తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వాటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రజల గళాన్ని బలంగా వినిపించాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు/పార్లమెంట్ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు/నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంటు పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులతో శనివారం సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎస్సీ అంశంపై చేపట్టాల్సిన తదుపరి ఆందోళన కార్యక్రమాలతో పాటు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన దిశానిర్దేశం చేశారు. లోకేష్ రాజీనామా డిమాండ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలన్నది నిరుద్యోగ యువత, అభ్యర్థుల న్యాయమైన డిమాండ్ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ బలపడుతోందన్నారు. కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, కానీ రాష్ట్రంలో డీఎస్సీపై ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ నారా లోకేష్ మాత్రం బాధ్యత తీసుకోవడం లేదన్నారు. లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో టీడీపీలో ఆందోళన మొదలైందని, బయటకు ఎంత బింకంగా కనిపిస్తున్నా లోపల మాత్రం భయపడుతున్నారని అన్నారు. ఈ అంశాన్ని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని, జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని సజ్జల తెలిపారు. అందువల్ల ఈ నెల 10న జరిగే ర్యాలీలను ప్రతి నియోజకవర్గంలో భారీగా, విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు చొరవ తీసుకుని పనిచేయాలని, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలను కూడా కలుపుకొని కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. యువత, విద్యార్థిలోకం పెద్ద ఎత్తున కదిలివచ్చేలా కార్యక్రమాలను రూపొందించాలని, నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేసి ర్యాలీలను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించిందని, వాటిని కొనసాగిస్తూ సోమవారం జరిగే ర్యాలీలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలని, డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పార్టీ చేస్తున్న పోరాటం జాతీయస్థాయిలో చర్చకు వచ్చేలా కార్యక్రమాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు అత్యంత సీరియస్‌గా తీసుకుని, పార్టీ యంత్రాంగం మొత్తం సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌లో ప్రతి ఓటుపై అప్రమత్తంగా ఉండాలి టెలికాన్ఫరెన్స్‌లో రెండో ప్రధాన అంశంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం బూత్ లెవల్ ఏజెంట్లకు డిలీటెడ్ ఓటర్ల జాబితాలు, బూత్ మార్పులకు సంబంధించిన జాబితాలు అందాయని, అదేవిధంగా కొత్తగా చేర్చిన ఓటర్ల వివరాలు కూడా అందుబాటులో ఉన్నందున వాటిని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌ను ప్రతి బూత్ స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా అన్యాయంగా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల అధికారుల నుంచి నోటీసులు అందుకున్న ఓటర్ల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారికి అవసరమైన సహాయం అందించాలని చెప్పారు. బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) సంబంధిత బూత్ లెవల్ అధికారులతో (BLOలు) నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరాన్ని బట్టి కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాలకు సంబంధించిన ఫారం–6, ఫారం–7 లను నిబంధనల మేరకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పార్టీ నాయకులు సాధారణ అంశంగా చూడకూడదని, బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పూర్తి పర్యవేక్షణ ఉండాలని సజ్జల స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన పార్టీ క్లస్టర్లను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేసి, బీఎల్‌ఏలు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచాలని ఆయన ఆదేశించారు.