేమ్స్ ఆడినా, హయ్యస్ట్ అచీవ్ మెంట్ సర్టిఫికెట్ ఉన్న గేమ్ కు బ్యాకప్ గా దాని కింద స్ధాయిలో ఆడిన గేమ్ పెట్టాలి. కానీ మీరు రూల్స్ కు విరుద్దంగా హయ్యస్ట్ అచీవ్ మెంట్ సర్టిఫికెట్ వాలీబాల్ లో ఉంటే, బ్యాకప్ సర్టిఫికెట్ కబడ్డీలో పెట్టారు. ఒకే అభ్యర్ధి హయ్యస్ట్ అచీవ్ మెంట్ సర్టిఫికెట్ ఒకరిది పెట్టుకుంటారు, బ్యాకప్ సర్టిఫికెట్ ఇంకొకరిది పెట్టుకుని ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇంతకంటే అవినీతి ఉంటుందా ?, ఒకే ఆటకు రెండు సర్టిఫికెట్లు పరిగణనలోకి తీసుకున్నారు. ఆడింది ఒకే గేమ్ అయినా పార్టిసిపేషన్, అచీవ్ మెంట్ పేరుతో రెండు సర్టిఫికెట్లు ఇచ్చారు. మీ అసోసియేషన్లు, ఫెడరేషన్లు ఇచ్చిన సర్టిఫికెట్లు హయ్యస్ట్ అచీవ్ మెంట్ ఓ ఏడాది, బ్యాకప్ సర్టిఫికెట్ ఆ తర్వాత ఏడాది ఇచ్చినవి ఉన్నాయి. కొన్ని సర్టిఫికెట్ల మీద ఎవరి పేర్లూ, సంతకాలూ లేవు. అందుకే సర్టిఫికెట్ల ధృవీకరణ పూర్తి చేసిన తర్వాత కూడా కొందరికి ఉద్యోగాలు రాలేదు. మీ కార్యకర్తలకు, అనుయాయులకు, ఇవ్వాలనుకున్న వాళ్లందరికీ ఇలాగే ఉద్యోగాలు ఇచ్చేశారు. చరిత్రలో మొట్టమొదటి సారిగా వ్యక్తిగతంగా మెసేజ్ లు పంపి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి, ఉద్యోగాలు కూడా ఇచ్చేశాక మెరిట్ లిస్ట్ బయటపెట్టారు. రిజర్వేషన్, నార్మలైజేషన్ పేరుతో ఇష్టారాజ్యం: పీడీ, పీఈటీలకు తప్ప మిగతా సబ్జెక్ట్ టీచర్లందరికీ టెట్ తప్పనిసరి. కానీ మీరు టెట్ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చిన విషయం మేం ఇప్పటికే బయటపెట్టాం. ఇప్పుడు కూడా టెట్ రాయకపోతే టీచర్లను పక్కనబెట్టే నిబంధనలు ఉన్నాయి. అయినా మీరు టెట్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చేశారు. రిక్రూట్ మెంట్ పూర్తయ్యాక తప్పులు జరిగాయని తెలిసినా కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. మీ వాళ్లు అయితే ఉద్యోగాలు ఇచ్చారు, కాకపోతే వాళ్ల గొంతు కోశారు. వర్టికల్ లేదా హారిజాంటల్ రిజర్వేషన్ అమలులోనూ తప్పిదాలే. వర్టికల్ లో రిజర్వేషన్లు ఇచ్చాక, వాటిలో మళ్లీ ప్రతీ వర్టికల్ లో హారిజాంటల్ లో రోస్టర్ జరగాలి. సోర్ట్స్ కోటా కూడా అన్ని కేటగిరీలకూ వేర్వేరుగా ఉండాలి. కానీ అలా జరగలేదు. హారిజాంటల్ రిజర్వేషన్ లో కూడా తగిన అర్హతలు ఉన్న వాళ్లు లేకపోతే జనరల్ కేటగిరీలో ఉద్యోగాలు ఇవ్వాలి, అది కూడా చేయలేదు. శాప్ కూడా మేం తప్పులు చేశామని లేఖ పంపినా, అప్పటికే ఈ వ్యవహారం క్లోజ్ చేసేశామని చెప్పేశారు. వీళ్లంతా మళ్లీ ఎప్పుడు పరీక్షలు రాయాలి, వాళ్లకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు లక్షా 26 వేల మంది సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఒకే రోజు సింగిల్ టెస్ట్ ఆఫ్ లైన్ లో పెట్టి, వివాదాలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు. అప్పట్లో 16 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇప్పుడు మూడున్నర లక్షల మంది రాశారు. నెల రోజుల పాటు పరీక్షలు పెట్టి, నార్మలైజేషన్ పేరుతో ఇష్టారాజ్యంగా అభ్యర్ధులకు మార్కులు కలిపారు. 0.1 మార్కులతో కూడా ఉద్యోగం కోల్పోయే పరిస్ధితుల్లో కొన్ని సెషన్లలో 6 మార్కులు కూడా కలిపారు. దీంతో వేల మంది నష్టపోయారు. జిల్లా స్దాయిలో సెలక్షన్ జరగాల్సిన డీఎస్సీలో కష్టమైన సెషన్లు ఉన్నాయంటూ ఇష్టారాజ్యంగా మార్కులు కలిపేసి ప్రతిభ కలిగిన వారిని మోసం చేశారు. ఇన్ని అన్యాయాలు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా జరగాలన్నదే మా డిమాండ్. అప్పటివరకూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది. శ్రీకాకుళంలో బాక్సింగ్ హయ్యస్ట్ అచీవ్ మెంట్ సర్టిఫికెట్ ఒకరిది, బ్యాకప్ సర్టిఫికెట్ మరొకరికి పెట్టారు. అండర్ టేకింగ్ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ల సర్టిఫికెట్లు వెబ్ సైట్లో పెట్టారు. వాటినే సాక్ష్యాలుగా మేం చూపించాం. వారం రోజుల క్రితం ఆ వైబ్ సైట్ లో సర్టిఫికెట్లు ట్యాంపర్ చేసేశారు. మేం తప్పులని చూపించడానికి వీలుగా వాటిని డౌన్ లోడ్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి మీరు చేసిన మార్పులన్నీ దర్యాప్తులో బయటికి వస్తాయి. మీరు ఇలాంటి పనులు చేస్తే ఇక ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారు. గోల్డ్ మెడల్స్ వచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదని అభ్యర్ధులు ఫిర్యాదులు చేసినా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా నార్మలైజేషన్, స్పోర్ట్స్ కోటా జీవోల వల్ల అన్యాయమైపోయిన వారికి న్యాయం జరగాలంటే సీబీఐ దర్యాపు జరిపించాల్సిందే. వీటిపై త్వరలో జరిగే మండలి సమావేశాల్లోనూ మేం ప్రశ్నిస్తాం. డీఎస్సీ అక్రమాలపై పాటలు పాడినా తప్పేనా ?: డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న నిరాహారదీక్షలో కార్యకర్తలు హామీలు నిలబెట్టుకోలేదని పాటలు పాడితే, వాటి ఆధారంగా మాపై కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఆలోచిస్తే లోకేష్ ఈపాటికి జైల్లో ఉండాలి. కానీ ఆయన చాలా పారదర్శకంగా ఆలోచించి ఇలాంటి పనులకు దూరంగా ఉన్నారు. టీడీపీ, బీజేపీ కార్యకర్తలు గతంలో ఇలాంటి పాటలే పాడిన సందర్భాలు ఉన్నాయి కదా. వాటిపై కూడా పోలీసులు కేసులు పెట్టారా ? మీరు రాజకీయాల కోసం మతాల్ని వాడుకోవచ్చు. గతంలో లోకేష్ గోవిందా.. గోవిందా అనే మాటలు వాడలేదా ?, టీడీపీ మహానాడులో సైతం ఇలా గోవిందా అంటూ పాటలు పాడలేదా ?, ఇతర పార్టీల వారు సైతం ఇలాంటి పద ప్రయోగంతో పాటలు పాడలేదా ?, ఇవన్నీ మీకు తప్పనిపించడం లేదా ? మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటారా ? డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్ధుల్ని కర్నూలుకు వచ్చి కార్యక్రమాలు చేయమని మీకు ఎవరు చెప్పారు, మీ ఉద్యోగాలు తీసేయమని ఎవరు అడిగారు, సీబీఐ దర్యాప్తు వేయమని మాత్రమే కదా మేం అడుగుతున్నాం. డీఎస్సీలో అక్రమాలు జరగకపోతే మీకు క్లీన్ చిట్ వస్తుంది కదా. అది వదిలేసి ఎందుకు ఇలా ఉద్యోగాలు ఇచ్చిన అభ్యర్ధుల్ని తెచ్చి వైఎస్సార్సీపీని తిట్టిస్తున్నారు, రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాదా ?, అప్పుడైనా సీబీఐ దర్యాప్తు చేయిస్తుందన్న విషయం తెలుసుకోండి. కాబట్టి లోకేష్ రాజీనామా చేశాకే సీబీఐ దర్యాప్తు జరగాలని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.